స్పీకర్‌కు ఉద్వాసన

An exhortation to the speaker– అమెరికా చరిత్రలో తొలిసారి
న్యూయార్క్‌ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీని పదవి నుంచి దించేశారు. ఆయనకు వ్యతిరేకంగా రిపబ్లికన్‌ పార్టీ నేత మ్యాట్‌ గేజ్‌ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. దీనిపై ఓటింగ్‌ చేపట్టి మెకార్థీని తొలగించారు. ఇలా ఓ స్పీకర్‌ను బలవంతంగా పదవి నుంచి తొలగించడం అమెరికా చరిత్రలోనే తొలిసారి చోటుచేసుకుంది. సుదీర్ఘ ఓటింగ్‌ పక్రియ తర్వాత ఈ ఏడాది జనవరిలోనే మెకార్థీ స్పీకర్‌ పదవి చేపట్టారు. 10 నెలలు కూడా తిరగకుండానే అమెరికా ప్రతినిధుల సభ ఆయనకు ఉద్వాసన పలకడం గమనార్హం.
ఆ ఒప్పందమే కారణమా?
గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఎగువసభ సెనెట్‌ను అధికార డెమోక్రటిక్‌ పార్టీ కైవసం చేసుకొంది. కానీ, ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ సాధించలేక పోయింది. దిగువసభలోని మొత్తం 435 సీట్లకు డెమోక్రాట్లు 213 సీట్లు గెలిస్తే, ప్రతిపక్ష రిపబ్లికన్లు అంతకు తొమ్మిది సీట్లు ఎక్కువగా 222 సీట్లతో మెజారిటీ పక్షంగా నిలిచారు. అయినప్పటికీ సభాపతిని ఎన్నుకోవడానికి రిపబ్లికన్లు ఆపసోపాలు పడ్డారు. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రిపబ్లికన్ల మధ్య అంత సులువుగా ఏకాభిప్రాయం కుదరలేదు. నాలుగు రోజుల పాటు ఏకంగా 15 దఫాలు ఓటింగ్‌ నిర్వహించగా.. చివరకు కెవిన్‌ మెకార్థీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఆ సమయంలో మెకార్థీ.. పదవిని చేజిక్కించుకోవడం కోసం పార్టీ నేతలతో ఓ ఒప్పందం చేసుకున్నారు. తన ఉద్వాసనకు ఒక్క రిపబ్లికన్‌ సభ్యుడు డిమాండ్‌ చేసినా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తానన్న అన్నారు. ఇప్పుడదే ఒప్పందంతో మెకార్థీపై రిపబ్లికన్‌ నేత మ్యాట్‌ గేజ్‌ అవిశ్వాసం తీసుకొచ్చారు. దీనిపై ఓటింగ్‌ చేపట్టి మెకార్థీని తొలగించారు.