చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రం ‘రాచరికం’. విజరు శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ లంకలపల్లి కథ, కథనం అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ, ‘ఈ చిత్ర గ్లింప్స్ మంచి రెస్సాన్స్ దక్కించుకుంది. గ్లింప్స్‌లో వెంగి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది’ అని తెలిపారు. ‘దర్శకుడు సురేష్ కథని అద్భుతంగా రాశారు. సినిమా కూడా అద్భుతంగా వస్తుంది అనే నమ్మకం ఉంది. గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని నిర్మాత ఈశ్వర్ చెప్పారు. హీరో విజరు శంకర్ మాట్లాడుతూ, ‘టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మా టైటిల్ చూసి దర్శకుడు బోయపాటి శ్రీను పర్సనల్‌గా మెసెజ్ పెట్టారు. రిలీజ్ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు. ‘కథ విన్నప్పుడే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్మాను. ఇలాంటి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. రాచరికంతో అరాచకం సష్టించబోతున్నాం’ అని అప్సరా రాణి అన్నారు.