పూర్తిగ వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాల్య చాపల్యం కూడా వుంటది. వయసు మీదపడి మంచానికి పరిమితమైన తర్వాత బాలుని లెక్క మాటలు కన్పిస్తయి. అయితే పూర్తిగ వృద్ధుడు కాకముందే గమ్మతి గమ్మతి చిన్న పోరగాండ్ల లెక్క కొందరు చేస్తుంటరు. అటువంటప్పుడు ‘పిల్లలు లేని ఇంట్ల ముసలోడు అంబాడిండట’ అనే సామెత వాడుతరు. చిన్న పిల్లలు ఉంటే ఇల్లంత అంబాడుతరు. అట్లనే చేస్తున్నడని కొంత నిరసనగా అంటుంటారు. పాత తరానికి కొత్త తరానికి ఆలోచనల్లో వ్యత్యాసం వుంటది. ప్రతిది పెద్ద మనుషులు వాల్ల కాలం దృష్టితోనే ఆలోచిస్తరు. దానినే పిల్లల మీద రుద్దుతరు. కాని ఎవరి స్వేచ్ఛను వారికె ఇవ్వాలి. అన్నీ నాకే తెలుసు అనే ప్రవర్తనలో ఇండ్లడ్ల మనుషుల మధ్య గ్యాప్‌లు ఏర్పడతయి. అడగని సలహా ఏదీ చెప్పరాదు, కాని వృద్ధులు అడుగకపోయినా ఇట్ల చెయ్యి అట్ల చెయ్యి అని ఆదేశాలు ఇస్తుంటరు. అప్పుడే వాల్లు పలుచన అయిపోతరు. ఇందుకు కూడా ‘పిలిచి పిల్లనిస్తే కులం ల్యాత అన్నడట’ అనే సామెత ఉండనే ఉన్నది. అమ్మాయిని పెండ్లి చేసికోమని కోరితే అబ్బో నన్ను ఎందుకు అడుగుతున్నరు, వాల్ల కులం మా కులం కన్నా తక్కువ వున్నట్టు వున్నది అనుకున్నారట. నేను వరకట్నం తీసుకోను ఆదర్శంగా వుంటాను అంటే ఏదైనా డిఫెక్ట్ వున్నదా అని అనుమానించి చూసే కాలం కూడా చూసే వున్నాం. అందుకే ‘తొందరపడి ముందే కూయొద్దు’. అప్పుడు ఏమైతది అంటే ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు’ అయితది అంటరు. నిజానికి ప్రసవం దగ్గరికి వస్తుందంటే ఇంటింటికీ అన్నీ సిద్ధం చేసుకోవల్సిందే గాని తొందరగా కుల్ల అంటే సంటిపిల్లలకు నెత్తికి కట్టేది తయారు చేసికుంటరు. సామెతల్లో కొన్ని అశాస్త్రీయంగానూ వుంటాయి. ఆయా సమయాల్లో చలామణిలో వున్న అభిప్రాయాల నుంచి పుట్టినవి ఇవి.
‘పిల్ల ముద్దు లేకున్నా పిలుపు అన్న ముద్దు వుండాలె’ అంటరు. మనిషి కన్నా మాట సౌందర్యంగా వుండాలి అనే అర్ధంలో వాడతరు. ఇక్కడ పిల్ల అంటే చిన్న పిల్ల లేదా బాలిక అనే అర్ధం. పిల్ల అంటే యువతిని పెళ్లి అయిన స్త్రీని కూడా పిల్ల అని పిలుస్తరు. ఈ పిల్ల సౌందర్యం కన్నా పిలుపు అంటే వరుసలు పెట్టి పిలవడం అన్నా బాగుండాలి అనే అర్ధంలో వాడుతరు.
– అన్నవరం దేవేందర్, 9440763479