
నవతెలంగాణ -ముధోల్ : బాసర ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ అవినీతి, అక్రమాలపై ముధోల్ ప్రాంతానికి చెందిన ఓయు విద్యార్థి నాయకుడు సర్థార్ వినోద్ కుమార్ గళమెత్తారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ట్రిపుల్ ఐటీ వీసీ పాల్పడ్డ అవినీతి, అక్రమాలపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన నవతెలంగాణతో పోన్ లో మాట్లాడారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -2 గా , బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జిగా విసిగా కొనసాగుతూ అనేక అవినీతి , అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. కనీస సీనియర్ ప్రొఫెసర్ అర్హత లేని వెంకటరమణను తన జోడు పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీని పరిరక్షించాలని కోరారు. అలాగే బాసర ట్రిపుల్ ఐటీ లో తనకు నచ్చిన వాళ్లకు అందాలo ఎక్కిస్తూ, నచ్చని వారికి, తనకు లొంగని వారికి లైంగిక వైదింపులకు గురిచేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన అక్రమాలకు అడ్డు అదుపు లేని వెంకటరమణ నేడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది ఉన్నత విద్యాశాఖ ముఖ్య అధికారులతో పాత సంబంధాలను నేర్పుతూ తన అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్న తీరు దారుణం అన్నారు .ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం సరికాదని పేర్కొన్నారు. పదేళ్లుగా ఏనాడు పాఠం చెప్పని వెంకటరమణ పైరవీలతో పదవులు తెచ్చుకుంటూ ఉన్నత విద్యా మండలి లో ఏళ్లుగా, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి గా గత రెండున్నరేళ్లుగా కొనసాగుతూ అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు.అలాగే చేయని పనులకు నకిలీ బిల్లులు సృష్టించి, మెస్ కాంట్రాక్టర్ల గడువు ముగిసిన కూడా అదే కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నాడని అన్నారు . లక్షల జీతం తీసుకుంటూ ట్రిపుల్ ఐటీ లో అలవెన్సుల, పేరుతో లక్షలు క్లెయిమ్ చేస్తూన్నడని ఆరోపించారు .అవసరం లేకున్నా కొత్త కార్లు కొంటూ ,తన ఇంటి అవసరాలకు వాడుకుంటున్నడని ఆయన ఆరోపించారు. పేద విద్యార్థులకు చెందాల్సిన యూనివర్సిటీ డబ్బులను ఆయన వ్యక్తిగతానికి వాడుకుంటూ యూనివర్సిటీ ప్రతిష్టను మంటగలుపుతున్నడని విమర్శించారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.లేని యెడల విధ్యార్థి పోరాటం ను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.