వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్.ఒ.సి) పొడుగునా గస్తీ ఏర్పాట్లపై భారత్-చైనాల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు భారత ప్రభుత్వం అక్టోబర్ 21న ప్రకటించింది. ఇది స్వాగతించదగిన పరిణామం. ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణకు ఇది దారితీస్తుందని ఆశించవచ్చు. 2020లో గాల్వాన్ లోయలో సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయకుండా చూడాలని రెండు దేశాలు అంగీకరించాయి. 2020 నుంచి ఇరు దేశాల మధ్య సైనిక దౌత్య స్థాయిల్లో 31 దఫాల చర్చలు జరిగాయి. ఇరుపక్షాలకు చెందిన సైనిక కమాండర్లు సైనిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా భారత్-చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ యంత్రాంగం (డబ్ల్యు.ఎం.సి.సి) ఆధ్వర్యంలో దౌత్య స్థాయి చర్చలు జరిగాయి. రాజకీయ నాయకత్వ జోక్యంతో ఈ చర్చలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. సాధారణ సంబంధాల పునరుద్ధరణ అవసరాన్ని రాజకీయ నాయకత్వం గుర్తించింది. ”భారత్- చైనాల మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు మన రెండు దేశాలకే గాక మొత్తం ప్రాంతానికి, ప్రపంచానికి కూడా అవసరం” అని మోడీ అన్న మాటల్లో ఈ వైఖరినే ప్రతిబింబించారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని రెండు మాసాల మధ్యలో రెండు సార్లు (జులై, ఆగష్టు నెలల్లో) కలుసుకున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ‘బ్రిక్స్’ సమావేశాలతో పాటు భద్రతా వ్యవహారాల సలహాదార్ల సమావేశం నేపథ్యంలో అజిత్ దోవల్ కూడా వాంగ్ యీ ని కలుసు కున్నారు. వీటి కొనసాగింపుగా డబ్యు.ఎం.సి.సి రెండు సార్లు వెంట వెంట సమావేశాలు జరిపింది. చాలా సహనంతోనూ చాలా నికరంగానూ సాగించిన దౌత్య నీతి ఫలితమే ఈ ఒప్పంద మని జైశంకర్ పేర్కొనడానికి కారణమదే. రెండు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి సరైన మార్గం కూడా అదే. రష్యాలోని కజన్‌లో ‘బ్రిక్స్’ శిఖరాగ్రసభ నేపథ్యంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల ద్వైపాక్షిక సమావేశం జరగడానికి ఈ దౌత్యపరమైన ప్రయత్నాలన్నీ బాట వేశాయి.
తొలిసారి భేటీ ప్రాధాన్యత
2020 ప్రతిష్టంభన తర్వాత ఉభయ నాయకులు ద్వైపాక్షిక భేటీ జరపడం ఇదే మొదటిసారి గనక ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరపర్చుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని ఇరువురు నాయకులు అంగీకారానికి వచ్చారు. భారతదేశ బూర్జువా వర్గానికి ఎదురైన ఆర్థిక సమస్యలే చైనాతో వ్యాపారం చేసుకునే సదుపాయాన్ని సరళతరం చేసేందుకు ఒత్తిడి తెచ్చేలా చేశాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ చెప్పే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 562.9 వందల కోట్ల డాలర్లతో చైనా ఇండియా దిగుమతులలో అగ్రస్థానంలో నిలిచి వుంది. ప్రస్తుత ప్రపంచీకరణ ఆర్థికావరణంలో ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం ఉభయ దేశాలకూ లాభదాయకమని అంతకంతకూ ఎక్కువగా గుర్తించబడింది. భారతదేశాన్ని ఒక ఉత్పత్తి కేంద్రంగా మార్చాలంటే విద్యుత్ వాహనాలు (ఇ.విలు), స్మార్ట్‌ఫోన్లు, సోలార్ ఫోన్లు, మందుల వంటి కొన్ని సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలను భారత ప్రభుత్వం కీలకంగా గుర్తించింది. చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్ధరణ ఈ పరిశ్రమలలో అత్యధిక వాటికి ఉపయోగంగా వుంటుంది. ఉత్పత్తి రంగంలో సంయుక్త పథకాలకు చైనా నుంచి పెట్టుబడులు రావడం పట్ల ప్రస్తుతం వున్న ప్రతికూల వైఖరి మారవలసి వుంటుంది. విద్యుత్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో వున్న అతి పెద్ద చైనా పరిశ్రమ బివైడి 2023లో ఒక భారతీయ కంపెనీలో వంద కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతానంటే తిరస్కరించడం ముందుచూపు లేకుండా తీసుకున్న చర్య. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం స్థాపించి వుంటే భారత దేశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి ప్రక్రియలనూ అందుకునేందుకు సహాయపడేది.
అంతర్జాతీయ ప్రభావం, అమెరికా పాత్ర
వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితి కూడా ఈ రెండు దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ అవసరం గుర్తించాల్సిన స్థితిని కల్పించింది. ఉక్రెయిన్ యుద్ధం, గాజా పశ్చిమాసియాలలో ఇజ్రాయిల్ దురాక్రమణ వనరుల పైన, వాణిజ్య మార్గాల పైన, దేశాల మధ్య సంబంధాల పైన తీవ్ర ప్రభావం వేశాయి. తమ వ్యవహారాలన్నీ కేవలం అమెరికాతోనే జతపర్చడం విషతుల్యమని చాలా దేశాలు కళ్లు తెరిచి గుర్తించాల్సి వచ్చింది. ఈ పూర్వరంగంలో ‘బ్రిక్స్’ వంటి కూటములు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాంటి బృందాలలో చేరాలనే ఆకాంక్షను అనేక దేశాలు బహిరంగంగానే వెల్లడిస్తున్నాయి. పశ్చిమాసియాలో రెండు ప్రాంతీయ అధికార కేంద్రాలుగా వున్న సౌదీ అరేబియా, ఇరాన్ ఈ మధ్యనే ఈ కూటమిలో చేరాయి. తన చుట్టూ ఇలాంటి భౌగోళిక రాజకీయ మార్పులు సంభవిస్తుంటే ఈ కూటమిలో ఇండియా వొంటిగొట్టుగా వుండజాలదు. కూటమి వ్యవస్థాపక సభ్య దేశాలైన వాటితో శత్రుపూరిత సంబంధాలు గాక సత్సంబంధాలు కలిగివుండటం సహజం.
2020 సరిహద్దు ఘర్షణల తర్వాత భారత ప్రభుత్వం అమెరికాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. అనేక రక్షణ ఒప్పందాలు మాత్రమేగాక భారత్-చైనా వివాద సరిహద్దు గురించి వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకునేలా కూడా ఒప్పందాలు చేసు కుంది. హిమాలయ సరిహద్దులో సైనిక దళాల కదలికలపై నిఘా కోసం 300 కోట్ల డాలర్ల పైన వ్యయంతో 31 ఆయుధ సహిత గార్డియన్ డ్రోన్లను ఇండియా కొనుగోలు చేయడం కూడా ఆ ఒప్పందాల్లో ఒకటి. అమెరికా నాయకత్వంలోని ‘క్వాడ్’ కూటమితో ఆస్ట్రేలియా, జపాన్‌లతో పాటు ఇండియా కూడా సభ్యదేశంగా వుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణ, మరీ ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడయ్యేట్టయితే దాని విధాన నిర్ణయాలలో విశ్వాస రాహిత్యం రీత్యా ప్రభుత్వం చైనాతో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవడం వివేకవంతమైన పని అని ఆరెస్సెస్ పత్రిక ‘ఆర్గనైజర్’ (2024 సెప్టెంబర్ 22) కూడా వ్యాఖ్యానించింది.
వివాద పరిష్కారం, సంబంధాల విస్తరణ
ఇండియా, చైనాలు 3400 కిలోమీటర్ల పైగా సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దులో పెద్ద భాగం సరిగ్గా నిర్ణయించ బడకపోవడం, రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా వివాదం కొనసాగడానికి కారణమవుతున్నది. భారత్-చైనా సరిహద్దు వివాదాలు మొత్తాన్ని పరిష్కరించుకునే యంత్రాంగాన్ని పునరుద్ధరించుకోవడమే ఇప్పుడు జరగాల్సింది. 1993 సరిహద్దు శాంతి ప్రశాంతతల ఒప్పందం, 2013 సరిహద్దు రక్షణ సహకారంపై పెంచుకోవలసి వుంటుంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం ఆర్థిక సంబంధాల విస్తరణకు చర్యలు తీసు కోవాలి.ప్రజల మధ్య రాకపోకలు ప్రత్యేకించి ఉత్పత్తి రంగంలో మన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తిని పెంచే పెట్టుబడులను రాబట్టే చర్యలను పెంచుకోవాలి.
(అక్టోబర్ 23 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)