”పక్క మీద ఉన్న అమ్మకు ఆప్యాయంగా/ ఓ అరటి పండు తినిపించా…/ విచిత్రంగా పూజా గదిలోని/ అమ్మ వారు బ్రేవ్ మని త్రేంచింది!”
కొలిపాక శ్రీరామారావు కవిత్వ పేగు బంధానికి, అనుబంధానికి అద్దం పట్టే చక్కని చిక్కని కవితా పాదాలివి. అట్లే నాన్నని స్మరిస్తూ ఇలా…
”నాన్నా! నీతో కలిసి నడిస్తే/ నదితో నడిచినట్టుండేది…” అట్లే
”నాన్నా! నా మునివేళ్ళు ముక్తిని పొందాయి/ నీపై నాలుగు మాటలు వ్రాసి…” అంటాడు.
ఈ కవితా పాదాలు చదివే పాఠకుల కళ్ళ ముందు వారి వారి తల్లిదండ్రులు ప్రత్యక్షమవుతారు.
కని పెంచిన తల్లిదండ్రులతో పాటు కన్న ఊరును అదే స్థాయిలో స్మరించుకుంటున్నాడు ఈ కవి తన ఊరి పేగు కవితా సంపుటిలో. నిత్యం తన తలపోతలలో తరించే సమస్త ఊరి సంఘటనలను సరళ సుందరమైన భావ చిత్రాలతో సమర్థవంతంగా శ్రీరాములు కవిత్వీకరించారు.
తాను ఎప్పుడు ఊరెళ్ళినా ”జన్మకు సరిపడే ప్రేమను జమ చేసుకుని వస్తున్న” అంటాడు. అన్ని కవితల్లోను ఊరే వీరికి కవితా స్ఫూర్తి కావడం ఒక విశేషం.
ఊర్ల మీద, నగరాల నీడ పడి మన పురాతన అస్థిత్వాలను కోల్పోతున్నాయి. ఇంటి ముందు ఎంతో పొందికగా, హుందాగా ఉండే అరుగులు కనుమరుగైన దశ్య కారణాలను ఇలా కవిత్వంగా మలిచాడు.
”అగపడక పోవడానికి/ అంతర్ధనమైనమై పోనక్కర్లేదు/ అంతరించి పోనక్కర్లేదు/ అవసరం లేకుండా పోతే చాలు…” అంటూ
మానవ సంబంధాల ఏలికైన అరుగు కనుమరుగైన విషయాన్ని ఎంతో విషాదంతో రంగరించి చూపారు. వస్తువు ఎంపిక, ప్రజెంటేషన్ ఈ కవితా సంపుటిలో పుష్కలంగా ఉన్నాయి.
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
ఊరి పేగు
రచన : కొలిపాక శ్రీరామారావు
వెల:110/- పేజీలు 200.
ప్రతులకు : రాంబాబు,
ఇం.నెం. 10-1-76, రాధాజ్యోతి టవర్స్ ,
మామిళ్ళగూడెం , ఖమ్మం -507001.