ప్రభుత్వ ఆస్పత్రి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆత్మహత్య

– నా చావుకు ఎస్‌ఐ, సూపరింటెండెంటే కారణం
– వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియో
– విచారణ చేపట్టిన ఇబ్రహీంపట్నం పోలీసులు
– గతంలోనే మృతుడిపై పలు కేసులు
– పలు కారణాలతో విధుల్లో నుంచి తొలగించిన వైనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తన చావుకు ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ మైబెల్లి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ రఘునాథే కారణమని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారి వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌ రాసి, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని నరసింహస్వామి ఆలయం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం విచారణ చేపట్టినట్టు ఏసీపీ పీవీ రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటనపై ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు అసిస్టెంట్‌గా అతని కుమారుడు జయంత్‌ను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. అయితే ఆస్పత్రిలో అతని ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల గత నెల 29వ తేదీన విధుల్లో నుంచి తొలగించారు. దాంతో మనస్తాపానికి గురైన జయంత్‌ పలుమార్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రఘునాథ్‌తో ఘర్షణకు దిగారు. అప్పటికే మృతునిపై రఘునాథ్‌ గతంలోనే ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు నేపథ్యంలో మరింత మనస్తాపానికి గురైన జయంత్‌.. అతనూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రఘునాథ్‌పై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు.
అయితే ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ మైబెల్లి అతని ఫిర్యాదును స్వీకరించలేదు. పోలీసులు సైతం రఘునాథ్‌ వైపే నిలిచారని ఆరోపిస్తూ మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని నరసింహస్వామి ఆలయం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ముందు వీడియో తీస్తూ ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ మైబెల్లి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రఘునాథ్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోటు రాశారు. దాంతో మృతుని తల్లి విజయలక్ష్మి తన కుమారుని చావుకు ఎస్‌ఐ మైబెల్లితో పాటు రఘునాథ్‌ కారణమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఏసీపీ తెలిపారు.