
– పంటలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు
– పంట నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్
నవతెలంగాణ – భిక్కనూర్
రాత్రి పగలు కష్టపడి పంటలు పండిస్తున్న రైతన్నలపై ప్రకృతి కన్నెర్ర చేసి అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా భిక్కనూరు మండలంలో ఆరు గ్రామాలలో పూర్తిగా పంట నష్టం జరిగింది. శనివారం రాత్రి ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా ఆరుగాలం కష్టించి పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలింది. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, లక్ష్మీదేవి పల్లి, అంతంపల్లి, భిక్కనూర్, రామేశ్వర్ పల్లి, తిప్పాపూర్ గ్రామాలలో 100% పంటలు పూర్తిగా నష్టపోయాయి. కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి గ్రామాలలో అక్కడక్కడ మొక్కజొన్న, వరి నేలకొరిగింది. వ్యవసాయ అధికారులు ఆదివారం గ్రామాలలోని పంట పొలాలను పరిశీలించి మండలంలో 3,752 ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. అందులో 2960 ఎకరాల వరి, 150 ఎకరాల మామిడి, 50 ఎకరాల, కూరగాయలు, 592 ఎకరాల మొక్కజొన్న నష్టం జరిగిందని వ్యవసాయ అధికారి రాధా తెలిపారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పంట నష్టం జరిగిన గ్రామాలను పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం జరిగిన రైతులను ఆదుకొని ఎకరానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చెల్లించాలని తెలిపారు.