– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ ఈ ఏడాది వేగంగా పూర్తి చేయడంపై పలు అనుమానాలున్నాయనీ, విచారణ జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనేక ఏండ్లుగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ మార్చి వరకు జరిగేదని తెలిపారు. కళాశాలకు కేటాయించిన సీట్లు అవి అమలు చేసిన నిబంధనలు, విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ఫీజు వివరాలు, డొనేషన్లు తీసుకోకుండా సీట్లు ఇచ్చారా? లేదా?, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల భర్తీ వంటి అంశాలపై పారదర్శకత పాటించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా మండలి ఈసారి తూతూ మంత్రంగా ర్యాటిపికేషన్ ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో 150 ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో 25 వేల సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. ఆ దరఖాస్తులను ఇంత వేగంగా ఎలా పరిశీలన చేశారో అనే అంశంపై అనుమానాలున్నాయని తెలిపారు. గతంలో అనేక ప్రయివేటు కళాశాలలపై అక్రమంగా సీట్లను బ్లాక్ చేశాయంటూ ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు. హడావుడి ర్యాటిఫికేషన్ ప్రక్రియపై అనుమానాలున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.