తెలంగాణకు దక్కిన గౌరవం

An honor for Telanganaఇటీవల జాతీయ సినిమా అవార్డులు ప్రకటించగానే ఉత్తమ సినిమా విమర్శకులుగా ఎం పురుషోత్తమాచార్య అనే వ్యక్తిని ప్రకటించడంతో సినిమా అభిమానులు ఎవరీ పురుషోత్తమాచార్యులు అని అన్వేషించడం మొదలు పెట్టారు. కనీసం ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ కూడా లేకుండా వికీపీడియాకు అందకుండా తన దారిన తాను సాగిపోయే ఓ నిరాడంబర సంగీత సాహిత్య మూర్తి పురుషోత్తమాచార్యులు. అన్నమయ్య సంకీర్తన ప్రచార సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి, ప్రతి నెల 16వ తేదీన అన్నమయ్య సంకీర్తన సభను గత 40 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న కార్యదక్షత ఆయన సొంతం. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ వంటి విపత్తులు కూడా ఆయన చేస్తున్న అన్నమయ్య కార్యక్రమాన్ని ఆపలేకపోయాయి. అదీ ఆయన చిత్తశుద్ధి. ప్రచారానికి ఆమడ దూరంగా ఉండే పురుషోత్తమాచార్యులుకి జాతీయ పురస్కారం రావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. జాతీయ ఉత్తమ సినీ విమర్శకులుగా పురస్కారం తీసుకుంటున్న తొలి తెలంగాణ వ్యక్తి డా|| ముడుంబై పురుషోత్తమాచార్య.
శాస్త్రీయ సంగీతం, సాహిత్యం పరిశోధనాత్మక దృక్పథంతో అధ్యయనం చేస్తున్న వారు తెలుగులో కొంత అరుదుగానే కనిపిస్తారు. ఈ కోవలోని వారే నల్లగొండకు చెందిన డా|| ఎం.పురుషోత్తమాచార్య. వీరు 1948లో శ్రీమతి మంగతాయమ్మ శ్రీమాన్‌ వేంకట నరసింహాచార్యులు దంపతులకు హుజూర్‌ నగర్‌, (నేటి సూర్యాపేట జిల్లా) లో జన్మించారు. చందాల కేశవ దాసు రచనలపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డి పట్టా పొందారు. తొలి తెలుగు సినీ గీత రచయిత చందాల కేశవదాసు అని సప్రమాణంగా నిరూపించి తెలంగాణ కీర్తిని దశదిశలా చాటారు. వృత్తిరీత్యా నల్లగొండ గీతా విజ్ఞాన ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విశ్రాంతి పొందిన పురుషోత్తమాచార్యులు, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బాల్యంలోనే సాహిత్యం వైపు మళ్లారు. పాఠశాల విద్యార్థి దశలోనే గేయాలు రాశారు. 1960లో ‘మన కర్తవ్యం’ నాటికలో బాలనటుడుగా పలువురి ప్రశంసలు అందుకున్నారు. 1962లో ‘ద్రోహం’, ‘మేటిరైతు’ నాటికలలో బాల నటగాయకుడుగా బహుముఖీనమైన ప్రతిభను కనబరిచారు. 1992 నుండి లలిత సంగీత గానం చేస్తున్నారు.
రాధికామాధవము, శ్రీసుదర్శన ప్రభావము, హరిసంకీర్తనాచార్య, విముక్తసీత, వరూధిని, మహాభక్తశబరి, ప్రభావతి, నీలవేణి, నాదయోగి, ప్రబంధరాయబారము మొదలైన పద్య నాటకాలను రచించి ప్రదర్శింపజేశారు.
1979 నుండి 1985 వరకు శ్రీ త్యాగరాజ ఉత్సవసమితి కార్యదర్శిగా సంగీత కార్యక్రమాలు ఎన్నింటినో విజయవంతంగా నిర్వహించారు. 1982 నుండి శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచారసమితి ద్వారా అధ్యక్షునిగా మాసవారీ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికి 500 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇటీవల అన్నమయ్య పంచ శతమాసోత్సవాలు మూడు రోజులపాటు నల్లగొండలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. 1983 నుంచి శ్రీ ఘంటసాల కల్చరల్‌ అసోసియేషన్‌ ద్వారా ఇప్పటి దాకా సుమారు 2000 సినీసంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
1989 నుండి శ్రీనాదబ్రహ్మ సంగీతకళాశాల ద్వారా సుమారు 500 మందికి సంగీత విద్యాబోధన చేస్తూ నల్లగొండ ప్రాంతంలో సంగీతం మాస్టారుగా ప్రసిద్ధి పొందారు.
పురుషోత్తమాచార్యులు పలు వీడియో ఆడియో చిత్రాలకు, క్యాసెట్లకు సంగీత దర్శకత్వం వహించారు. 1985లో ‘తపస్విని’ వీడియో చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. 2000లో ‘అందరికీ విద్య’ ఆడియో సి.డి. వెలువరించారు. 2006 నుండి ‘అన్నమయ్య పదశ్రుతి, అన్నమయ్య నృసింహ కీర్తనలు’, ‘అలంపురం జోగుళాంబ కీర్తనలు’, ‘విఠలేశ్వరా శతకపద్యగానం’, ‘శ్రీనివాసచరితం’, శ్రీవాసుదాసు కీర్తనలు’ ‘మరింగంటి వారి తిరునామసంకీర్తనమ్‌’ వారిజాల శ్రీ వేణుగోపాలస్వామి సుప్రభాతం, కీర్తనలు’, ‘హరినామ గానరంజని’ మొదలైన సి.డి లకు సంగీత దర్శకత్వం వహించారు.
1995లో ఆం.ప్ర.రాష్ర ్టనంది నాటకోత్సవ పద్యనాటక పోటీలకు, 1999లో అన్నమాచార్య భావనావాహిని కార్యక్రమానికి 2002, 2005, 2009 సం||లలో నంది నాటకపోటీలలో పద్యనాటకాల విభాగానికి, 2004లో మాటివి ‘పాడాలని ఉంది’ కార్యక్రమంలోనూ న్యాయ నిర్ణేత వ్యవహరించారు.
పురుషోత్తమాచార్యులు తపోభంగం, స్వాతంత్య్ర దీప్తి, శ్రీ సిద్ధివినాయకం, అన్నమయ్య చరిత్ర, దేవీమాహాత్మ్యము, విశిష్టసంస్కృతి ఖిల్లా-నల్లగొండజిల్లా, భగవద్రామానుజ వైభవమ్‌. ఆళ్వారు వైభవమ్‌ (12భాగాలు) మొదలైన నృత్య నాటికలు రచించారు.
పురుషోత్తమాచార్యులు బహు గ్రంథకర్త. వీరు అనేక ప్రక్రియలలో అనేక గ్రంథాలు రాశారు. సరాగాలు (పాటలు), విరిమువ్వలు (వచనకవితలు), రసానంది (నాటికలు), పదవతరగతి తెలుగు పాఠ్యాంశ కథలు, మన ఘంటసాల సంగీతవైభవం (ప్రైవేట్‌ లలితగీతాలు), మన ఘంటసాల పద్యగానసౌరభం (ప్రైవేట్‌ పద్యాలు), ఘంటసాల భగవద్గీతా గాన సౌందర్యం, గీతల్లోగీత (పద్యాలు), తెలంగాణా పాఠ్యాంశకథలు, విశేషాంశాలు, అలంపురం జోగుళాంబ సంకీర్తనలు. వారిజాల వేణుగోపాలస్వామి సుప్రభాతం, కీర్తనలు, అవిసెపూలు (వచనకవితలు), ప్రపంచవిలాసం (మినీకవితలు), రహస్యభూతం (పద్యకావ్యం)
ముత్యాల కొలను (సంస్కృత నీతిశాస్త్రానికి అనువాదం) తేనె తెరలు కథా సంపుటి, ఒక నవల కూడా రాశారు. సింహగిరి నరహరి వచనాలను కీర్తనలుగా రాశారు. ఇటీవల పిల్లల కోసం వెన్నెల కుప్పలు అనే గ్రంథం రాసి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వెన్నపూసల భవ్య అనే విద్యార్థిని చేత ఆవిష్కరింప జేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇవి వారు రాసిన గ్రంథాలలో కొన్ని మాత్రమే.
పురుషోత్తమాచార్యులు సంగీత సాహిత్య రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వారిని వరించి వచ్చాయి. 1998లో మచిలీపట్నం కళాపీఠంవారి ఘంటసాల కమెండేషన్‌ అవార్డు. 2001లో హైద్రాబాదు ‘శ్రీకళానిధిసంస్థ వారి ఉత్తమసంగీత విద్వాన్‌’ పురస్కారం. 2004లో మిర్యాలగూడెం శ్రీత్యాగరాజనాట్యకళాపరిషత్తు వారిచేత ‘కళాజ్యోత్స్న’ బిరుదం. 2008లో ద్వా.నా. శాస్త్రి ‘ఉత్తమపరిశోధక అవార్డు’ 2011లో ‘వరూధిని’ ఉత్తమ రచయిత అవార్డు. నందినాటకపోటీ 2011లో గుంటూరు విశ్వశాంతి ఆర్ట్స్‌ అకాడమీవారి ‘సంగీత సేవక’ పురస్కారం, 2016లో తెలుగువిశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం. 2017లో శరచ్చంద్ర ఘంటసాల సంగీతకళాశాలవారి ‘సముద్రాల’అవార్డు. 2019లో గంధర్వ అకాడమీ, హైద్రాబాదు వారి సంగీత అవార్డు మొదలైనవి వీటిలో కొన్ని.
శ్రీఅన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి : శ్రీఘంటసాల కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా, శ్రీనాదబ్రహ్మ సంగీత కళాశాల ప్రధానాచార్యులుగా 1983 నుండి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. 1984లో ఘంటసాల పాడిన శ్రీశ్రీ సినీగీతాల కార్యక్రమం, 1999లో ఘంటసాల పాడిన ఎస్‌.రాజేశ్వరరావు పాటలు, 2002లో ఘంటసాల కంఠంలో పెండ్యాల గీతాలు 2003లో వి. రామకృష్ణతో ఘంటసాల సంగీత కార్యక్రమం. 2004లో ”పసిడిపాటల వెండివెలుగు” మాసవారీ కార్యక్రమాలు. 2006లో డా||రహమతుల్లా అష్టావధాన కార్యక్రమం, 2009లో ఘంటసాల పాడిన ఆదినారాయణరావు గీతాలు, 2017లో ఘంటసాల పాడిన సినారె గీతాలు (సీతారామయ్యగారి బృందం) తిరుపతి, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, హైద్రాబాదులలో సంగీతకార్యక్రమాలు మొదలైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ విధంగా ఇటు సంగీత రంగంలో అటు సాహిత్య రంగంలో నాటక రంగంలో విశేష కషి చేస్తూనే గొప్ప పరిశోధనాత్మక వ్యాసాలను కూడా వెలువరిస్తున్నారు. వీరు రాసిన సినీ విమర్శకు సంబంధించిన వ్యాసాలు ‘ తెలుగు సినీ గీతాలు – శాస్త్రీయ సంగీతం పేరుతో త్వరలో పుస్తకంగా మన ముందుకు రానున్నది. ఇంతటి గొప్ప కషి చేస్తున్న పురుషోత్తమాచార్యకు జాతీయ ఉత్తమ సినీ విమర్శకులుగా పురస్కారం రావడం నల్లగొండకే కాదు తెలుగు నేలకే గర్వకారణం.
(డాక్టర్‌ ||ఎం. పురుషోత్తమాచార్యకు జాతీయ ఉత్తమ సినీ విమర్శకులుగా పురస్కారం వచ్చిన సందర్భంగా…)
– సాగర్ల సత్తయ్య, 7989117415