వయోధిక పాత్రికేయ సంఘం ఎ.బి.కె ప్రసాద్ గారికి అంకితంగా ఈ పుస్తకం తెచ్చింది. ఎ.బి.కె.ప్రసాద్ జర్నలిస్టులకు స్ఫూర్తిప్రదాత. స్వేచ్ఛాప్రియుడు, శాస్త్రీయ దృక్పథం గల హేతువాది. తొమ్మిది పదుల వయసులో ‘సాక్షి’ పత్రికలో వారం వారం కాలమ్ రాయడం ఎ.బి.కె. ప్రసాద్ గారికే సాధ్యం. ఏ పత్రికలో పనిచేసినా ప్రజల పక్షాన నిలిచి, ప్రభుత్వాల పనితీరుపై నిశిత విమర్శలు, సూచనలు చేసిన ప్రజాపక్షపాత పాత్రికేయులు. దాసరి నారాయణరావు సారధిగా, ఎ.బి.కె. సంపాదకుడిగా తెలుగు జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కించారు.
విశాలాంధ్ర, ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఉదయం, వార్త దినపత్రికల్లో ఎ.బి.కె. పనిచేశారు. సుప్రభాతం పత్రిక పెట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎ.బి.కె. పనిచేశారు. తెలుగు భాషకు ప్రాచీన హోదాకై కృషి చేశారు. కుష్వంత్‌సింగ్, ముట్నూరి, నార్ల, గోరా తర్వాత అంతటి గొప్ప పాత్రికేయులు ఎ.బి.కె. 1986 – 89 మధ్యలో ఎన్టీయార్ పాలన, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో తీవ్ర నిర్భంధం, జాతీయ రాజకీయాల్లో బోఫోర్స్ కుంభకోణ ప్రకంపనలు, పంజాబ్ కల్లోలం, కోస్తా ప్రాంతంలో కుల రాజకీయాలు, అనుదినం అనేక సంచలనాల కాలంలో ఎ.బి.కె. కలం వేడిగా రగిలింది. ఈనాడు కన్నా మిన్నగా ఆంధ్రజ్యోతి వేడి వేడి వార్తా సంచలనాలకు వేదికైంది. ఆయన సారధ్యంలో కమ్యూనిస్టు పత్రికలలో కీలక సమయంలో పనిచేసి వుండడం, విప్లవ కమ్యూనిస్టులతో మెలగడం వల్ల కుట్రకేసులో కూడా నిందితుడు కావడం, హోచిమన్ కవితలను శ్రీకాంతవర్మతో కలిసి తెలుగు చేయడం, అనేక ప్రగతిశీల రచనలు, అనువాదాలు ఎ.బి.కె.ను విశిష్టవ్యక్తిగా నిలబెట్టాయి.
పార్వతీపురం కుట్రకేసు పూర్వాపరాలు (పేజీ 58), స్థానం – ఆస్థానం కాదు అనే డా||నాళేశ్వరం శంకరం ముఖాముఖి, నేను పెంచిన పత్రికలే నాకు సవాళ్లు అనే టి.ఉడయవర్లు ఇంటర్వ్యూ తనకు తానే సాటి అనే టంకశాల అశోక్ వ్యాసం… ఈ పుస్తకంలో వ్యాసాలు పాఠకులకి 50 సంవత్సరాల క్రిందటి చరిత్రను చెప్పాయి. కల్లూరి భాస్కరం, తాడి ప్రకాష్, భగీరధ గోపరాజు నారాయణరావు, టి.ఉడయవర్లు, ఎన్. వేణుగోపాల్, ఎ.కృష్ణారావు, గోవిందరాజు చక్రధర్, మాడభూషి శ్రీధర్ వ్యాసాలు పత్రికారంగ ప్రాధాన్యత, విలువలు, ఎ.బి.కె. కృషి పలు పత్రికల్లో ఆయన కృషిని ఈ పుస్తకంలో చూడగలం. చివరిలో ఛాయా చిత్రమాలిక ఎంతో అలరిస్తుంది. డా||సి.నారాయణరెడ్డి, డా||సంజీవ్‌దేవ్, నార్ల వెంకటేశ్వరరావు గారి అభిప్రాయాలు (వెనుక) ప్రచురించారు. ప్రతి పాత్రికేయునికీ ఇది చక్కటి కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472