భారత విప్లవ చరిత్రలో రైతాంగ పోరాటాలతో పాటుగా కార్మిక పోరాటాలకు కూడా మహౌన్నతమైన స్థానం ఉన్నది. అలాంటి చారిత్రక ఘటనల్లో తెలుగు నేల మీద తనదంటూ ఒక పోరాటాన్ని, ధిక్కారాన్ని చరిత్రలో బదిలీపరచుకున్నది సింగరేణి.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి బొగ్గుగనులోని కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉండేవి కనీస హక్కులు అమలు కానీ అలాంటి యాజమాన్య నియంతత్వం నుండి కార్మికులను విముక్తి చేసే దిశగా జరిగిన పోరాటాలు చెప్పుకోదగ్గవి.
సింగరేణి కార్మికుల పోరాటం కేవలం కార్మికుల హక్కుల కోసం, హక్కుల సాధన కోసం మాత్రమే జరిగిన పోరాటంగా కాక భారతదేశ ఆర్థిక విధానాల పైన సామాజిక రుగ్మతల పైన పోరాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు ఉన్నది.
సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగిగా చేసి కార్మికుల హక్కుల కోసం పోరుబాటను ఎంచుకొని లాకప్పులు, పోలీసు చిత్రహింసలను, జైలు జీవితాన్ని, అజ్ఞాత జీవితాన్ని అనుభవించి ఆనాటి కాలానికి, పోరాట ఘట్టాలకు సాక్షి భూతమైన ఒక ఉద్యమకారుడు రాసిన తన స్వీయ జీవితమే ”బొగ్గు రవ్వలు” పుస్తకం.
ప్రపంచ పోరాటాల చరిత్రలో ఉద్యమకారుడే స్వయంగా రచయితగా మారి రాసిన అనుభవాలను పుస్తకంగా తెచ్చిన వారు చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి బహు అరుదైన ఉద్యమ రచయితలలో గురి జాల రవీందర్ ఒకరు. ఇక్కడ విశేషమేమంటే రవీందర్ మొదటి నుండి రచయిత కాదు. గతంలో ఎలాంటి పుస్తకాలను ఆయన రాయలేదు. కానీ తాను చూసిన తాను భాగస్వామ్యమైన ప్రజా పోరాట కాలాన్ని అక్షరబద్ధం చేయడానికి ఆయన రచయితగా మారవలసిన అనివార్య స్థితిలోంచి ఈ పుస్తకాన్ని రాసాడు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయిన వెట్టి చాకిరి, భూస్వాముల దౌర్జన్యాలు, రైతు కూలీల సమస్యలపై విప్లవోద్యమం ప్రజలను చైతన్యపరచడంలో పూర్తి విజయాన్ని సాధించింది. ప్రజల కోసం జరుగుతున్న ఈ పోరాటం విద్యార్థులను కూడా ప్రభావితం చేసింది. దానితో అనేక మంది విద్యార్థులు పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కార్మికులను కూడా ఈ పోరాటాలు ప్రభావితం చేసాయి. సింగరేణి ఉద్యోగులందరూ ఇదే జిల్లాల లోని గ్రామీణ ప్రాంతాల్లో నుండి వచ్చిన వారు కావడం వల్ల, రైతు కూలీ కుటుంబాల నుండి వచ్చిన వారైనందువలన ఈ పోరాటాలు సింగరేణి కార్మికులను సహజంగానే ప్రభావితం చేయగలిగాయి. గ్రామాల్లోని భూస్వామ్య సమస్యలు లాంటివే సింగరేణిలో ఉండటం వలన సింగరేణి యాజమాన్యం నియంతత్వాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా మందమర్రి బెల్లంపల్లి ప్రాంతాల్లో ప్రజలను యువకులను చైతన్య పరుస్తున్న క్రమంలో రవీందర్ గంగారాంకు పరిచయమయ్యాడు. సమాజ స్థితిగతులు ప్రజల బాధలు అవి మార్చవలసిన అవసరాన్ని గురించి గంగారం ఆలోచనలు రవీందర్ ను బాగా ప్రభావితం చేశాయి. అలా ప్రజల కోసం పనిచేయాలనే రవీందర్ ఆలోచన ఆయనను ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది. ప్రభుత్వం పోలీసులు ఉద్యమకారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, పరస్పర దాడులు.. దానితో ఉద్యమకారులు అజ్ఞాతంలోకి వెళ్లడం రవీందర్ ఆయన శ్రీమతి సరళా కూడా పోలీసులకు దొరకకుండా రహస్య జీవితంలోకి వెళ్లడం ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న నిర్బంధాలు, కష్టాలు పుస్తకంలో మనకు ఒక సినిమా లాగా కనిపిస్తాయి. పుస్తకం మొదటి నుండి చివరి వరకు కూడా వదిలిపెట్టకుండా చదివించే విధానంలో రవీందర్ తన మొదటి పుస్తకం తోనే విజయం సాధించాడు. సాధారణంగా మనం కాల్పనిక కథల్లో అలాంటిది చూస్తాం. కానీ పూర్తిగా యదార్ధ జీవిత సంఘటనలను మాత్రమే చెప్పిన రవీందర్ – సరళ ల ఉద్యమ జీవిత కథ అంతే ఏకబిగిన చదివించే విధంగా ఉండడం తో పాఠకుణ్ణి పూర్తిగా తనతో పాటుగా తీసుకెళుతూ ఆ సంఘటనల దశ్యాల్లో లీనం చేయడం గొప్ప విషయం. డేవిడ్ గిల్బర్ట్ రాసిన ‘లవ్ అండ్ స్ట్రగుల్’ స్వీయ కథలాగా రవీందర్ తన విప్లవ జీవితాన్ని మన పక్కన కూర్చొని చెబుతున్నట్టుగా ఉంటుంది. మరింత మెరుగైన సమాజం కోసం, స్వేచ్ఛకోసం, ఉదారమైన ప్రపంచం కోసం గిల్బర్ట్ కలలు కన్నాడు. తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొని జైలు జీవితంతో ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. రవీందర్ జీవితంలో కూడా జైలు జీవితం ఒక ప్రత్యేకమైన ఘట్టం. జైలు అనగానే మన అందరి దష్టిలో ఉండే ఒక నేరపూరిత వ్యక్తులు ఉండే చోటుగా కాకుండా ఒక భిన్నమైన ఆలోచనత్మకమైన, మేధోపరమైన చర్చలతో కొనసాగే వ్యక్తులు మనకు జైలులో కనిపిస్తారు. ఎవరో అన్నట్టు జైల్లో ఉండవలసిన వారు బయట ఉన్నారు బయట ఉండవలసిన వారు జైల్లో ఉన్నారని అనిపిస్తుంది మనకు ఈ పుస్తకం చదివితే. రవీందర్ – సరళలు ఉద్యమం కోసం పనిచేసే క్రమంలో వేరువేరు చోట్ల ఉండాల్సి రావడం ప్రజల కోసం పనిచేసే క్రమంలో అజ్ఞాతంగా పోలీసులకు దొరకకుండా సరళ నెలల చంటి పిల్లతో ఊరూరు తిరగడం, దగ్గర వారు కూడా వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవడానికి వెనకడుగు వేయడం అన్ని సంఘటనలు మన కళ్ళ ముందు రీళ్ళు రీళ్లుగా కదులుతుంటాయి. నిజానికి అజ్ఞాత విప్లవ మహిళా జీవితాల గురించిన సాహిత్యం గాని స్వీయ చరిత్రలు గాని మనకు బహు అరుదుగా కనిపిస్తాయి.
రవీందర్ పుస్తకంలో రాసిన ఆనాటి సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యమంలో పనిచేయడానికి వీలు లేకపోవటంతో ఉద్యమాన్ని వీడి బయటికి రావాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత కోర్టులో లొంగిపోవడం వరకు పాఠకుడు ఎక్కడ ఆగకుండా చదివించే సన్నివేశాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. చాలావరకు విప్లవ సంఘాల్లో పని చేసేవారు విప్లవనిబద్ధతను, నిర్బంధాలను తట్టుకోలేక విప్లవ పార్టీల నుండి దూరం అవ్వడం మనం చూస్తుంటాం. కానీ పనిచేయడానికి సరైన అవకాశం పార్టీ ఇవ్వలేదని పార్టీ నుండి బయటికి వచ్చిన రవీందర్ – సరళ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. విప్లవ కార్యచరణలోని నిర్బంధాలతో పాటుగా మనుషులు నిత్య చైతన్యమవడం మనకు ఈ పుస్తకంలో చూస్తాం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ కాలంలో జరిగిన అనేక సంఘటనలు పత్రికలో మనం చదివిన కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తుల పేర్లు, ప్రాంతాలు మనకు తారసపడతాయి. తాను రచయితను కాను అని ముందే చెప్పుకున్న గురిజాల రవీందర్ తన స్వీయ విప్లవ జీవితాన్ని మనకు చెప్పిన ఒక సంభాషణగానే భావించాడు. కానీ ఈ పుస్తకం ఒక మంచి రచన కిందనే పరిగణించవచ్చు. ఉద్యమకారుడే రచయితగా మారి రాసిన బహు అరుదైన ఒక కీలక ప్రక్రియను మనకు ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ఒక మంచి రచయితగా మారే అనేక లక్షణాలు రవీందర్ లో ఉన్నాయనే విషయాన్ని ఈ పుస్తకం మనకు చెప్పకనే చెబుతుంది.సామాజిక అంశాలు ఎత్తి చూపే పుస్తకాలను ప్రచురించే పర్స్పెక్టివ్ ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
– చెమన్ , 9440385563