పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ కొత్త జిమ్మిక్కులకు తెరతీస్తోంది. ఈతాకు వేసి తాటాకు దొబ్బే ప్రయత్నాలకు పదును పెట్టింది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందాన కమలం పార్టీ ప్రజలతో ఆడుకుంటోంది. మామూలు సమయాల్లో గుర్తుకు రాని గ్యాస్ సిలిండర్ల ధర ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పలుమార్లు తగ్గినా ఎన్నడూ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించలేదు. 2021 జులై నుంచి 2023 ఆగస్టు వరకు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రూ.294 పెంచింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అప్పుడు రూ.200 తగ్గించింది. తాజాగా సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి మరోసారి రూ.100 తగ్గించింది. మతం ముసుగులో తామెంచుకున్న ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఎక్కడ బెడిసికొడుతుందోననే భయంతో తాయిలాలకు శ్రీకారం చుట్టింది. అయితే కాషాయ దళం చేసిన ఈ ఎలక్షన్ స్టంట్ ఎంత మేరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి.
– ఊరగొండ మల్లేశం