రెండున్నరేండ్లుగా మణిపూర్ సమస్యను పరిష్కరించటంలో, కనీసం శాంతి భద్రతల పరిరక్షణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. దేశ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించే సమయం ఉంటుంది గానీ, గిరిజన బాధితులను పరామర్శించే సమయం లేకపోవడం విచారకరం. ఈ సమస్యపై ఆయన మౌనం, ప్రవర్తన ఉద్ధేశపూర్వకమైనది. ఈ సమస్యను పరిష్కరించకపోవడంలో మణిపూర్ ముఖ్యమంత్రి వందశాతం తన అసమర్ధతను రుజువు చేసుకున్నాడు. కేంద్ర హోంమంత్రి పర్యటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటానికి బదులు మరింత హీనంగా దిగజారాయి. గృహ దహనాలు, హత్యలు, మహిళలపై లైంగికదాడులు మొత్తం పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై చర్చించటానికి, అధికార పక్షం, ప్రతిపక్షం విడివిడిగానూ, కలిసి కూడా మూడుసార్లు ప్రయత్నం చేసినా వివిధ కారణాలు చెప్పి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మోడీ. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలపై కక్షపూరిత, వివక్షతా పూర్వక దృక్పథమే ఈ దుశ్చర్యలకు కారణం. పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పారా మిలటరీ దళాలు ఈ బీభత్సాన్ని చేష్టలుడిగి కండ్లప్పగించి చోద్యం చూస్తున్నాయి. అందుకే బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి కూడా ఇష్టపడటం లేదు. మీడియాను అనుమతించకుండా, ఇంటర్నెట్ బంద్ చేసి ఈ అల్లరి మూకలు చేసే నేరాలకు స్వయంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. ఈ సంఘటనలపై జుడీషియల్ ఎంక్వైరీ జరిపిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి. మన మీడియాలో చాలా సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వ సమర్థకుల (కార్పొరేట్ శక్తులకు) అమ్ముడు పోయాయి. మరికొన్ని నిర్భంధాలకు, వేధింపులు, బెధిరింపులకు లొంగిపోయాయి. మన దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మన మీడియా కండ్లు మూసుకున్నా విదేశీ మీడియా ”గోద్రా అల్లర్లను, మానవ, మారణహోమాన్ని” బీబీసీ వెలుగులోకి తెచ్చినట్లు ఎవరో ఒకరు మోడీ పాలన తర్వాత నిజాలు వెలుగులోకి తీసుకురాకుండా ఉండదు. మణిపూర్ దురాగతాలపై భవిష్యత్తులో ఎన్ని సినిమాలు రానున్నాయో ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే చరిత్ర పుస్తకాల్లో సిలబస్ మార్చారు. కానీ భారత ప్రజల గుండెల్లో అయిన గాయాలను, చేదు జ్ఞాపకాలను మార్చలేరు.
– డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్, 9849328496