చరిత్ర ఎరుగని ఓటమి

– సొంతగడ్డపై తొలిసారి 0-3తో వైట్‌వాష్‌
– 25 పరుగులతో వాంఖడెలో కివీస్‌ గెలుపు
– ఛేదనలో రిషబ్‌ పంత్‌ పోరాటం వృథా
– 3-0తో టెస్టు సిరీస్‌ న్యూజిలాండ్‌ వశం
సొంతగడ్డపై చరిత్ర ఎరుగని ఓటమి. 12 ఏండ్లుగా స్వదేశంలో ఎదురులేని సిరీస్‌ విజయాల జోరుకు బ్రేక్‌ పడగా.. సొంతగడ్డపై టెస్టు క్రికెట్‌ చరిత్ర ఎరుగని రీతిలో భారత్‌ వైట్‌వాష్‌ ఓటమిని మూటగట్టుకుంది. 0-3తో న్యూజిలాండ్‌కు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో స్వదేశంలో భారత్‌ అన్నింటా ఓటమి చవిచూడటం ఇదే ప్రథమం.
147 పరుగుల ఛేదనలో భారత్‌ చతికిల పడింది. స్పిన్‌ ఆడేందుకు మన బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. తిరిగే బంతిని ఎదుర్కొనేందుకు విలవిల్లాడారు. బ్యాటింగ్‌ లైనప్‌ సమిష్టిగా విఫలమైనా రిషబ్‌ పంత్‌ (64) ఒంటరి పోరాటం చేశాడు. 25 పరుగుల తేడాతో భారత్‌ మూడో టెస్టులో ఓటమి చవిచూసింది.
న్యూజిలాండ్‌ అద్భుతం చేసింది. 36 ఏండ్లలో తొలిసారి భారత గడ్డపై టెస్టు విజయంతో బెంగళూర్‌లో సంబురాలకు తెరదీసిన న్యూజిలాండ్‌.. పుణెలో చారిత్రక టెస్టు సిరీస్‌ విజయం అందుకుంది. ముంబయిలో భారత్‌ను సొంతగడ్డపై క్లీన్‌స్వీప్‌ చేసి ఖతర్నాక్‌ షో చూపించింది
నవతెలంగాణ-ముంబయి
వాంఖడెలో స్పిన్‌ మాయకు టీమ్‌ ఇండియా విలవిల్లాడింది. న్యూజిలాండ్‌ స్పిన్నర్లు అజాజ్‌ పటేల్‌ (6/63), గ్లెన్‌ ఫిలిప్స్‌ (3/42) మ్యాజిక్‌ ముందు భారత బ్యాటర్లు మోకరిల్లారు. 147 పరుగుల సవాల్‌తో కూడిన ఛేదనలో రిషబ్‌ పంత్‌ (64, 57 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మరో బ్యాటర్‌ రాణించలేదు. అర్థ సెంచరీతో పోరాటం చేసిన రిషబ్‌ పంత్‌ భారత్‌ను 29/5 నుంచి 106/6 వరకు తీసుకెళ్లాడు. స్పెషలిస్ట్‌ బ్యాటర్లలో ఎవరూ పంత్‌కు అండగా నిలువలేదు. విరాట్‌ కోహ్లి (1), శుభ్‌మన్‌ గిల్‌ (1), సర్ఫరాజ్‌ ఖాన్‌ (1), యశస్వి జైస్వాల్‌ (5), రోహిత్‌ శర్మ (11), రవీంద్ర జడేజా (6) తేలిపోయారు. 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ ఇండియా.. 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూర్‌, పుణె టెస్టుల్లోనూ ఓటమి చెందిన భారత్‌.. ముంబయిలో పరాజయంతో స్వదేశంలో తొలిసారి 0-3తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన అజాజ్‌ పటేల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 244 పరుగులతో నిలకడగా రాణించిన విల్‌ యంగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును దక్కించుకున్నాడు. 3-0తో టెస్టు సిరీస్‌ ట్రోఫీని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ అందుకున్నాడు.
టాప్‌ ఆర్డర్‌ విలవిల
147 పరుగుల ఛేదనలో భారత బ్యాటింగ్‌ లైనప్‌ చేతులెత్తేసింది. బెంగళూర్‌, పుణె ప్రదర్శనను వాంఖడెలో పునరావృతం చేసింది. ఈసారి యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ సైతం ఆకట్టుకోలేదు. జైస్వాల్‌ (5), రోహిత్‌ శర్మ (11), శుభ్‌మన్‌ గిల్‌ (1), విరాట్‌ కోహ్లి (1), సర్ఫరాజ్‌ ఖాన్‌ (1), రవీంద్ర జడేజా (6) దారుణంగా విఫలమయ్యారు. స్పిన్‌ పిచ్‌పై రోహిత్‌ శర్మ విచిత్రంగా పేసర్‌ మాట్‌ హెన్రికి వికెట్‌ కోల్పోగా.. ఫిలిప్స్‌ ఓవర్లో యశస్వి నిష్క్రమించాడు. గిల్‌, కోహ్లి, సర్ఫరాజ్‌, జడేజాలు అజాజ్‌ పటేల్‌ మాయలో పడ్డారు. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో పంత్‌ మినహా ఇతర బ్యాటర్లు కలిసి 25 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ టెయిలెండర్లు 28 పరుగులు చేయటం గమనార్హం. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత్‌ 30 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించింది.
పంత్‌ పోరాటం వృథా
ఛేదన మొదలై పట్టుమని పది ఓవర్లు కూడా కాలేదు. 7.1 ఓవర్లలోనే 29 పరుగులకే ఐదు వికెట్లు. ఇదీ టీమ్‌ ఇండియా దీన స్థితి. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ (64) అదిరే ప్రదర్శన చేశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 బంతుల్లోనే ధనాధన్‌ అర్థ సెంచరీ బాదాడు. పంత్‌కు బంతులు వేసేందుకు అజాజ్‌ పటేల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తడబాటుకు గురయ్యారు. విలక్షణ షాట్లకు తోడు స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌లతో దండెత్తిన రిషబ్‌ పంత్‌ న్యూజిలాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ టెస్టులో అజాజ్‌ పటేల్‌ ఇతర బ్యాటర్లకు 167 బంతుల్లో 112 పరుగులకు 9 వికెట్లు పడగొట్టగా.. పంత్‌కు సంధించిన 41 బంతుల్లోనే 75 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా (6) జతగా వికెట్ల పతనాన్ని నిలువరించిన పంత్‌.. లంచ్‌ విరామ సమయానికి సుందర్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. విరామం కివీస్‌కు కలిసొచ్చింది. లంచ్‌ తర్వాత సైతం బౌండరీల మోత మోగించిన పంత్‌ను కివీస్‌ డిఆర్‌ఎస్‌ సమీక్షలతో వెంటాడింది. డిఆర్‌ఎస్‌లో పంత్‌ నిష్క్రమణతో భారత్‌ పోరాటానికి సైతం తెరపడింది. చివరి మూడు వికెట్లను భారత్‌ సున్నా పరుగులకే చేజార్చుకుంది. అశ్విన్‌ (8), సుందర్‌ (12) ఒత్తిడిలో చిత్తయ్యారు.
జడేజాకు ఐదు వికెట్లు
అంతకుముందు, ఓవర్‌నైట్‌ స్కోరు 171/9తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌ ఎంతో సేపు నిలువలేదు. అజాజ్‌ పటేల్‌ (8, 23 బంతుల్లో 1 ఫోర్‌), విలియం ఓరౌర్క్‌ (2 నాటౌట్‌, 5 బంతుల్లో) స్కోరు బోర్డుకు మరో మూడు పరుగులే జోడించారు. రవీంద్ర జడేజా ఓవర్లో అజాజ్‌ పటేట్‌ క్యాచౌట్‌గా నిష్క్రమించగా.. 45.5 ఓవర్లలో న్యూజిలాండ్‌ 174 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/55) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/63), వాషింగ్టన్‌ సుందర్‌(1/30), ఆకాశ్‌ దీప్‌ (1/10) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా.. ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదేసి వికెట్లు తీయటం ఇదే తొలిసారి. విల్‌ యంగ్‌ (51, 100 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.
టెస్టు సిరీస్‌ ఓటమి, టెస్టు మ్యాచ్‌ పరాజయం అంత సులువుగా మరిచిపోలేం. మేము ఉత్తమ క్రికెట్‌ ఆడలేకపోయాం. న్యూజిలాండ్‌ సిరీస్‌ అంతటా బాగా ఆడింది. సిరీస్‌లో ఎన్నో పొరపాట్లు చేశాం. తొలి రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌ల్లో మెరుగైన స్కోరు సాధించలేదు. ఈ టెస్టులో 28 పరుగుల ఆధిక్యం దక్కినా.. బ్యాటర్లు ఛేదనలో విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో నా వ్యూహలు ఫలించలేదు.
– రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ :235/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 263/10
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 174/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (ఎల్బీ) ఫిలిప్స్‌ 5, రోహిత్‌ శర్మ (సి) ఫిలిప్స్‌ (బి) హెన్రీ 11, శుభ్‌మన్‌ గిల్‌ (బి) అజాజ్‌ 1, విరాట్‌ కోహ్లి (సి) మిచెల్‌ (బి) అజాజ్‌ 1, రిషబ్‌ పంత్‌ (సి) బ్లండెల్‌ (బి) అజాజ్‌ 64, సర్ఫరాజ్‌ ఖాన్‌ (సి) రచిన్‌ (బి) అజాజ్‌ 1, రవీంద్ర జడేజా (సి) యంగ్‌ (బి) అజాజ్‌ 6, సుందర్‌ (బి) అజాజ్‌ 12, అశ్విన్‌ (సి) బ్లండెల్‌ (బి) ఫిలిప్స్‌ 8, ఆకాశ్‌ దీప్‌ (బి) ఫిలిప్స్‌ 0, మహ్మద్‌ సిరాజ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (29.1 ఓవర్లలో ఆలౌట్‌) 121.
వికెట్ల పతనం : 1-13, 2-16, 3-18, 4-28, 5-29, 6-71, 7-106, 8-121, 9-121, 10-121.
బౌలింగ్‌ : మాట్‌ హెన్రీ 3-0-10-1, అజాజ్‌ పటేల్‌ 14.1-1-57-6, గ్లెన్‌ ఫిలిప్స్‌ 12-0-42-3.