– అమెరికా న్యాయస్థానం నిర్ధారణ
– పెగాసస్ స్పైవేర్‌ను విక్రయించింది ఆ సంస్థే
వాషింగ్టన్ : వాట్సాప్‌పై దాడులకు పాల్పడింది పెగాసస్ స్పైవేర్‌ను విక్రయించిన ఇజ్రాయిల్ ఎన్‌ఎస్‌ఓ గ్రూపేనని అమెరికా జిల్లా కోర్టు నిర్ధారించింది. 2019లో వాట్సాప్ యాప్ వేసిన దావాను పురస్కరించుకొని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. యాప్‌కు చెందిన 1,400 పరికరాలలో (డివైస్‌లు) ఉల్లంఘనలు జరిగాయని వాట్సాప్ ఫిర్యాదు చేసింది. అమెరికా కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ యాక్ట్ (సీఎఫ్‌ఏఏ)ను, వాట్సాప్‌నకు చెందిన సొంత సర్వీసు నిబంధనలను ఎన్‌ఎస్‌ఓ ఉల్లంఘించిందని న్యాయమూర్తి ఫిలిస్ హామిల్టన్ తేల్చారు.
న్యాయమూర్తి ఏమన్నారు?
‘తన క్లయింట్లు వాట్సాప్ అప్లికేషన్ ఆధునిక వెర్షన్‌ను ఉపయోగించుకునేందుకు ఎన్‌ఎస్‌ఓకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు (పెగాసస్) అనుమతించాయి. ఈ ఆధునిక వెర్షన్‌ను వాట్సాప్ ఇన్‌స్టాలేషన్ సర్వర్ లేదా డబ్ల్యూఐఎస్ అని పిలుస్తారు. ఎన్‌ఎస్‌ఓ క్లయింట్లు సిఫర్ ఫైల్స్‌ను పంపేందుకు ఈ సర్వర్ ఉపకరిస్తుంది. సిఫర్ ఫైల్స్ సాయంతో క్లయింట్లు తాము ఎంచుకున్న వినియోగదారులపై నిఘా పెట్టవచ్చు. ఇది సీఎఫ్‌ఏఏను, కాంట్రాక్ట్‌ను ఎన్‌ఎస్‌ఓ ఉల్లంఘించడమే అవుతుందని వాట్సాప్ ఫిర్యాదు చేసింది’ అని న్యాయమూర్తి వివరించారు. కోర్టు ఆదేశాలను పాటించడంలో ఎన్‌ఎస్‌ఓ విఫలమైందని కూడా ఆయన తెలిపారు. పెగాసస్ సోర్స్ కోడ్ కేవలం ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న ఆ దేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుందంటూ ఎన్‌ఎస్‌ఓ చేసిన వాదన ఆచరణ సాధ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
గోప్యతకు లభించిన భారీ విజయం : వాట్సాప్
కోర్టు తీర్పుపై వాట్సాప్ అధినేత విల్ కాథ్‌కార్ట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు గోప్యతకు లభించిన భారీ విజయమని ఆయన అభివర్ణించారు. ‘మా వాదనలు వినిపించేందుకు ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నాము. ఎందుకంటే స్పైవేర్ కంపెనీలు తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి ఎలాంటి రక్షణ పొందలేరు. వాటికి జవాబుదారీతనం ఉండదు. అక్రమ గూఢచర్యాన్ని సహించరాదన్న వాస్తవాన్ని నిఘా కంపెనీలు గుర్తుంచుకోవాలి. ప్రజల ప్రైవేటు సంభాషణలకు రక్షణ కల్పించే విషయంలో వాట్సాప్ ఎప్పుడూ వెనకడుగు వేయదు’ అని ఆయన తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో జరిగిన నష్టానికి సంబంధించిన కేసు విచారణ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుందని న్యాయమూర్తి చెప్పారు.
పెగాసస్‌పై దేశంలో దుమారం
మన దేశంలో పెగాసస్ వినియోగంపై ‘ది వైర్’ పోర్టల్ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ తన స్పైవేర్‌ను కొన్ని ప్రభుత్వాలకు మాత్రమే అందజేసిందని వార్తా సంస్థల అంతర్జాతీయ కన్సార్టియం తెలిపింది. దేశ భద్రతకు సంబంధించిన కేసులు, నేరాలపై పరిశోధనలు జరుపుతున్న క్లయింట్లు మాత్రమే పెగాసస్‌ను ఉపయో గిస్తున్నారని, కాబట్టి తమను బాధ్యులను చేయరాదని ఎన్‌ఎస్‌ఓ కంపెనీ అమెరికా కోర్టులో విచారణ సందర్భంగా వాదించింది. అయితే ఈ వాదనను జడ్జి తోసిపుచ్చారు.
2021లో మీడియా సంస్థలు పరిశోధనలు జరిపినప్పుడు తన వినియోగదారుల జాబితాను బయటపెట్టేందుకు ఎన్‌ఎస్‌ఓ నిరాకరించింది. అయితే పెగాసస్ స్పైవేర్ సాయంతో ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న విషయం విదితమే. మీడియా సంస్థలు బయటపెట్టిన అంశాలపై విచారణ జరపాలని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై ఏర్పడిన సాంకేతిక కమిటీ ఐదు ఫోన్లలో మాల్‌వేర్‌ను గుర్తించింది. అయితే అది పెగాసన్ అవునా కాదా అనేది చెప్పలేదు. పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసి దానిని వినియోగించానా లేదా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించలేదు. అలాగే తోసిపుచ్చనూ లేదు.