అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శం

ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేగా
– ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
– విద్యార్థులకు ప్రశంసా పత్రాలు,మెమెంటోస్‌ అందచేత
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ పునర్నిర్మాణం జరిగిన తదుపరి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల పాల్వంచలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రేగా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఎన్నో అవమానాలు అవహేళనలతో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల తదుపరి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఉద్యమంలో సకల జనులంతా పాల్గొన్నారని, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం ఇంతటి ప్రశాంతమైన ఉద్యమం చరిత్రలో ఎక్కడ జరగలేదని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఆనాడు ఉద్యమంలో పాల్గొని రాష్ట్రంలో మాకు దక్కాల్సినటువంటి నిధులు దక్కడం లేదని, మాకు రావాల్సినటువంటి నీళ్లు రావడంలేదని, అవన్నీ పోవాలంటే స్వరాజ్యం మాకు రావాల్సిందేనని కొట్లాడినట్లు చెప్పారు. ఆనాటి ఉద్యమ ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నామని చెప్పారు. ఆనాటి రోజులను గమనంలోకి తీసుకుంటే పరిపాలనలో అనేక మార్పులతో కొత్త పంతులు తొక్కుతున్నామని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక రికార్డు అని సమ్మక్క సారలమ్మ బ్యారేజ్‌ దేవాదులతో పాటు మన జిల్లాలతో పాటు ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో సస్యశ్యామలం చేసేందుకు ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన అద్భుత పథకం సీతారామ ఎత్తిపోతల పధకం అని చెప్పారు. సీతమ్మ సాగర్‌ భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌తో పాటు జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటున్న గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదయాలపై విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన గావించిన విద్యార్థిని, విద్యార్థులకు మేమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుముందు కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో కొత్తగూడెం, ఇల్లందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పి డా.వినీత్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వర రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ కాపు సీతా లక్ష్మి, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.