ఆయిల్ ఫాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి..

– ఆయిల్ ఫెడ్ ఎం.డి అశోక్ రెడ్డికి వినతి పత్రం అందజేత..
– ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ లోని  అశ్వారావుపేట లో ఆయిల్ పామ్ పరిశోధన,బోధన,రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ హార్టికల్చర్ కమీషనర్, ఆయిల్ఫెడ్ ఎం.డి. అశోక రెడ్డి కి తెలంగాణా ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు వినతి పత్రం అందజేసారు. సోమవారం వారు హైద్రాబాద్ లోని ఆయిల్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో సమావేశం అయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వినతి పత్రం అందజేసారు.
వినతి పత్రంలో తెలిపిన అంశాలు..
తెలంగాణ లో ఆయిల్ పామ్ పంట అన్ని జిల్లాలో వేగంగా విస్తరిస్తుంది.దీనికి అనుబంధంగా పరిశ్రమలు వస్తున్నాయి.భిన్న వాతావరణం,విభిన్న రకాల నేలలు,ప్రధానంగా భూగర్భ జలాలపై ఆధారపడి రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా ఆయిల్ ఫాం పరిశోధనా,బోధనా,రైతు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ లో అనేక రకాల వంగడాలు ఇతర రకాల నేలలు,భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య నాటడం జరిగింది.గెలలు ధర నిర్ణయంలో కీలక పాత్ర పోషించే నూనె శాతం నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాల్సి ఉంది.దీనికి గాను అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఒక టన్ను పామ్ ఆయిల్ గెలలు ప్రాసెసింగ్ చేసి అందులోని నూనె మరియు గింజల శాతాన్ని కచ్చితంగా లెక్కించేందుకు వీలుగా ఉంటుంది.కాబట్టి దాని నిర్మాణానికి చర్యలు తీసుకోగలరు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు 400 ఎకరాల భూమి,నీటి లభ్యత,ఆయిల్ పామ్ కు అనుకూల నేల, నర్సరీలు,పరిశ్రమలు లాంటి అన్ని వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి.
ఆయిల్ పామ్ రైతులకు సాగులో అనేక ఇబ్బందులు  తలెత్తుతున్నాయి.అవి నాణ్యత లేని మొక్కలు, పెరుగుతున్న తెగుళ్లు,పురుగులు,రైతుకి సాగులో సూచనలు చేయుటకు అనుభవం కలిగిన సిబ్బంది కొరత,ఈ పంటలో అత్యంత కీలకమైన గెలలు కోతకు కూలీల కొరత,ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికై దోహదపడుతుంది. సుదీర్ఘకాలం అంటే సుమారు 30 ఏండ్లు పాటు ఉండే ఈ పంట గనుక రైతులకు ఇచ్చే మొక్కల నాణ్యత విషయంలో,వివిధ జిల్లాల్లో భూసార పరీక్షలు జరిపి రైతులకు అవగాహన కల్పించి అందుకు అనుగుణంగా నాణ్యమైన మొక్కలు పంపిణీ చేయాల్సి ఉంది.ఇప్పటికే అధికారుల తప్పిదాల వలన ఆర్భాటంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట విస్తరింప చేయాలని ఆలోచనతో జరిగిన తప్పిదాలను సరి చేయాలని మరియు నాణ్యత లేని మొక్కలు నాటి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము.
ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అన్ని రకాల యంత్ర పరికరాలు సబ్సిడీ లేదా రెంట్ కు రైతుకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా రాయితీలు క్రమంగా 4 సంవత్సరాలు పాటు అందాల్సి ఉంది.కానీ సక్రమంగా రైతులకు అందడం లేదు.దానిని పరిశీలించి అందరికి అందేలా చర్యలు తీసుకోగలరు. ఆయిల్ పామ్ తోటలలో తెల్ల దోమ మరియు గ్యానోడెర్మా తీవ్రంగా నష్ట పరుస్తున్నందున నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఐ.ఓ.పి.ఆర్, హార్టికల్చర్, ఆయిల్ఫెడ్ ఉమ్మడిగా సహాయక చర్యలు తీసుకోవాలి. ఆయిల్ పామ్ పరిశ్రమలో సి.పి.వో & గింజలలో ఇస్తున్న వాటా తో పాటు స్లెడ్జ్ (పామ్ కేక్)లో కూడా ఫ్యాక్టరీలు కు ఆదాయం వస్తున్నందువలన దానిలో కూడా రైతుకి న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలి. సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తానికి చెందిన ఆయిల్ పామ్ పరిశోధన క్షేత్రం (ఐ.ఓ.పి.ఆర్.) వారి సేవలు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాము. కేంద్రం ప్రభుత్వం ఆయిల్ పామ్ దిగుమతులపై దిగుమతి పన్ను పూర్తిగా తగ్గించడంతో 50 శాతం పైగా ధర పడిపోయిన నేపథ్యంలో తమరు జోక్యం చేసుకొని,ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అనంతరం ఆయిల్ ఫెడ్  ఎం.డీ సానుకూలంగా స్పందిస్తూ వీరికి  హామీ ఇచ్చారు.ఈ వినతి పత్రం లో ఉన్న అంశాలు నా దృష్టి లో ఉన్నాయి. ఇప్పటి నుండి నర్సరీ లను హార్టికల్చర్ & టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారికే పర్యవేక్షణ బాధ్యతలను ఇస్తాం.ప్రతి వారం రిపోర్టు & రివ్యూ చేస్తాము. ఇప్పటికే ఆఫ్ టైప్ ప్లాంట్స్ గమనిస్తే ఆ రైతుకు పూర్తి ఉచితంగా కొత్త మొక్కలు అందజేయమని ఆదేశాలు జారీ చేసాము అని చెప్పారు. రైతు భరోసా,ఋణ మాఫీ, భీమా ఇలా ఈ రెండు నెలల్లో రైతులకు రూ. 50 వేల కోట్ల రూపాయలు లబ్ధి కి ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది అని ఈ ఆయిల్ పామ్ సబ్సిడీ పై కూడా త్వరలోనే బడ్జెట్ కేటాయింపు అవుతుంది అని అయిన వెంటనే రిలీజ్ చేస్తాము అని చెప్పారు.