అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ వస్తువు అభివ్యక్తి రెండూ రెండు కళ్ళ లాంటివి. కథలో కూడా రెండూ ముఖ్యమే అయినప్పటికీ వస్తు స్వీకారంలో నవ్యత లేకపోతే అది రీడబిలిటీ ఉన్న కథ అయినప్పటికీ పాఠకుల మీద బలమైన ముద్ర వేసే అవకాశం ఉండదు. కథ మానసిక అనందం కోసమా, సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి రాయబడుతుందా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు భాషలను దాటి విస్తరించగలిగే కథలన్నీ సామాజిక ప్రయోజనం వల్లనేనని జవాబు చెప్పుకోవలసిన అవసరం ఉంది. ‘రేపెక్కడికెళ్తావ్…!’ అనే పేరు మీద 15 భారతీయ కథల్ని వివిధ భాషల నుండి ఆంగ్లం లేదా హిందీ ద్వారా అనువదించారు డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్. ఇందులో కథలను ఎంచుకున్న విధానం ఆలోచించనాత్మకంగా ఉంది. ఈ కథలన్నీ సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన రచయితలవి. కొందరు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన రచయితలు కూడా ఇందులో ఉన్నారు. వీటిలో స్వాతంత్రోద్యమంలో రాయబడ్డ కథలు కొన్ని, స్వాతంత్య్రానంతరం రాయబడ్డ కథలు కొన్ని. వస్తుపరంగా విభజించి చూసినప్పుడు శైలిని అధిగమించి ప్రజలకు చేరగలిగేటటువంటి కథలు ఇవి.
ప్రతిభారారు ఒరియాలో రాసిన కథ ‘పాదుకల పూజ’, మీనా కోడ్కర్ రాసిన కొంకని కథ ‘ఓ నా చిట్టి తండ్రి’ అన్నవి సంప్రదాయం అనిపించే భిన్నమైన వస్తువులు. పాదుకల పూజ అనే పేరు వినగానే ఏదో భక్తి పూరితమైన కథ అనుకునే తెలుగు పాఠకుడు కథను చదివినకొద్దీ తన అభిప్రాయాన్ని మార్చుకోవలసి వస్తుంది. విధాన్ బాబుకు తండ్రి ఎక్కువ సమయం కేటాయించి పెంచలేకపోయినప్పుడు బాబాయే తండ్రి కన్నా ఎక్కువగా అన్న కొడుకును ప్రేమిస్తాడు. పది మైళ్ళకు పైగా వెళ్లి రావలసిన పాఠశాలకు స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లి తీసుకొస్తూ ఉంటాడు. అలా తీసుకువస్తూ ఉన్న బాబాయికి చెప్పులు లేకపోవడం వల్ల అతని కాళ్లు బొబ్బలెక్కి రక్తం కారుతూ ఉంటాయి. అయినా అతను తన కొడుకు మీది ప్రేమతో అన్నీ భరిస్తాడు. చివరికి విధాన్ బాబు పెద్దవాడై ప్రయోజకుడైన తర్వాత తన బాబాయికి ఒక చెప్పుల జత కొనిస్తే, ఆయన ఒక్కసారి మాత్రమే ఆ చెప్పులను ధరిస్తాడు. కానీ నాలుగడుగులు కూడా వేయలేని అనారోగ్యంలో మరణిస్తాడు. ఈ కథలో వస్తువు ఎంత సరళంగానో ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఇది చాలా కొత్త వస్తువు. పైగా కథ చెప్పిన విధానం వల్ల పాఠకుడు కళ్ళనీళ్ళ పర్యంతమవుతాడు. విధాన్ బాబు నాన్నకు సేవ చేస్తున్న ఒక పనివాడు మీ తమ్ముడి కొడుక్కి స్కాలర్షిప్ వచ్చిందటగా అని ప్రశంసించడంతో అతని చెంప చెల్లుమనిపిస్తాడు విధాన్ బాబు తండ్రి. ‘విధాన్ బాబు నా తమ్ముడి కొడుకు కాదు. అతడు నా కొడుక’ని గర్వంగా ప్రకటించడం ఒక ఎత్తు. రెండు నిమిషాల్లోనే ఉమ్మడి కుటుంబ జీవనంలోని ప్రేమ వల్ల అతడి హృదయం విశాలమై అతన్ని ఇంకోలా మాట్లాడిస్తుంది. ‘అతడు నా కొడుకు అయితే ఏమిటి? నా తమ్ముడి కొడుకు అయితే ఏమిటి? విధాన్ బాబు మా కొడుకు’ అంటాడు. అక్కడ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలలోని ఉమ్మడి కుటుంబ భావనలోంచి వచ్చిన ప్రేమ అపురూపంగా వ్యక్తమవుతుంది. ఇంకొక సందర్భంలో విధాన్ బాబు పుట్టినప్పుడు తన తల్లి అనారోగ్యంతో మరణించే అవకాశం ఉండడంతో విధాన్ బాబు తండ్రి తన తమ్ముడి భార్యను పిలిచి ‘వీడి తల్లి మరణిస్తే ఇక నువ్వే వీడికి తల్లివి’ అని చెబుతాడు. అందుకు ఆమె ఇచ్చిన జవాబు కూడా పాఠకుల్ని కట్టిపడేస్తుంది. ‘మీరు బాధపడకండి బావగారు, అక్క బతికి ఉన్నా వీడు నా కొడుకే’ అంటుంది. ఈ కథలోని పాత్రల ప్రవర్తన, కథను నడిపించే పద్ధతి వల్ల పాఠకుడు ఈ కథ చేత తీవ్రంగా ప్రభావితుడవుతాడు. మీనా కాకోడ్కర్ రాసిన ‘ఓ నా చిట్టి తండ్రీ’ అనే కొంకణి భాషా కథ దిగువ మధ్యతరగతి కుటుంబ గాథే. చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల రోజూ తల్లి పక్కలో పడుకునే రఘును పక్కింటి సురంగు తన దగ్గర పడుకోపెట్టుకుంటుంది. కానీ తన చిన్నమ్మ వచ్చి రఘు పెంపకం అతని తండ్రి వల్ల కాదని తానే పెంచుతానని తీసుకొని వెళ్ళిపోతుంది. తన సొంత ఊర్లో రఘును బడికి కూడా పంపిస్తుంది. చిన్నమ్మ వద్ద పెరుగుతున్న రఘును తన సొంత కొడుకుగా చూస్తుంది చిన్నమ్మ. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఒకరోజు రఘు తండ్రి వచ్చి తన కొడుకుని తీసుకెళ్తాను అంటాడు. రఘును పెంచడం మీవల్ల కాదని చిన్నమ్మ గొడవ పడుతుంది. కానీ తానిప్పుడు రెండో వివాహం చేసుకున్నానని అందువల్ల రఘుని తాను తన భార్య కలిసి పెంచగలుగుతామని తీసుకుపోతున్నప్పుడు రఘు ఎంతో ఆనందంగా తండ్రితో వెళుతుంటాడు. పిల్లలు లేని చిన్నమ్మ అక్క కొడుకుని తన సొంత కొడుకుగా చూసుకొని పొంగిపోయిన పరిస్థితి తారుమారు అయినప్పుడు ఆమె పడే వేదన ఆర్ద్రంగా వర్ణించిన కథ ఇది.
ఇస్మత్ చుగ్తారు రాసిన ‘అస్తిత్వ మూలాలు’ అనే ఉర్దూ కథ, మున్షి ప్రేమ్‌చంద్ రాసిన ‘జులూస్’ అనే హిందీ కథ స్వాతంత్రోద్యమ ఘట్టాలకు సంబంధించినవి. ఇస్మత్ చుగ్తారు కథ దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ కు వెళ్లడానికి, వెళ్లక పోవడానికి ఈ మధ్య ఊగిసలాడిన ముస్లిం కుటుంబ గాధ. మార్వాడ్ ప్రాంతంలోని చుబ్బమియా, రూప్‌చంద్ కుటుంబాలు విడదీయలేనంత స్నేహంతో కలిసి ఉంటాయి. ఈ రెండు కుటుంబాలు రాజకీయాలు ప్రేరేపించడంతో అటు పాకిస్తాన్ జెండాను, ఇటు మూడు రంగుల జెండాను ఎగరవేస్తుంటారు కానీ వారి స్నేహానికది ఎప్పుడూ అడ్డు రాలేదు అని రచయిత్రి చెప్పుకొస్తారు. ఆ స్నేహం ఎంత బలంగా ఉంటుందంటే చబ్బుమియా కుటుంబం పాకిస్తాన్‌కు పోవడానికి సిద్ధమై కూడా రూప్‌చంద్ కుటుంబం మీద ప్రేమతోటే తిరిగి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. తమ అస్తిత్వ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయని గుర్తిస్తుంది. ప్రేమ్‌చంద్ రాసిన జులూస్ కథ దేశభక్తి పూరితమైనది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జులూస్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని సబ్ ఇన్స్పెక్టర్ బలంగా హింసించడంతో ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి మరణానికి కారణమైన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను ఆయన సతీమణి తన దేశభక్తి స్ఫూర్తితో మారుస్తుంది. ఆ సబ్‌ఇన్‌స్పెక్టర్ దేశభక్తుడిగా మారి పాశ్చాత్తాప పడడంతో ఆకథ ముగుస్తుంది. ఈ రెండు కథలు జాతీయోద్యమాన్ని చిత్రించడంతోపాటు ఆ కథ నడిపిన పద్ధతి వల్ల పాఠకుల హృదయాల్లో అవి స్థిరపడిపోయాయి.
ఈ సంపుటిలోని ఇందిరా గోస్వామి అస్సామీ కథ ‘ప్రయాణం’. అస్సాంలో తీవ్రవాదం గురించి, దానివల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల గురించి చర్చిస్తుంది.
మహాశ్వేతాదేవి బెంగాలీ కథ ద్రౌపది నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో రాజ్యం చేస్తున్న ‘అతి’ని చిత్రిస్తుంది. పోలీసుల దమనకాండ ఎంత వికృతంగా ఉంటుందో కళ్ళకు కడుతుంది. ఓం ప్రకాష్ వాల్మీకి హిందీ కథ ‘శవయాత్ర’ ఒక పల్లెటూరిలో దళిత కుటుంబం పడే అగచాట్లను చిత్రిస్తుంది. ‘రేపెక్కడికకెళ్తావ్…?’ అనే పద్మా సచిదేవ్ డోగ్రి కథలో తన ప్రమేయం లేకుండా శోభనం రోజే చనిపోయిన భర్త కారణంగా ఒక అమాయకురాలైన స్త్రీ పడిన వేదన వర్ణించబడింది. తోషి మేడం మిస్సెస్ ఆదిత్య వర్మల సహకారంతో ప్రీతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ప్రయత్నాలలో ఓ సగటు దిగువ మధ్యతరగతి స్త్రీ ఎలా నష్టపోతుందో వివరించే కథ ఇది. నారాయణ గణేష్ గౌరీ మరాఠీ కథ ‘గుక్కెడు నీళ్లు… పిడికెడు రక్తం!’ మతవాదపు నికృష్ట రూపాన్ని చాలా సృజనాత్మకంగా వర్ణించింది. అన్వర్ అనే చిన్న కుర్రాడికి మానవతా దృక్పథంతో అతి కష్టం మీద మంచినీళ్లు తెచ్చిన ఉదంసింగ్ మరో సందర్భంలో ఆ పిల్లవాడు ముస్లిం అని తెలిసి ఎంతైనా పాము కదా అని అతన్ని చంపడానికి సాహసిస్తాడు. సారా జోసెఫ్ రాసిన చెమటగుర్తులు అనే మలయాళీ కథ ఆలోచనత్మకమైనది. ఇందులో ఒక దళిత యువతి కాలేజీలోనే మొదటి ర్యాంకు సాధించినప్పటికీ ఆమెను ఓపెన్ కేటగిరీలో మొదటి వ్యక్తిగా కాకుండా రిజర్వుడ్ కేటగిరీలో మొదటి వ్యక్తిగా చూపించడం వల్ల రిజర్వుడ్ కేటగిరీకి జరిగే నష్టం ఇందులో చర్చించబడింది.
ఈ సంపుటిలోని 15 కథల్లో పేగు తెగిన బంధం అనే మోతిలాల్ జోత్వాని గారి సింధీకథ, రషీద్ జహాన్ ఢిల్లీ సందర్శన అనే ఉర్దూ కథ, అశోక్ మిత్రన్ రక్తమోడుతున్న గాయం అనే తమిళ కథ, అఫ్జల్ అహసాన్ రన్తావా రాసిన పంజాబీ కథ చెదిరిపోయిన పరిమళాలు, ప్రవీణ్ సింగ్ దావడా రాసిన గుజరాతి కథ ఇంటి వైపుకు అనేవి వస్తువు కన్నా కథనం లక్ష్యంగా నడిచిన కథలు అనిపిస్తాయి.
మొదలే అనుకున్నట్టు ఇవి ప్రసిద్ధి పొందిన సాహిత్యకారుల రచనల నుండి ఎంపిక చేసుకొని చేసిన అనువాదాలు. ఈ అనువాదాలకు ఎంపిక చేసుకున్న కథలను గమనించినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు రెండు. విభిన్నమైన వస్తువు కోసం రచయిత నిరంతర జాగరూకతతో వెతుక్కోవలసిన అవసరం ఉంది.
అనువాదాల్లో ఒక రచయితను కానీ లేదా ఒక భాషలోని విభిన్న రచయితల కథలను కానీ అనువాదం చేయడం వేరు. దాని ప్రయోజనం పరిమితం. కానీ పది భారతీయ భాషల నుండి షార్ట్ ఫిక్షన్లను ఎంపిక చేసుకుని అనువాదం చేసి తెలుగు వాళ్లకి అందివ్వడం ద్వారా ఇతర భాషలో వర్తమాన కథ ఎలా నడుస్తుందో తెలుసుకునే అవకాశం తెలుగువారికి దొరుకుతుంది. తద్వారా తెలుగు పాఠకుడు, అంత కంటే ముఖ్యంగా తెలుగు కథకులు లాభపడతారనిపిస్తుంది. ‘రేపెక్కడికెళ్తావ్…?’ అనే అనువాద కథా సంపుటి ప్రచురించి నవతెలంగాణ తెలుగు సాహిత్య లోకానికి ఒక మేలు చేసింది.
చాలా కథలు ఒరిజినల్ కథను చదివిన ఫీలింగ్‌ని కలిగిస్తాయి. ఈ రకంగా డాక్టర్ రూప్ కుమార్ డబ్బింగ్ గారు మంచి అనువాదకుడిగా పాఠకులకు గుర్తుండిపోతారు.
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183