చల్లబడని కల

రక్తం తాగీ తాగీ ఈ రాతిరి
మృత్యుశిలగా మారింది
కట్టేసిన కాళ్ళూ చేతులూ
విముక్తి గీతాలు పాడుకుంటూ ఉంటే
కళ్లు రేపటి కోసం వేసిన తాళం కప్పకి
ఏ కలలను అనుమతించాలో
ఉత్తరం రాస్తున్నాయి

రెండు ముక్కలుగా తెగిన నాలుక జోలికి
ఏ గోడా చేయి చాపటం లేదు.
గోడలకు మొలిచిన చెవులకు
పవిత్ర శ్లోకాలు తప్ప
ఆర్తనాదాలు ఎందుకు వినిపిస్తాయి?

దేహం చల్లబడిందని గడియారం వంక
శ్వాస పాకుతూ పోతోంది
ఒక్కో బొట్టు కన్నీటిమేకులై
దేహాన్నే నలగగొడుతుంటే
యే చిరకా నాలుకకి దాహం తీర్చలేదు

ఇక్కడ కపాలం పగలలేదు
చివరి నీటి చుక్క
దేహం నుంచి ఆవిరవగానే
పక్కలో బల్లెం దిగి
నన్ను మనిషిని కూడా కానివ్వలేదు
చీకటి గర్భంలో పిండంలా తిరుగాడుతూ
యే అమ్మ పాటని విన్నానో
ఆమె పక్కగా వచ్చి కూచోలేదు

అనంత అక్షరాల కింద
నన్ను కప్పిపెట్టిన ఈ దినం సాక్షిగా
ఒక్క కవితా నా కడుపున కాయలేదు
నా నోటిని మన్నుతో నింపిన
చేతులకు అమృతం అప్పగించిన
మథనం గురించి
వార్త గడపదాటలేదు
కనురెప్పల కింద కాలిన శవాల వాసన
కలల్ని యెత్తుకెళ్ళిన వాడు
ఏ రాజదండం నీడన గద్దెనెక్కాడో
చరిత్ర మాయ ముంత దాచేయలేదు

ఈ రాతిరి
రక్తం గడ్డకట్టి పారటం లేదు
ఓ వెలుగురవ్వ పిడికిలైలేస్తుందనీ
దేహం తన వెచ్చదనాన్ని వదులుకునే
సాహసం చేయటం లేదు
తన అణువణువునీ
తానే దహించటం మానలేదు.

– మెర్సీ మార్గరెట్‌, 9052809952