ఆదర్శ కమ్యూనిస్టు దంపతులు

ఆదర్శ కమ్యూనిస్టు దంపతులు– భూస్వాములు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు.. కేవల్‌ కిషన్‌, ఆనందదేవి
– పాటలు, పేర్ల రూపంలో కిషన్‌ చరిత్ర సజీవం
– రామాయంపేట ఎమ్మెల్యేగా గెలిచిన కేవల్‌ ఆనందదేవి
– పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం రాజీనామా
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఊరూరా తలిచే పేరు… కొలిచే పేరు కేవల్‌ కిషన్‌. జనం ఏటేటా జాతర జరుపుకుని స్మరించుకునే గొప్ప స్ఫూర్తి ప్రదాత. పోరాట యోధుడు కేవల్‌ కిషన్‌ పేరు చిరస్మరణీయంగా ఉండాలని తలంచే జనం.. పిల్లలకు ఆయన పేరు పెట్టుకున్నారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన త్యాగమూర్తి. ఆయన పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న సతీమణి కేవల్‌ ఆనందదేవి సైతం ప్రజలే దైవంగా నమ్మారు. కేవల్‌ కిషన్‌ అందించిన పోరుబాటను ఆమె కొనసాగించారు. ఆమె రామాయంపేట నియోజకవర్గం నుంచి సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. అందుకే కేవల్‌ కిషన్‌, కేవల్‌ ఆనంద దేవి ఆదర్శ కమ్యూనిస్టు దంపతులయ్యారు.
మెదక్‌ జిల్లా రామాయంపేట పాత నియోజకవర్గం పరిధిలోని చిన్నశంకరంపేట మండలం తుర్కల మందాపూర్‌ గ్రామానికి చెందిన నారాయణ, మున్నాబాయి దంపతులకు 1922 మే 10న కేవల్‌ కిషన్‌ జన్మించారు. మెదక్‌లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌లో బీఏ చదివారు. తోటి విద్యార్థుల్లో చురుకైన వాడిగా ఉన్న కేవల్‌ కిషన్‌ డిగ్రీలో టాపర్‌గా నిలిచారు. ఆ రోజుల్లో మెదక్‌ జిల్లా భూస్వాములు, జమీందార్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండేది. వీరి ఆగడాలతో మెదక్‌ ప్రాంత ప్రజలు విసిగిపోయారు. నిరంకుశ నిజాం ప్రభువు, స్థానిక భూస్వామ్య, జమీం దార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రజల్ని ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధం చేస్తున్న తరుణంలో నాయ కులతో కేవల్‌ కిషన్‌కు పరిచయాలేర్ప డ్డాయి. తన మార్గాన్ని ప్రజా ఉద్యమాల వైపు మళ్లించారు. నిజాంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజల్ని సమీకరించి పోరాడారు.
స్వాతంత్య్రం వచ్చాక కూడా ఆయన పోరాట పంథాను మార్చుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాడుతూనే.. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రజానాయకునిగా గుర్తింపు పొందారు. దున్నే వాడికే భూమి దక్కాలనే నినాదంతో పేదలకు భూములు పంచిపెట్టారు. కార్మికుల కోసం కూడా పోరాడారు.
ప్రతి ఏటా జాతర
కేవల్‌ కిషన్‌ తుది శ్వాస విడిచిన మెదక్‌-చేగుంట ప్రధాన రహదారి పొలంపల్లి చౌరస్తాలో ప్రజలు సమాధి కట్టారు. ఆయన పేరిట ప్రతి ఏటా డిసెంబర్‌ 26న జాతర నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు భారీగా హాజరై నివాళులర్పించి తమ ఇష్టమైన నాయకుడిని స్మరించుకుంటారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాములు, పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన కేవల్‌ కిషన్‌ చరిత్రను ప్రజలు పాటల రూపంలో పాడుకుంటారు. అప్పట్లో ఊరూరా తమ పిల్లలకు కిషన్‌, కిషనమ్మ అంటూ పేర్లు పెట్టుకునేవారు.
ప్రజల కోసం
పోరాడుతూనే ప్రాణాలిచ్చారు
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కేవల్‌ కిషన్‌ ఊరూరా తిరుగుతూ కమ్యూనిస్టు పార్టీని నిర్మించారు. ఆ క్రమంలోనే పాలకులకు కొరకరాని కొయ్యగా మారారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడటం ఓర్వలేని శక్తులు ఆయన్ను భౌతికంగా లేకుండా చేయాలనే కుట్రలు చేశారు. 1960 డిసెంబర్‌ 26న మాసాయిపేటలో కార్యకర్తల సమావేశం అనంతరం తన సహచరుడైన లక్ష్మయ్యతో కలిసి సైకిల్‌మోటర్‌పై మెదక్‌ వస్తుండగా లారీతో ఢకొీట్టి కిషన్‌ను అడ్డు తొలగించుకున్నారని ఆయనను ఇష్టపడే జనం చెబుతుంటారు. ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను ఓ దేవునిలా భావిస్తారు.
కిషన్‌ పోరాట వారసత్వాన్ని నిలిపిన ఆనందదేవి
కేవల్‌ కిషన్‌ పోరాట వారసత్వాన్ని ఆయన భార్య కేవల్‌ ఆనందదేవి కొనసాగించారు. ప్రజల కోసం కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్యమైన నాయకురాలిగా పనిచేసిన ఆమె రామాయంపేట నియోజకవర్గానికి 1962లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌కే రెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆనందదేవి విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం సాగిన పోరాటంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.