బాక్సింగ్ ఆటగాళ్ళు రింగ్‌లో పోటీ పడేటప్పుడు వారికి సాధారణంగా అయ్యే గాయాలు, శరీరంపై చీరిన చర్మానికి అప్పటికప్పుడు వైద్యం చెసే వ్యక్తిని కట్మాన్ అంటారు. అలాంటి ఓ కట్మాన్ జెర్రి బార్డు. రింగ్‌తో తన అనుభవాల నేపధ్యంలో రోప్ బర్న్స్ స్టోరీస్ ఫ్రం ది కార్ణర్ అనే పేరుతో ఈయన 2000లో ఒక చిన్న కథా సంకలనం తీసుకొచ్చారు. తన అసలు పేరుతో కాకుండా ఎఫ్. ఎక్స్. టూల్ అనే పేరుతో ఆయన ఈ కథలను రాశారు. అందులోని ఓ కథ ‘మిలియన్ వివివి బేబి’. ఈయన రాసిన చాలా కథలు ప్రచురణకర్తలు వెనక్కు తిప్పి పంపేస్తున్న సందర్భంలో ఈ కథ హావార్డ్ జంకర్ అనే సంపాదకుని వద్దకు చేరి ప్రచురించబడింది. అది మెల్లిగా హాలీవుడ్ చేరి ఇలా మిలియన్ డాలర్ బేబి చిత్రంగా ముస్తాబయి, న్యూయార్క్ టైమ్స్ 2017 లో 21 శతాబ్ది గొప్ప చిత్రాల లిస్ట్‌లో మూడవ స్థానంలో నిల్చింది. అంతే కాకుండా ఇది ఉత్తమ చిత్రంతో పాటు మరో మూడు ఆస్కార్ అవార్డులు సాధించింది.
ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్రలు కూడా ఏ మాత్రం గ్లామర్ లేనివే. మాగీ ఓ చిన్న హోటల్ లో పని చేసే ఓ వేయట్రెస్. ఆమెకు బాక్సర్ అవ్వాలని కోరిక. ఫ్రాంకీ డన్ ఐరిష్ నేపధ్యం ఉన్న అమెరికన్ బాక్సింగ్ శిక్షకుడు. ఇతను ఆ ప్రాంతంలో ఓ జిమ్ నడుపుతుంటాడు. ఇతనికి ఓ కూతురు, కాని ఆమెతో సరయిన సంబంధం ఉండదు. కూతురుని కలవాలనే కోరికతో డన్ ఆమెకు రాసే ఉత్తరాలకు ఆమె ఎటువంటి జవాబూ ఇవ్వదు. ఫ్రాంకీని తనకు బాక్సింగ్ నేర్పించమని అడుగుతుంది మాగీ. కాని ఇది స్త్రీల ఆట కాదని, ఆమెకు తాను శిక్షణ ఇవ్వనంటాడు ప్రాంకీ. పైగా మాగీ వయసు పెద్దదని, ఆ వయసులో ఆటలో ఓనమాలు దిద్దుకోవడం కష్టం అని, అది కుదరని పని అని, ఆమెను ఆ ప్రయత్నం మానుకొమ్మని చెబుతాడు ఫ్రాంకీ. కాని తన ప్రయత్నం మానదు ఆమె. ఒంటరిగా ఆమె ఆ జిమ్‌లో తనకు తెలిసిన విధంగా బాక్సింగ్ కోసం సొంతంగా తయారవుతూ ఉంటుంది. ఆమెలోని పట్టుదలను మొదట గమనిస్తాడు ఎడ్డి. ఇతను ఫ్రాంకి స్నేహితుడు, ఆ జిమ్ లో పని చేస్తూ ఉంటాడు. తనకు తెలిసిన మెళకువలను మాగీకి చెప్పి తన వంతుగా ఆమెకు కొన్ని పరికరాలను ఇచ్చి సాధన చేసుకొమ్మని ఆమెని ప్రోత్సహిస్తాడు.
తాను సంపాదించే తక్కువ డబ్బులోనే మిగిల్చుకుని మాగీ అవసరమైన పరికరాలను కొనుక్కుని అదే జిమ్‌లో సొంతంగా సాధన చేసుకుంటూ ఉంటుంది. ఈ సమయంలోనే ఫ్రాంకీ శిష్యరికంలో పేరు తెచ్చుకున్న విలీ, అతన్ని వదిలి డబ్బు, పేరు కోసం మరో చోటకు వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మాగీలోని పట్టుదలకు తల వంచి ఇష్టంలేకుండానే ఆమెకు శిక్షణ ఇవ్వడం మొదలుపెడతాడు ఫ్రాంకీ.
కొన్ని చిన్న పోటీలకు సిద్దమయి, పాల్గొని గెలవడం మొదలెడుతుంది మాగీ. ఆమెతో పోటీపడే వాళ్లు రెండవ స్థాయి ఆటగాళ్ళే ఉండాలని మేనేజర్లకు లంచం ఇచ్చి అలాగే పోటీలను సాగేలా చూస్తాడు ఫ్రాంకీ. పైగా అసలైన పోటీలకు ఆమె వెళ్లకుండా వచ్చే అవకాశాలను కాదంటాడు. అప్పటికే అందరికన్నా వయసులో పెద్దదైన మాగీకి ఇలా అయితే బాక్సింగ్ కెరియర్‌లో ఆమెకు పెద్దగా పేరు, డబ్బు సంపాదించవని తెలిసి… ఫ్రాంకీ మొండితనం ఇంకా బాగా తెలిసిన ఎడ్డి ఆమెను మరో మేనేజర్ దగ్గర చేర్చాలని ప్రయత్నిస్తాడు. ఆమెకు ఆ అవకాశం కూడా కల్పిస్తాడు. కాని తాను ఫ్రాంకీని వదలనని ఆ అవకాశాన్ని కాదంటుంది మాగీ.
చిన్న పోటీలలో తన ప్రతిభ ప్రదర్శిస్తూ ఎదుగుతుంది మాగీ. ఆమె బాక్సింగ్ దుస్తులపై తన మాతభాష గాలిక్‌లో వాక్యం ముద్రించి ఆమెకు వాటిని బహుకరిస్తాడు ఫ్రాంకీ. దాని అర్ధం మాత్రం ఆమెకు చెప్పడు. మాగీ తాను సంపాదించినది తన కోసం ఖర్చుపెట్టదు. ప్రతి పైసా అతి జాగ్రత్తగా కూడబెడుతూ తన తల్లి కోసం ఓ ఇల్లు కొంటుంది. ఫ్రాంకీతో తన ఇంటికి వెళ్లి తల్లికి ఆ ఇల్లు చూపిస్తుంది. కాని ఆమె తల్లి తనకు డబ్బు ఇవ్వకుండా ఇలా ఇల్లు కొన్నిస్తే ప్రతి నెల వచ్చే ప్రభుత్వ ఆదాయం పోతుందని కూతురు కష్టం తెలుసుకోకుండా ఆమెను అవమానిస్తుంది. ప్రభుత్వం పని లేనివారికిచ్చే డబ్బుతో పని చేయకుండా కుర్చుని తినడం అలవాటయిన ఆమె కూతురు చేసిన త్యాగాన్ని అర్ధం చేసుకునే సంస్కారం ఉన్న స్త్రీ కాదు. ఆమె మాటలతో మాగీ మనసు విరిగిపోతుంది. ఆమె బాధ ఫ్రాంకీకి అర్ధమవుతుంది. ఇద్దరూ తిరిగి తమ బాక్సింగ్ ప్రపంచంలోకి వస్తారు. మాగీకి పెద్ద పోటీలో పాల్గొనడానికి అనుమతి ఇస్తాడు. అందులో గెలిస్తే ఆమెకు పేరుతో పాటు మిలియన్ డాలర్ల బహుమతి లభిస్తుంది. అయితే ఈ పోటీలో ఆమె ప్రత్యర్ధి కరడు కట్టిన బిలి అనే జర్మన్ స్త్రీ. పోటీలో గెలుపు దశలో ఉన్న మాగీని ఆమె నియమాలకు విరుద్ధంగా కొట్టడంతో మాగీ తీవ్రంగా గాయపడుతుంది. ఆమె గొంతు భాగం విరిగి వెంటిలేటర్‌కు పరిమితం అవుతుంది.
ఆమె ఇక ఎప్పటికీ మంచం వదలలేదన్న నిజాన్ని ఫ్రాంకీ జీర్ణించుకోలేకపోతాడు. ఎందరో డాక్టర్లను సంప్రదిస్తాడు. ఎడ్డి ఈ స్థితికి కారణం అని, అతను ప్రోత్సహించకపోతే మాగీ ఈ స్థితిలో ఉండదని ఆతనితో గొడవ పడతాడు. చివరకు దేవుడితో బేరం ఆడతాడు. అతని స్థితి అర్ధం చేసుకున్న ఎడ్డి తోడుగా నిలబడతాడు. మాగీ హాస్పీటల్‌లో ఉండి తన వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె కుటుంబం అంతా తల్లితో పాటు ఆ ఊరు వస్తారు. కాని ముందుగా ఆసుపత్రికి రారు. ఊరంతా తిరిగి డిస్నీలాండ్‌లో ఆటలాడి ఆ తరువాత ఆసుపత్రి చేరిన వారిని నిర్వికారంగా చూస్తుంది మాగీ. ఆమె ఆస్తిని తన పేరున మార్చమని, కాగితాలపై సంతకం కోసం మాగిని అడుతుంది తల్లి. వారిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని, బలవంతపెడితే వాళ్ళంతా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిన విషయాన్ని బైటపెడతానని వారిని బెదిరించి పంపేస్తుంది మాగీ.
మంచంపైనే ఉండడంతో బెడ్ సోర్స్ వచ్చి మాగీ కాలు తీసివేయవలసి వస్తుంది. తన జీవితంలో తాను అనుకున్నది సాధించానని ఇక తాను చనిపోవాలనుకుంటున్నానని దానికి సహాయపడమని ఫ్రాంకీని మాగీ అడుగుతుంది. ఫ్రాంకీ దానికి ఒప్పుకోడు. ఓ రాత్రి తన నాలిక కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది మాగీ. ఫ్రాంకీ మాగీలో తన కూతురిని చూసుకుంటున్నాడని, ఆమె కోసం అతను ఎంత బాధపడుతున్నాడో తెలిసిన చర్చ్ ఫాదర్ ఈ పని తప్పని, ఫ్రాంకీ మాగీ అభ్యర్ధనను ఒప్పుకుంటే అది పాపం అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా ఫ్రాంకీ ఓ రాత్రి మాడా గదిలోకి వెళ్లి ఆమె చూస్తుండగానే ఆమెకు చనిపోవడానికి ఇంజక్షన్ చేస్తాడు. కళ్లు మూసుకుపోతున్న మాగీతో ఆమె బాక్సింగ్ దుస్తులపై తాను రాసిన వాక్యం అర్ధం ”నా బిడ్డ నా రక్తం” అని వివరిస్తాడు. మత్తులోకి కూరుకుపోతున్న మాగీ, తాను ఎవరూ లేని అనాధను కాదని, ఇన్నాళ్లు తనకో తండ్రి ఉన్నాడని, అతనే తనను అన్ని కష్టాలనుండి రక్షించాడని తెలుసుకుని తప్తిగా పెదవులపై చిరునవ్వుతో మరణిస్తుంది. కాని వారిద్దరికీ తెలియనిది దీన్ని ఎడ్డి బైట చీకటిలో నిలబడి చూస్తున్నాడని.
ఆ రోజు తరువాత ఫ్రాంకీ ఇక ఎవరికీ కనిపించలేదు. ఎడ్డి ఫ్రాంకీ కూతురికి ఆమె తండ్రి హదయం, అతనిలోని ప్రేమను వివరిస్తూ ఓ ఉత్తరం రాస్తుండగా చిత్రం ముగుస్తుంది.
ఫ్రాంకీగా క్లింట్ ఈస్ట్ వుడ్ నటన అమోఘం. ఈ సినిమాకు ఆయనే దర్శకులు, నిర్మాత కూడా. నేపద్య సంగీతాన్ని అందించింది కూడా ఈయనే. ఉత్తమ దర్శకుడిగా మరో ఆస్కార్‌ను ఈ చిత్రంతో అందుకున్నారు ఆయన. 74 ఏళ్ల వయసులో ఈ బహుమతి అందుకుని అంత పెద్ద వయసులో ఆస్కార్ అందుకున్న దర్శకుడిగా చరిత్ర సష్టించారు. పైగా ఉత్తమ నటుడి కేటగిరీలో నామినేషన్ కూడా పొందారు. మాగీగా నటించిన హిలరీ స్వాంక్ తన అసాధారణ నటనతో ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుంటే, ఎడ్డి పాత్రకు మార్గన్ ఫ్రీమాన్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ పొందారు. ఎక్కువ సంభాషణలు లేకుండా కేవలం హావ భావాల్తో ఈ సినిమాలో మూడవ ప్రధాన పాత్రగా మార్గన్ ఫ్రీమాన్ నటనా స్థాయి గురించి ఎంత చెప్పినా తక్కవే.
స్త్రీ క్రీడాకారుల పాత్రలో నటించి ఆస్కార్ పొందిన మొదటి నటి హిల్లరీ స్వాంక్. ఈ కథలో ఆమె మొదటి నుంచి ప్రదర్శించిన మొండితనం, ఆమెలోని ఆ పట్టుదల మరణం దాకా అదే రీతిలో నిలబడి ఉండడం. ఎవరి మాటా వినని ఫ్రాంకీ ప్రతిసారీ మాగీ పట్టుదల ముందు తల వంచడం, ఆమెకు వద్దనుకుంటూనే ఆట నేర్పించడం, వద్దనుకుంటూనే ప్రధమ స్థాయి పోటీలలోకి ఆమెను దించడం, చివరకు వద్దనుకుంటూనే ఆమె మరణానికి సహాయపడడం కథనంలో చూస్తున్నప్పుడు పిల్లల ఇష్టాలను ప్రేమతో వద్దనుకుంటూ తలవంచే అసహాయ ప్రేమ ఫ్రాంకీ పాత్రలో కనిపిస్తుంది. డెబ్బైలలో ఉన్న ఓ ముదుసలిలోని ఆ ప్రేమ, బిడ్డపై అతనికున్న వాత్సల్యం, ఆమె కోరికలకు తలవంచక తప్పని అసహాయత్వాన్ని క్లింట్ ఈస్ట్వుడ్ తన నటనలో చూపించిన విధానం భాష రాని వారిని సైతం కన్నీరు పెట్టిస్తుంది.
ఈ సినిమా కోసం హిల్లరీ స్వాంక్ పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇరవై పౌండ్ల బరువు పెరిగి రోజుకు ఐదు గంటలు జిమ్ లో బాక్సింగ్ నేర్చుకుని, కాలికి ఇన్ఫెక్షన్ అయినా అది దర్శకుడికి చెప్పకుండా మాగీ పాత్రలో అది ఓ భాగం అని పూర్తిగా ఆ పాత్ర స్వభావంలోకి ఒదిగిపోయి గొప్పగా నటించారామె. ఆమెకు ఆస్కార్ రాకపోతే తప్పేమో అన్నంత ఉత్తమ స్థాయిలో ఉంటుంది ఆమె ప్రదర్శన.
ఉత్తమ చిత్రాల ప్రతి లిస్ట్‌లో తప్పకుండా ఉండే సినిమా ఇది. ఈ సినిమా స్పూర్తితో ఆ తర్వాత స్త్రీలకు సంబంధించి ఎన్నో క్రీడా ప్రధాన చిత్రాలు ఎన్నో భాషల్లో వచ్చాయి. అయినా ప్రతి గొప్ప సినిమాకు ఉన్నట్లే దీని చుట్టూ కొన్ని వివాదాలు రేగాయి. సినిమా ముగింపు వికలాంగులకు సంబంధించి పని చేస్తున్న కొన్ని సంస్థలకు, కార్యకర్తలకు నచ్చలేదు. ఇది చాలామందికి తప్పు సందేశాన్ని ఇస్తుందని వారు వాదించారు.
ఏమైనా కథా పరంగా కథనం పరంగా ఎటువంటి తప్పూ ఎంచలేని ఉత్తమ దర్శకత్వంతో ఈ చిత్రం చాలా మందికి చేరువ అయింది. క్లింట్ ఈస్టవుడ్ నటించి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో ఇది ఉత్తమ చిత్రమని విమర్శకుల మెప్పు పొందింది. ఆస్కార్ ఉత్తమ చిత్రాలన్నీ వరుసలో నిలబెడితే చాలామంది తమకు ఎక్కువగా నచ్చిన చిత్రం ఇదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి సాధారణ ప్రేక్షకులుగా ఈ సినిమా చూస్తే అది మన మనసును ఎటువంటి స్పందనలకు గురి చేస్తుందో అనుభవించిన వారు ఈ సినిమాలోని పాత్రలను ప్రేమించకుండా ఉండలేరు.
ఇద్దరు ముసలివాళ్ళు ఓ బక్క పలచని అతి సాధారణ యువతి నడుమ నడిచే కథ ఎవరిని ఆకట్టుకోగలదు అని ఈ కథను కొన్ని సంవత్సరాలు సినిమాగా పనికి రాదని తేల్చి పక్కనపడేసిన వారందరూ ఆశ్చర్యపోయే విధంగా తయారయిన చిత్రం ఇది. కాని ఈ విజయాన్ని రచయిత జెర్రి బాయిడ్ ఆస్వాదించలేకపోయారు. కొన్ని ఏళ్ళు మూల పడిన తన కథను క్లింట్ ఈస్ట్వుడ్ దర్శకత్వం వహిస్తున్నారని తెలుసుకున్న నెలరోజులలోపే ఆయన మరణించారు. కాని ఆయన రాసిన ఈ కథ తరువాత ఎందరికో స్ఫూరిదాయకంగా నిలిచిపోయింది.
– పి.జ్యోతి,
98853 84740