ఎనిమిదేళ్ల సమస్య.. ఎట్టకేలకు పరిష్కారం.!   

– నవతెలంగాణ కథనంతో కదిలిన అధికారులు
– ఆ ఊరి సమస్యలకు శాశ్వత పరిష్కారం
నవతెలంగాణ – గంగాధర 
ఎనిమిదేళ్లుగా అపరిష్కృతంగా మిగిలిన ఓ గ్రామ సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. గంగాధర మండలం తాడిజెర్రి గ్రామంలో ఏళ్లుగా నెలకొన్న పలు సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. సర్పంచులు మారిన సమస్యలు సమస్యలుగానే ఉండి పోయాయి. అటువంటి జటిలమైన సమస్యలను ఎండగడుతూ నవతెలంగాణ దినపత్రిక ఆ ఊల్లో అన్నీ సమస్యలే..శీర్షికన ఆదివారం   విలేజ్ విజిట్ చేసి ఓ కథనం ప్రచురితం చేసింది. దీంతో స్పందించిన ఎంపీవో జనార్ధన్  రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు పోలీసుల సహకారం తీసుకుని  ఎనిమిదేళ్లుగా పెండింగ్ లో సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. రక్షిత మంచినీటి బావిలో ఏ కాలమైన పుష్కలంగా నీరున్నా ట్యాంకుకు పైపలైన్ ఉన్నా పలు చోట్ల పైపులైన్లు కటై మరమ్మత్తులు లేక 8 ఏళ్లుగా  పెండింగ్ లో ఉండి పోయ్యింది.  దీంతో ట్యాంకుకు నీరు చేరక నల్లాలకు నీటి సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల దాహార్తి తీర్చక నిరుపయెాగంగా మారిన బావి ట్యాంకుకు వెళ్లే పైపులైన్ మరమ్మత్తు పనులు యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయించిన అధికారులు ట్యాంకుకు నీరు చేర్చి నల్లాలకు నీరు చేరేలా చేసి సమస్యను పరిష్కరించారు. గ్రామంలోని ప్రతి వీధికి నీరు చేరేలా 3 కొత్త వాల్స్ బిగించారు. డ్రైనేజీలలో  పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు చేపట్టారు. ఎంపీవో జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో నీటిపారుదల శాఖ డీఈ, ఏఈ, గ్రామ కార్యదర్శి పనులు చకచకా పూర్తి చేయించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన నవతెలంగాణ దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.