నూయార్క్ : అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన ఫాజిల్ ఖాన్ (27) గతంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో కాపీ ఎడిటర్‌గా పనిచేశాడు. అయితే జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు. అనంతరం అతడు అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం ఫాజిల్ నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఈబైక్ బ్యాటరీ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వేగంగా భవనం మొత్తం చెలరేగాయి. దీంతో భవనంలో చిక్కుకుపోయిన ఫాజిల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో సుమారు 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పలువురు ప్రాణాలు దక్కించుకునేందుకు కిటికీల్లోంచి బయటకు దూకేశారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించింది.
మరోవైపు ప్రమాద ఘటనపై భారతీయ ఎంబసీ స్పందించింది. ఫాజిల్ మృతిపట్ల విచారం వ్యక్తం చేసింది. అతడి కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నామని, వారికి కావాల్సిన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.