– 100 ఎకరాలు కబ్జా చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
– హైకోర్టు ఆదేశాల మేరకే అక్రమ కట్టడాల కూల్చివేత : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాజీ మంత్రి మల్లారెడ్డి 100 ఎకరాలు స్వాహా చేశారని, ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండ వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ బహిరంగ సభ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ నేతలు శుక్రవారం కండ్లకోయలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. మల్లారెడ్డి భూకుంభకోణాలన్నింటికీ తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి, దుండిగల్, కుత్బుల్లాపూర్ మండలాల్లో 1200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్నారు. ఈ నియోజకవర్గంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.25వేల కోట్లు స్వాహా చేసినట్టు ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాలను కబ్జా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 300 ఎకరాలకు పై చిలుకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌కు చెందిన భూములు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 55వేల ఎకరాల వక్ఫ్‌బోర్డు ల్యాండ్స్ స్వాహా అయ్యాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూముల్లో పనులను నిలిపేశామని తెలిపారు. అసైన్డ్ భూములకు బినామీల పేర్ల మీద పాస్ బుక్కులు ఇప్పించారన్నారు.
దుండిగల్ సమీపంలోని దామర చెరువులో దాదాపు 8 ఎకరాల బఫర్ జోన్ భూమి కబ్జా చేసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీ నిర్మించారని తెలిపారు. ఈ విషయమై 2011లో బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఇప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా ఉన్నారని తెలిపారు. హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేసి కలెక్టర్ ఆదేశాలతోనే ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేశారని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కేసీఆర్ బంధువని, స్థానిక తహసీల్దార్‌కు మాజీ మంత్రి మల్లారెడ్డి సపోర్టు ఉండటంతో ఇద్దరూ తొత్తులుగా మారి ఈ భూకబ్జాలకు సహకరించారని ఆరోపించారు. దొంగచాటున కలిసే నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీలో చేర్చుకోబోమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అండదండలతో మల్లారెడ్డి ప్రయివేటు యూనివర్సిటీ తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. తిరుమలగిరిలోని పురాతన ఆలయ భూములను మల్లారెడ్డి శిష్యుడు స్వాహా చేసే ప్రయత్నం చేశారని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ సభలో తమ 90 రోజుల పరిపాలన గురించి వివరిస్తామన్నారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు తోటకూర వజ్రేష్‌యాదవ్, బండి రమేష్, కొలను హనుమంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకులు నర్సారెడ్డి తదితరులు ఉన్నారు.