నేషనల్స్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికైన ఆనంద్‌ కిరణ్‌

– పవర్‌ లిఫ్టింగ్‌ స్టేట్‌ ఛాంపియన్‌ షిప్‌లో మెదక్‌ యువకుడికి గోల్డ్‌ మెడల్‌
– కోచ్‌తో పాటు దాతల సహకారం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-మెదక్‌
డబ్ల్యుపిసి తెలంగాణ పవర్‌ లిఫ్టింగ్‌ స్టేట్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మెదక్‌ జిల్లా యువకుడు గాలిముట్టి ఆనంద్‌ కిరణ్‌ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకాలను కైవసం చేసుకున్నాడు. మెదక్‌ పట్టణం 6వ వార్డు జంభికుంట వీధికి చెందిన ఆనంద్‌ కిరణ్‌ అనే యువకుడు ఈ నెల 16న హైదరాబాద్‌ భీరంగూడా పరిధిలోని అమీన్‌పూర్‌లో జరిగిన డబ్ల్యుపిసి తెలంగాణ పవర్‌ లిఫ్టింగ్‌ స్టేట్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచాడు. పవర్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రాష్ట్రంలో మొదటి స్థానం, బెంచ్‌ ప్రెస్‌ విభాగంలో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచి బంగారు పతకాలను సాధించడం జరిగింది. వెయిట్‌ లిఫ్ట్‌ విభాగంలో 82.5 కిలోలు, డెడ్‌ లిఫ్ట్‌ విభాగంలో 170 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌ విభాగంలో 100 కిలోల పోటీల్లో సత్తాచాటారు. అక్టోబర్‌ నెలలో బెంగళూరులో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆనంద్‌ కిరణ్‌ను మెదక్‌ మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మెన్‌, స్థానిక కౌన్సిలర్‌ రాగి వనజ అశోక్‌తో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.
కోచ్‌తో పాటు దాతల సహకారం కోసం ఎదురుచూపు
సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆనంద్‌ కిరణ్‌ రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అయితే నేషనల్‌ పోటీల్లో పాల్గొనేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుకట్ట వేస్తున్నాయి. దీంతో కోచ్‌తో పాటు దాతల సహకారాన్ని కోరుతున్నాడు. గతంలో లావుగా, బొద్దుగా ఉన్న తాను జిమ్‌లో జాయిన్‌ అయ్యాడు. రోజూవారీ పనుల్లో జిమ్‌ చేయడం ఫ్యాషన్‌గా మార్చుకున్నాడు. ఇదే క్రమంలో ఇన్స్త్రగ్రాం, యూట్యూబ్‌లలో చేసే వ్యాయామాలను అనుసరిస్తూ జిమ్‌ ప్రాక్టీస్‌ చేసి వెయిట్‌ లిఫ్టింగ్‌పై మక్కువ పెంచుకోవడం జరిగింది. ఏడాదిన్నరగా కఠోర శ్రమ చేసి ఎలాంటి కోచ్‌ లేకుండా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాలను కైవసం చేసుకొని ఔరా అనిపించాడు. జాతీయ స్థాయిలో రాణించాలంటే కోచ్‌ సహకారంతో పాటు ఎంట్రీ ఫీజులు, తదితర ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని దాతలు సహకరిస్తే రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే విధంగా కషి చేస్తానని ఆనంద్‌ కిరణ్‌ చెబుతున్నారు.