గంగారం అడవిబడితో ఓ సాయంత్రం

గంగారం అడవిబడితో ఓ సాయంత్రం”మీరు వ్యక్తులను కలవడానికి ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది. మీ జీవితాన్ని మార్చుకోవడానికి లేదా మీరు కలసిన వారి జీవితాన్ని మార్పు చేయడానికి ఆ కలయిక ఎంతో అవసరపడుతుంది” అంటుంది జకర్తాకు చెందిన ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెంట్‌ జెల్‌ ఫ్లోనిస్‌ హరేఫా. ఉపేందర్‌ రెడ్డి, తన మిత్రులు కలసి ప్రేరణ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను ‘ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఎంపవర్‌ మెంట్‌’ అనే నినాదంతో అక్షరోద్దీపన (లిటరసి ఇంప్రువ్‌మెంట్‌) కార్యక్రమాలను నడుపుతున్నారు.
‘అంగడిబడి’ ‘బస్తీబడి’ అనే పేరుతో వీళ్లు నడుపుతున్న సాక్షరతా కేంద్రాలను గతంలో సందర్శించి, వీటి క్రియాశీలతను పత్రికల్లో వ్యాసాలుగా రాశాను. చదువుకోవాల్సిన వాళ్లకు పలకలు, బలపాలందించి, రాయడం, చదవడం నేర్పడం, జీవితం పట్ల, ప్రపంచం పట్ల అవగాహన పెంచడం వంటి బృహత్తర కార్యక్రమాలను అంగడిబడి, బస్తీబడి చేస్తుంటాయి. విద్యాభివృద్ధికి ఎవరు, ఎక్కడ, ఏ మేరకు దోహదపడుతున్నా వాళ్లతో కలసి నడవడం నాకూ అలవాటు. అందుకే వరంగల్‌ వెళ్లినప్పుడల్లా ఉపేందర్‌ రెడ్డి బృందాన్ని కలుస్తుంటాను. ఈ సారి మా కలయిక ‘గంగారం అడవిబడి’ వైపుకు దారితీసింది. ప్రేరణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆదివాసీ విద్యా కేంద్రాన్ని అడవిబడి అంటున్నాను. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో, నియోజకవర్గం పరంగా ములుగులో ఉంది గంగారం. కోయలు మాత్రమే నివసించే ఊరు ఇది. పూర్తిగా అటవీ ప్రాంతం. నర్సంపేట దాటి పాకాల చెరువు దాటి చాలా లోపలకు వెళ్లాలి. ఇదివరకు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం. అర్బన్‌ మెరుగులకు ఆకర్షితులవుతున్న ఇక్కడి కోయలు శతాబ్దాల తమ సొంత సంస్కృతికి దూరమవుతున్న పరిస్థితుల గురించి చాలానే మాట్లాడుకోవాలి. ఆదివాసీ సంస్కృతి అందమైంది, అనంతమైంది. రేల పాట, కొమ్ము నృత్యం, డోలు, తూత కొమ్ము, అక్కుం వంటి కళారూపాలు, వాళ్లవే అయిన ప్రత్యేకమైన ఆటలు, వ్యవసాయ పరికరాలు, వేట సామాగ్రి ఇట్లా ఎంతో వైవిధ్యభరితమైన సంస్కృతి కోయలది. కోయల నివాసిత ప్రాంతాల్లోనే అడవి మిగిలి ఉండటం గమనిస్తే వనసంరక్షణలో, వన్యప్రాణి సంరక్షణలో ఆదివాసీల పాత్ర ఎంత ముఖ్యమైందో తెలుస్తుంది. అందుకే ప్రభుత్వం ‘ఉమ్మడి అటవీ యాజమాన్యం’ అంటూ 1988లో జాతీయ అటవీ విధానాన్నే తెచ్చింది. ప్రకృతి-మానవుడు అనుసంధానంగా ఏర్పడిన గిరిజనుల సంస్కృతి ఇప్పుడు కొడిగడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రతి గిరిజన ఆవాసంలోనూ ఏర్పాటైన పాఠశాలలతో అక్షరాస్యత మెరుగైనప్పటికీ పైచదువులకు వస్తున్న వాళ్లు తక్కువే. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పైఐదు షెడ్యూల్డు కులాలు, తెగలు ఉన్నాయి. ఎనిమిది తెగలకు ప్రత్యేకమైన భాష ఉంది. వీటిల్లో కోయ భాష చాలా పెద్దది. ఎందుకంటే గోండ్లు మాట్లాడేది కూడా కోయ బాషనే. ఇరవై ఏండ్ల క్రితం వరకు కోయసభలు జరిగేవి. అధికారులూ కోయ భాషలోనే ప్రజలకు సమాధానాలు చెప్పేది. అట్లాంటిది గంగారం కోయల్లో ఇప్పటి యువతీయువకులెవరికీ తమ మాతృభాష రాకపోవడం బాధాకరం. దీనికి కారణం తెలుగు ఆధిపత్యం, ఇంగ్లీషు మీడియంకై కోయలు అర్రులు సాచడం. విద్య విషయానికొస్తే సంస్కృతి పరంగా నేర్చుకునేది మొదటిది, పాఠశాలలో నేర్చుకునేది రెండోది. దురదృష్టం ఏమంటే, కోయల విషయంలో పాఠశాల విద్యనే కొలమానంగా తీసుకుంటున్నాం. సంస్కృతి నుంచి కోయలు నేర్చుకున్న విద్యను ఎక్కడా పరిగణనలోకి తీసుకోం. సాంస్కృతిక విద్యలో అమోఘమైన ప్రతిభ ఉన్నప్పటికీ తెలుగు రాకపోవడంతో కోయలు నిరక్షరాస్యుల జాబితాలోకి చేరుతున్నారు. అందుకే తెలుగు, ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు. ప్రేరణ ఫౌండేషన్‌ కూడా కోయలకు తెలుగు, ఇంగ్లీషులనే నేర్పిస్తున్నది ఇందుకే. మారిన పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాల్సి వచ్చినపుడు తాము వెనుకబడకూడదనే కోయలు తెలుగు ఇంగ్లీషు నేర్చుకుంటున్నట్టు వాళ్ల మాటల్లో స్పష్టమైంది. ప్రభుత్వాలు ఆశ్రమ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషులనే నేర్పిస్తున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత 66.54% కాగా గిరిజనుల్లో అక్షరాస్యత 49.51%. కోయల వరకే చూస్తే అక్షరాస్యులు ఇరవైఐదు శాతమే. కోయ మహిళల్లో పదీ పన్నెండు శాతం అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. గంగారం జజ్జరివారి గుంపులో ప్రతి పదిమంది మహిళల్లో ఒక్కరే అక్షరాస్యులు. అందుకే మహిళల అక్షరాస్యత మీద ప్రేరణ ఫౌండేషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. తమ నివాస ప్రాంతాల గుండా ప్రవహించే గోదావరి, శబరి నదులు కోయల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవితంపై అమిత ప్రభావాన్ని చూపుతాయి. ఒకప్పటి పోడు వ్యవసాయం కాకుండా ఇప్పుడు ‘స్థిరపడిన సాగుదారులు’ అని కోయలను చెప్పుకోవచ్చు. జొన్న, రాగి, బజ్రా, మినుములు పండిస్తారు. ఇప్పుడు కూరగాయలు, మిర్చి, దుంపలు, పండ్లతోటలు సాగుచేస్తున్నారు. టెర్రైన్‌ కల్టివేషన్‌ లోనూ కోయలు ముందంజలో ఉన్నారు. గంగారంలో ఓ చిన్న పెట్రోలు బంకూ ఉంది. ఇక్కడే తాము వ్యవసాయంలో ఉపయోగించే ట్రాక్టర్లకు, రవాణాకు వినియోగించే ద్విచక్ర వాహనాలకు ఆటోలకు ఇంధనాన్ని నింపుకుంటారు.
నేనూ ఉపేందర్‌ రెడ్డి, అధ్యాపక సహచరుడు డా. జి.మహేందర్‌ కాకతీయ డిగ్రీ కళాశాల – హన్మకొండ ముగ్గురం పొద్దూక గంగారం చేరినం. అక్కడ ప్రభుత్వ గ్రంథాలయం ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. దాని పక్కనే ఆరోజు ఆదివారం కాబట్టి ఖమ్మం నుండి కూరగాయలు వ్యాన్లలో తెచ్చి సంతలో అమ్ముతున్నరు. గంగారంతోపాటు చుట్టుపక్కల ఆవాసాల్లోని కోయలంతా పండ్లు, కూరగాయలు వెచ్చాలు కొనుక్కుంటున్నరు. పట్నంలో ధరలకే అమ్మకాలు జరుగుతున్నై. కొనుక్కున్న వస్తువుల్ని యువకులు మోటారు సైకిళ్ల మీద వేసుకొని కదులుతున్నరు. సంతలో మన బస్తీల్లో లాగా కేకలు అరుపులు లేవు. అంగడిలో నింపాదిగా కోయలు కదులుతున్నరు. మండల కేంద్రం కావటాన అక్కడ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉంది. గంగారం మధ్యగా నీటి వాగు ప్రవహిస్తుంది. ప్రధాన గ్రామం వాగుకు దక్షిణాన ఉంది. వెన్నెల్లో ఉన్నట్లు అందంగా లేదు గాని వెలుగుతున్న విద్యుద్దీపాలకు గంగారం కాంతివంతంగానే ఉన్నది. ఓ ఇద్దరు గణేశులు నిమజ్జనానికి వెళ్తున్నారు. మేం నిమజ్జన కోలాహాలాన్ని దాటుకొని అడవిబడి నడిచే జజ్జరివారి గుంపును చేరుకున్నం. కోయలు ఇంటి పేర్లతో ఒక్కో గ్రూపుగా ఏర్పడి ఉన్నారని జజ్జరివారి గుంపును చూస్తే అర్థమైంది. గంగారంలో కొందరికి సిమెంటుతో కట్టుకున్న పక్కాఇళ్లున్నాయి, పూరిగుడెసెలూ ఉన్నాయి. జజ్జరివారి గుంపును ఓ గుడెసెలో కలుసుకున్నం. స్థానికంగా పూచే గంధ పుష్పాల ఎర్రటి గుత్తితో పిల్లలు మాకు స్వాగతం పలికారు. అతిథులకు పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలకాలని తల్లులు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారనడానికి ఇదో ఉదాహరణ. చిన్నసాయమాను, దాని కింది మట్టి అరుగు మీదనే బస్తీబడి నడుస్తున్నది. మా స్వాగతం పిమ్మట వాలెంటీర్లు భిక్షపతి, శ్యామల, నాగమణి అరుగుల మీద చాపలు పరిచి పిల్లల్ని తల్లులనూ కూర్చోబెట్టిండ్రు. మా గౌరవార్థం ఒకటి రెండు కుర్చీలను వేసిండ్రు. ఇక నేను పలకరింపు ప్రశ్నోత్తరాలు రాయించుడు చదివించుడు ప్రారంభించాను. పిల్లలూ బాగున్నారా..? అంటే వాళ్లు లోగొంతుతో నాజుగ్గా సార్‌… అంటున్నారు. మీరందరూ ఇక్కడ స్కూలుకు రోజూ వెళుతున్నారా..? అంటే మళ్లీ సార్‌… అంటున్నారు. బాగా చదువుతున్నారా..? అంటే, సార్‌… అంటున్నారు. సార్‌.. అంటే ఔనండి అని అర్థం ఉన్నట్టుంది అనుకున్న. కోయల భాషలో మన తెలుగు పదాలకు వేరే అర్థాలు కూడా ఉంటాయి. మనం బావిని నుయి అంటాం. వాళ్లకు కుక్క అని అర్థం. బావిని కుహి అంటారు. ‘పోయి’ అంటే కోయలకు గ్రామ పెద్ద. ‘కిల్లో’ అంటే పెద్దపులి. సరిహద్దును ‘గట్టు’ అంటారు. ఇట్లా తెలుగుతో పోలికలున్న శబ్దాలకు పదాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఒక రకంగా ఈ అర్థం వైవిధ్యమే కోయల సమస్త విషయాలను బయటి వ్యక్తులకు తెలియకుండా నిగూఢంగా ఉంచింది. పండితులు ‘భాష జాతి పరిరక్షణి’ అన్నది అందుకేనేమో.
ఏం అడిగితే ఏం అర్థం చేసుకుంటారో ఆందోళనగా ఉంది అక్కడ. కాకపోతే తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. మేం ఫౌండేషన్‌ తరఫున తెచ్చిన లెర్నింగ్‌ మెటీరియల్‌ పుస్తకాలు, నోట్సు, పెళ్లిళ్లు, పెన్నులు, స్కెచ్‌ పెన్నులు ఆ పిల్లల గుంపు (రిత్విక్‌, సర్వేశ్‌, సాన్విత్‌, సంజరు కుమార్‌, మనేష్‌, సాత్విక, సంజన, రిషిక, రిత్విక, దీక్షిత)కు పంచాం. 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజనుల్లో సగానికంటే ఎక్కువమంది నిరక్షరాస్యులు. అక్షరాస్యుల్లోనూ నూటికి 12 మంది కూడా టెన్త్‌ దాకా రారు. ఈ నేపథ్యంలో అడవిబడి సహకారంతో గుజ్జరి ఐశ్వర్య ఈ సంవత్సరం 10వ తరగతికి వచ్చింది. డాక్టర్‌ కావాలనేది ఈమె లక్ష్యం. నేను వచ్చిన పని అడవిబడి పనితీరు తెలుసుకోవడం. నోటుబుక్కులో మీకు వచ్చిన పదాలు వాక్యాలు రాయమన్నాను. సర్కారు బడిలో దొరుకుతున్న అభ్యాసాలకు ఈ అడవిబడి మద్దతుగా ఉండటాన పిల్లలందరూ భాషా పరిజ్ఞానంలోనూ గణిత సామర్థ్యాలలోనూ వాళ్ల తరగతికి సరిపోను ప్రతిభను కనబరచారు. సాత్విక మూడో తరగతి. తెలుగు ఇంగ్లీషులో చెప్పిన పదాల్ని తప్పుల్లేకుండా రాసింది. లెక్కలు మూడోతరగతివి టకటకా చేసింది. ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకుంటున్న విషయాలను అడవిబడి మరింత వేగవంతంగా నేర్పిస్తుందని నాకు అర్థమైంది. అంటే అడవిబడి ట్యుటోరియల్‌ లాగా ఉదయం సాయంత్రాలు సెలవు దినాల్లో గంగారం పిల్లలకు సేవలందిస్తుంది. మహిళలకూ పిల్లలతో కలిపి చదువు నేర్పిస్తుంది. తల్లులకు పిల్లలు తమకు తెలిసిన భాషా పరిజ్ఞానం లోంచి గణితంలోంచి చదువు నేర్పించడం, నేర్చుకోవడం చూస్తే అడవిబడి సెల్ఫ్‌ లెర్నింగ్‌ సిస్టమ్‌ విధానంలో తర్ఫీదు ఇస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆదివాసీలున్న ప్రతి చోట ప్రేరణ ఫౌండేషన్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఇట్లనే పనిచేయాల్సి వుందనిపించింది. అడవిబడి సపోర్టివ్‌ ఎడ్యుకేషన్‌తో పాటు సపోర్టివ్‌ న్యూట్రిషన్‌ కూడా అందిస్తుండటం గంగారం కోయలకు అదనపు సదుపాయం. అక్షరాలు నేర్వడం మీకు ఎట్లా అనిపిస్తుందని మహిళలను అడిగితే, కొత్త లోకం కనిపిస్తుందని వాళ్లన్నారు. ఎందుకు స్కూలుకు వెళ్తున్నారని పిల్లల్ని అడిగిన ప్రశ్నకు జాబ్‌ కోసం అని సామూహికంగా జవాబిచ్చారు ఆ కోయ బాలలు. వాళ్లందరికీ మంత్రి సీతక్క తెలుసును. నేను సీతక్క ఉదాహరణే చెప్పిన. చదివిన వాళ్లందరికీ ఉద్యోగాలు రావు, బాగా చదివితేనే ఉద్యోగాలు వస్తాయి. పిహెచ్‌.డి చేస్తే సీతక్కలా గొప్ప మేధావి కావొచ్చు, మంత్రీ కావొచ్చునని సూచన చెప్పిన. వాళ్లు సార్‌… అని నాకు మద్దతు ఇచ్చిండ్రు.
గంగారం కోయలను కలిసి ముచ్చటించిన సమయం చిన్నదే కావొచ్చు, గంగారం అడవిబడి గురించి ఇక్కడ మీతో చెప్పిన విషయాలు కొద్దిపాటివే కావొచ్చు. కాని, రాసిన నేనూ వ్యాసం చదివిన మీరూ మానవ శాస్త్రాన్ని కొంత అధ్యయననానికి అంకితమైనామని అనుకోవచ్చు. ఏమిటీ మానవ శాస్త్రం? అంటే మనకు పరిచయం లేని ఒక జనసమూహపు గత వర్తమానాలను భవిష్యత్‌ ఆకాంక్షలను తెలుసుకోవడమే మానవ శాస్త్రం. ఈ అధ్యయనంలో గంగారం సందర్శన పురోగతిని ప్రసాదించింది. ఎడ్యుకేషన్‌ ఫర్‌ సోషల్‌ ఛేంజ్‌ అని గంగారంతో చెప్పడానికి మరికొన్ని ప్రయాణాలు అవసరమనిపించింది. తెలుగు, ఇంగ్లీషు నేర్చుకున్న వాళ్ల చేతనే ‘కోయభారతి (పాఠ్యపుస్తకం/ వాచకం)’ రాయించే బాధ్యత మిగిలివుందనిపించింది. వేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు మీ తరానికి అందిన బహుమతులని, తమ ఎరుక కాలగర్భంలో కలసిపోకుండా సజీవంగా ఉంచేందుకే మీ కోయ పెద్దలు కథలు, కళా ప్రదర్శనలు, పనినైపుణ్యాల రూపంలో నిక్షిప్తం చేశారని, జీవితంలో అవసరమైన మార్పులు చేసుకుంటూనే మీ జాతి అస్తిత్వానికి ఔన్నత్యానికి చిహ్నాలైన వేటినీ జారవిడిచుకోరాదని చెప్తున్నప్పుడు తలలూపి ఆమోదం తెలిపారు. ఏ మాత్రం బిడియం లేకుండా పిల్లలతో కలిసి అడవిబడిలో చదువుకుంటున్న తల్లులు జజ్జరి నాగమణి(30), జజ్జరి సమ్మక్క(48), జజ్జరి రోజా(30), జజ్జరి స్వరూప(45), సన్ప లక్ష్మి(55), జజ్జరి జయసుధ(34), జజ్జరి లక్ష్మి(56) అక్షరాలు దిద్దుతూ ఒకరు, తలకట్టు దీర్ఘాలు పలుకుతూ ఇద్దరు, ఒత్తులు నేర్చుకుంటూ మరో ఇద్దరు, గుణింతం చేసుకొంటూ పదాలు వాక్యాలు రాస్తున్నారు. ‘రాత నేర్చుకో తలరాత మార్చుకో’ అనే నినాదాన్ని కోయమహిళలు బలంగా నమ్ముతున్నారు. రాతనేర్వడంలోని 1. అక్షరాలు, 2.తలకట్టు దీర్ఘాలు, 3.ఒత్తులు, 4. గుణింతాలు నేర్వడం అనే నాలుగు అంచెలను విపులంగా వివరించాను. కారణాలేవైనా పిల్లలు డ్రాప్‌ఔట్‌ కాకుండా చూడమని తల్లులకు విన్నవించాను. జంగల్‌ లో చెట్లు పుట్టలు తిరగడం అలవాటైన పిల్లలు స్థిరంగా స్కూలులో ఐదారు గంటలు కూర్చోవడం కష్టమే అయినా బడిలో కుదురుగా కూర్చోబెట్టాల్సిందే, ఒక్కో క్లాసు మెట్లెక్కిస్తూ ఉన్నత విద్యకు పంపాల్సిందే, కోయలు డాక్టర్‌ ఇంజనీర్‌ చదవాల్సిందే అన్నాను. మన రాష్ట్రపతి మేడం ద్రౌపది ముర్ము గురించి చెప్పాక, ఆ పెద్దావిడ దేశంలోని యావన్మంది గిరజనులకు ఆదర్శం కదా! అంటే తల్లులూ పిల్లలూ ముక్తకంఠంతో మళ్లీ సార్‌.. (ఔను) అంటూ మాకు వీడ్కోలు చెప్పిండ్రు. అప్పుడు సమయం రాత్రి తొమ్మిది.
– డా.బెల్లి యాదయ్య
9848392690