గాజా ఆస్పత్రుల్లో దాడులపై స్వతంత్ర, సమగ్ర, పారదర్శక దర్యాప్తు

– యూఎన్‌ మానవ హక్కుల కార్యాలయం నివేదిక పిలుపు
జెనీవా : గాజాలోని ఆస్పత్రులపై ఇజ్రాయిల్‌ నిర్దాక్ష్యిణ్యంగా సాగిస్తున్న దాడులతో ఆ ప్రాంత ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతోందని, దీనివల్ల పాలస్తీనియన్లకు వైద్యం అందే అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్‌ (ఒహెచ్‌సిహెచ్‌ఆర్‌) కార్యాలయం మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ దాడులు, జరిగిన సంఘటనలపై స్వతంత్రంగా, సమగ్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరగడం చాలా ముఖ్యమని ఆ నివేదిక పేర్కొంది. చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ మానవతా, మానవ హక్కుల చట్టాల ఉల్లంఘనలకు పూర్తి జవాబుదారీ వహించాలని యుఎన్‌ హై కమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ కోరారు. 2023 అక్టోబరు 12 నుండి 2024 జూన్‌ 30 మధ్య కాలంలో జరిగిన దాడుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇజ్రాయిల్‌ వ్యవహరించే తీరు పట్ల తీవ్రమైన ఆందోళనలు కలిగిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. గాజాలో ఆస్పత్రులపై విచక్షణారహితంగా జరిగిన దాడులతో రోగులు, వైద్య సిబ్బందికి తీరని నష్టం జరిగిందని, మానవతా సంక్షోభం మరింత ముదిరిందని నివేదిక పేర్కొంది. ఆస్పత్రులన్నింటినీ సైనిక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని, అందుకే తాము ఆస్పత్రులపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్‌ చెబుతోందని కానీ అవన్నీ నిరాధారమైన, అస్పష్టమైన ఆరోపణలని నివేదిక స్పష్టం చేసింది. బహిరంగంగా అందరికీ అందుబాటులో వుండే సమాచారానికి పూర్తి విరుద్ధంగా ఇజ్రాయిల్‌ ఆరోపణలు వుంటున్నాయని పేర్కొంది.