
నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖలో 5 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మీడియా సాధనాల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో2017 నుండి కొనుగోలు చేసిన వాహనాలు, పని ముట్లపై వివిధ అభివృద్ధి పనుల పేరుతో జరిగిన పనులపై విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్మికులకు సరఫరా చేసే పని ముట్లు చీపుర్లు, గైపావుడలు, యూనిఫ్సా, తోపుడు బండ్లు నాసిరకం వల్ల వారం పదిరోజులు వాడితేనే చెడిపోతున్నాయని తెలిపారు. కొంత మంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల లక్షలాది రూపాయల నిధుల దుర్వినియోగం అవుతున్నాయి ఆరోపించారు.అదేవిధంగా నూనెలు, సబ్బులు, చెప్పులు సరైన సమయంలో సరఫరా చేయడంలేదని విమర్శించారు. ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లయ్ గార్డెన్స్, స్ట్రీట్ లైట్స్ కార్మికులకు రక్షణ పరికరాలు,రాత్రి పూట డ్యూటీ కార్మికులకు టార్చ్ లైట్స్ , గార్డెన్స్ లో కొడవళ్ళు, గొడ్డళ్లు ఇవ్వడం లేదు. దీంతో పని ముట్లును చాలీచాలని జీతం నుండే కార్మికులు కోనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్,జిల్లా కలెక్టర్ లు దృష్టి సారించి విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత,బిఎల్ పి జిల్లా కన్వీనర్ కె.మధు, బిఎల్ పి నగర అధ్యక్షులు ఎం. అజయ్, బిఎల్ టియు నగర అధ్యక్షులు తిట్టే రాజు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి,కార్యదర్శి దండు జ్యోతి పాల్గొన్నారు.