అనాలోచిత నిర్ణయం

– మరోసారి ఇబ్బందులు తప్పవా ?
– ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతున్న కేంద్రం
న్యూఢిల్లీ : రెండు వేల రూపాయల నోటును చలామణి నుండి వెనక్కి తీసుకుంటున్నామని రిజర్వ్‌బ్యాంక్‌ ఆకస్మికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ 2018 మార్చి 31 నాటికి రూ. 6.73 లక్షల కోట్లు (మొత్తం నోట్లలో 37.3%) ఉండగా ఈ సంవత్సరం మార్చి 31 నాటికి రూ. 3.62 లక్షల కోట్లకు (మొత్తం నోట్లలో 10.8%) తగ్గిందని ఆర్‌బీఐ చెబుతోంది. చలామణిలో ఇతర నోట్లు అందుబాటులో ఉన్నందున రూ. 2000 నోట్ల లక్ష్యం నెరవేరిందని కూడా అంటోంది. రూ. 2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్‌ 30 వరకూ గడువు ఇచ్చింది. అయితే నగదు ఆధారిత లావాదేవీలు జరిపే వ్యక్తులు లేదా సంస్థల వద్ద ఈ నోట్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. దేశంలోని అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ వేతనాల చెల్లింపుల కోసం నగదు పైనే ఆధారపడుతున్నారు.
ఇప్పుడు అలాంటి వ్యక్తులు, సంస్థలు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి 130 రోజుల సమయం ఉంది. అయితే ఆర్‌బీఐ చెబుతున్న దాని ప్రకారం ఒకసారికి కేవలం రూ. 20,000ల విలువైన నోట్లను మార్చుకునే అవకాశం మాత్రమే ఉంది. దీనిని బట్టి పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిపే వ్యక్తులు, సంస్థలు మార్పిడి కోసం మరోసారి రోజుల తరబడి బ్యాంకుల ముందు నిరీక్షించక తప్పని పరిస్థితి. తమ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న నోట్లను మార్చుకోవాలంటే వీరు కొందరిని నియమించుకొని గతంలోలా బ్యాంకుల ముందు నిలబెట్టాల్సి వస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ లేదా ఆస్తికి సంబంధించిన లావాదేవీలు జరిపే వారు కూడా తమ వ్యాపారాన్ని నగదు రూపంలోనే నిర్వహిస్తుంటారు. రోజువారీ వ్యాపారంలో యాభై శాతం నగదు పైన ఆధారపడే ఇలాంటి వారు ఆర్‌బీఐ నిర్ణయంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్మాణ రంగంలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగాలు లేక, పెట్టుబడులు సరిగా లభించక ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న పరిస్థితులలో ఇలాంటి నిర్ణయం ఏ విధంగా దేశానికి మేలు చేస్తుందో పాలకులే చెప్పాలి.
ఒకేసారి రూ. 20,000ల విలువైన నోట్లకు మించి మార్చుకోరాదన్న నిబంధన కొందరు వ్యక్తులు, సంస్థలు, ప్రతిపక్ష నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకోవడానికి దోహదపడుతుంది. పైకి చూడడానికి ఈ నిర్ణయం ఆర్‌బీఐ తీసుకున్న ఓ చిన్న ద్రవ్య విధాన చర్యగా మాత్రమే కన్పించినా దాని సమయం, రాజకీయ-ఆర్థిక ప్రభావాల దృష్టితో చూడాల్సి ఉంటుంది. అంతేకాదు… కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి. పెట్టుబడిదారులు ఆందోళనకు గురి కాకుండా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ పనిగంటలు ముగిసిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఈ నిర్ణయం అమలు మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం కలుగుతోంది. గతంలో ఎదురైన అనుభవాలు, జరిగిన లోటుపాట్ల నుండి ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండానే ప్రభుత్వం ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోంది. 2016లో నోట్ల రద్దు మొద లుకొని జీఎస్‌టీ ప్రవేశపెట్టడం వరకూ,దివాలా నిబంధనలు, సీఏఏ- ఎన్‌ఆర్‌ సీ అమలు, వ్యవసాయ చట్టాలు, కార్మిక చట్టాలు..ఇవన్నీ ఎవరినీ సంప్రదించ కుండా ఏకపక్షంగా తీసుకున్నవే. భారత్‌ వంటి అతిపెద్ద దేశంలో ఇతర రాష్ట్రాలను సంప్రదించి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవస రం ఉంది. ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గత తొమ్మిది సంవత్సరాలలో దురదృష్టవశాత్తూ ఇలాంటి కసరత్తు ఏదీ జరగలేదు.
పెద్ద నోట్ల రద్దుపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి!
2వేల నోటు ఉపసంహరణపై సీపీఐ(ఎం) విమర్శ
చలామణిలో నుంచి రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. దేశం ఎదుర్కొంటున్న నల్ల ధనం, అవినీతి, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు అందచేయడం వంటి సమస్యలకు పరిష్కారంగా, డిజిటల్‌ చెల్లింపులను పెంపొందించడానికి మోడీ ఆర్భాటంగా 2016లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దును వాస్తవంగా ఈ చర్య తిప్పికొట్టిందని సీపీఐ(ఎం) దృఢంగా విశ్వసిస్తున్నట్టు పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పైగా, గత అనుభవాల రీత్యా చూసినట్లైతే, 2 వేల నోట్లతో పేరుకుపోయిన నల్ల ధనం నిల్వలను ప్రక్షాళన చేయడం కన్నా ఈ చర్య వాటిని మరింత చట్టబద్ధం చేసిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యతో కోట్లాదిమంది ప్రజల జీవనోపాధులను దారుణంగా దెబ్బతీసింది. వందలాదిమంది జీవితాలను బలి తీసుకుంది. ప్రధానంగా ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించే, జీడీపీ వృద్ధిరేటుకు దోహదపడే అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ధ్వంసమయ్యాయి. మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలో వున్న నగదు 83శాతానికి పెరిగింది. అవినీతి చట్టబద్ధమైంది, పైగా పలు రెట్లు పెరిగింది. అందరూ ఖండించదగ్గ తీవ్రవాద దాడులు, కార్యకలాపాలు కొనసాగుతునే వున్నాయి, అమాయకుల ప్రాణాలను తీస్తునే వున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.మన ఆర్థిక వ్యవస్థను మోడీ ధ్వంసం చేయడాన్ని, జాతీయ ఆస్తులను లూటీ చేయడాన్ని ప్రతిఘటించాలని, ఆ చర్యలను ఓడించాలని సీపీఐ(ఎం) ఈ ప్రకటనలో కోరింది. ఆశ్రిత పక్షపాతులైన కార్పొరేట్లు, మతోన్మాదుల మధ్య సంబంధాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని పిలుపిచ్చింది. ఇటువంటి నియంతృత్వ ఏకపక్ష ప్రజా వ్యతిరేక చర్యల నుంచి మన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవడానికి మనందరం ఐక్యంగా వుండాలని ప్రజలకు పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.