– బారికేడ్లతో అడ్డుకున్న అసోం పోలీసులు మండిపడ్డ కాంగ్రెస్ అగ్రనేత
దిస్‌పూర్ : అసోంలోని నాగాన్ సమీపంలో ఉన్న హైబర్‌గాన్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రను సోమవారం రెండు గంటల పాటు నిలిపివేశారు. ప్రార్థనా స్థలమైన బటద్రవ థాన్ వద్దకు వెళ్లేందుకు రాహుల్ ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.ఉదయం భారత్ జోడో న్యారు యాత్రను ప్రారంభించిన రాహుల్ బటద్రవ థాన్ వైపు వెళ్లేందుకు ముందుకు కదిలారు. అయితే ఆ మార్గాన్ని పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఈ ప్రాంతం వైష్ణవ గురువు, సంస్కరణవాది అయిన శ్రీమంత శంకరదేవ జన్మస్థలం. అసోంలోని వైష్ణవులకు ఇది అత్యంత పవిత్ర ప్రదేశం. బారికేడ్లు అడ్డుగా ఉండడంతో రాహుల్ యాత్ర ముం దుకు సాగలేదు. దీంతో ఆయన కార్యకర్తలతో పాటు నేల మీదే కూర్చుని ‘రఘుపతి రాఘవ రాజా రామ్’ అంటూ గీతాలు ఆలపించారు. రెండు గంటల అనంతరం థాన్‌ను సందర్శించేందుకు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోరు, బటద్రవ ఎమ్మెల్యే శిబామొని బోరాను మాత్రం పోలీసులు అనుమతించారు. దీనిపై ఏఐసీసీ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థాన్‌ను సందర్శించాలని రాహుల్ భావించారని, అయితే పోలీసులు ఇద్దరు అసోం నేతలను మాత్రమే అనుమతించారని ఆరోపించారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని వేలాది మంది ప్రజలు బటద్రవ థాన్‌కు వస్తారని, అందుకే రాహుల్‌ను అనుమతించలేమని, అయితే ఆయన సాయంత్రం మూడు గంటల తర్వాత ఈ ప్రాంతానికి రావచ్చని థాన్ యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ఆదివారం స్థానిక ఎమ్మెల్యేకు లేఖ రాశారు. కాగా అయోధ్య కార్యక్రమం పూర్తయిన తర్వాత రాహుల్ థాన్ వెళ్లవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ‘ఇది అయోధ్య – బటద్రవ థాన్ మధ్య పోటీగా మారడం అసోంకు మంచిది కాదు. కాబట్టి అయోధ్యలో మందిర కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన బటద్రవ వెళితే మంచిది. ఆయన ఇక్కడికి వచ్చి పోటీ భావనను కలిగించడం మంచిది కాదు’ అని అన్నారు. కాగా బటద్రవ నుండి గొగోరు, బోరా తిరిగి వచ్చిన తర్వాత యాత్ర ప్రారంభమైంది.
నా ఒక్కడికే శాంతి భద్రతల సమస్యా ? : రాహుల్
యాత్ర తిరిగి ప్రారంభమైన తర్వాత రాహుల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వైష్ణవ గురువు శంకరదేవ సిద్ధాంతాలను తాను విశ్వసిస్తానని ఆయన అన్నారు. ప్రజలను ఏకం చేయాలనే తాను కోరుకుంటాను తప్పించి విద్వేషాలను వ్యాపింపజేయబోనని చెప్పారు. ‘ఆయన మాకు గురువు వంటి వారు. మాకు మార్గనిర్దేశం చేశారు. అస్సాం వచ్చినప్పుడు ఆయన జన్మస్థలాన్ని సందర్శించి ప్రార్థనలు చేయాలని అనుకున్నాను. శంకరదేవ జన్మస్థలానికి రావాల్సిందిగా ఈ నెల 11న నాకు ఆహ్వానం అందింది. అయితే శాంతి భద్రతల పరిస్థితి నెలకొన్నదని మాకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఆ సమస్య ఉండడం ఆశ్చర్యంగా ఉంది. గౌరవ్ గొగోరు, ఇతరులు అక్కడికి వెళ్లవచ్చు. నేను మాత్రం వెళ్లకూడదు. అందుకు కొన్ని కారణాలు ఉండవచ్చు. నాకు తెలీదు. నాకు అవకాశం వచ్చినప్పుడు బటద్రవ వెళతాను. శంకరదేవ చూపిన మార్గాన్ని అస్సాంతో పాటు దేశమంతా అనుసరించాలని కోరుకుంటున్నాను’ అని రాహుల్ తెలిపారు.