నవతెలంగాణ-దంతాలపల్లి
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఓ విద్యార్థిని ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రచక్రు తండాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గండ్రాతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రసక్రు తండాకు చెందిన గుగులోతు భీమ-పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె గుగులోతు స్వాతి (17) తొర్రూర్ పట్టణంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంటి వద్దనే ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. కాగా, స్వాతి ఆత్మహత్య విషయం తెలుసుకున్న మహబూబాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.