అధికారపు అరాచకం

Sampadakiyamరౌడీలు, గుండాలు, దొంగలు, దోపిడీదారులు మొదలైన వారు అరాచకాలకు పాల్పడటం మనకేమీ ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే వాళ్లలా చేస్తారు కాబట్టే రౌడీలు, గుండాలు అంటున్నాం, అసలైన ఆశ్చర్యం ఏమంటే, రాజ్యాంగం ప్రకారం ఎన్నికయిన ప్రజా ప్రభుత్వాలనబడే సర్కార్లే అరాచకానికి దిగితే, ఇంకా ఎవరిదగ్గర మొరపెట్టు కుంటారు ప్రజలు! అయితే చివరికి అత్యున్నత న్యాయస్థానం దగ్గర మొరపెట్టుకోక తప్పలేదు బాధితులకు. అహం కారంతో అనేక దుర్మార్గాలకు పాల్పడతారు నియంతలు. అలాంటి అహంకారం ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రదర్శిం చటమే నేటి విడ్డూరం! ప్రభుత్వాలు ప్రజలవైపు నుండి ఆలోచిస్తాయని సాధారణంగా మనం భావిస్తాము. రాజ్యాంగ హక్కులను, విలువలను పాటిస్తాయనీ అనుకుంటాం! కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి? ప్రభుత్వాలలో మతవివక్షతలు, కులవివక్షతలు, కార్పోరేట్లకు వంతపాడే వివక్షతలు పెరిగిపోయి, ఈ అరాచకానికి పాల్పడుతున్నాయి.
అందుకు నిలువెత్తు ఉదాహరణే ఈ మధ్య సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలు, తీర్పులు. గత కొంతకాలంగా ఉత్తరప్రదేశ్‌లో ‘బుల్డోజర్‌రాజ్‌’ పరిపాలన సాగుతోందన్న విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, ముఖ్యంగా ముస్లిం సమూహాన్ని, హక్కులకోసం పోరాడేవారిని టార్గెట్‌ చేసుకుని, వారి ఇండ్లను బుల్డోజర్‌లతో కూలగొట్టడం, అక్రమంగా నిర్మించారని ఆరోపించడం జరుగుతోంది. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌ గంజ్‌కు చెందిన మనోజ్‌ తిబ్రెవాల్‌ ఇంటిని కూడా ఇలానే కూలగొట్టింది ప్రభుత్వం. దానిపై అతను కోర్టుకు వెళ్లాడు. విచారించిన ధర్మాసనం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రాత్రికి రాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో ఇల్లును కూల్చివేయడం తప్పు’ అని స్పష్టం చేసింది. కేవలం 3.7 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారన్న కారణంతో ఇల్లును కూల్చివేసి నందుకు, బాధితునికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రోడ్డు విస్తరణ సమయంలో ఎలా వ్యవహరించాలో అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలను జారీ చేసింది. యూపీలో ఇప్పటికి 123 ఆవాసాలను కూల్చివేశారని, నోటీసు లేకుండా కేవలం చాటింపు వేసి కూల్చడం అహంకారంతో చేసిన చర్య తప్ప చట్టబద్ధమైనది కాదని, ఇది పూర్తి అరాచకమని వ్యాఖ్యానించింది.
ఇది ఇండ్లను కూల్చడం కాదు, రాజ్యాంగపు హక్కులను కూల్చడం. విలువల్ని కూల్చడం. ప్రజాస్వామిక సంప్రదాయాన్ని కూల్చడం. ఈ కూల్చడాల వెనుక మతం, కులం ఉండటం మరింత ఘోరమైన విషయం. పై విషయాలతో పాటుగా సుప్రీంకోర్టు మరో అంశంపైనా తీవ్రంగానే స్పందించింది. గోరక్షణ పేరుతో మూక హత్యలకు పాల్పడుతున్న దళాలపై ఆందోళన వ్యక్తం చేసింది. వీరి దాడులు పెరుగుతున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని నిలదీసింది. మోడీ అధికారంలోకి వచ్చాక, బీఫ్‌ తింటున్నారనే నెపంతో అక్లాక్‌ను చంపిన సంఘటన నుండి, వివిధ రాష్ట్రాలలో గోరక్షణ పేరుతో దాడులకు తెగబడటం, అరాచకం సృష్టించటం బాగా పెరిగిపోయింది. ఇది కూడా 75 ఏండ్లుగా పెంపొందించుకున్న లౌకిక విలువల్ని కూల్చడమే. ఆహారపు హక్కులను ధ్వంసం చేయటమే. ప్రభుత్వాలు ప్రజల హక్కులను, ప్రాణాలను కాపాడాల్సి ఉండగా, దానికి భిన్నంగా ప్రాణాలు తీసే పాత్రను పోషించడం, హక్కులను కాలరాయడం చాలా దారుణమైన విషయం. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ల పేరుతో బుల్డోజర్‌రాజ్‌ కొనసాగటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అప్పుడప్పుడైనా కోర్టులు ఇలా హెచ్చరించినపుడే ప్రభు త్వాల నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. ఈ హెచ్చరికలను ప్రభుత్వాలు, నాయకులు పట్టించుకుం టాయా లేదా అనేది తేలాల్సి ఉంటుంది.
మన తెలంగాణలో కూడా ఆక్రమణల పేరుతో ఇండ్లను కూల్చేటప్పుడు ముందుగా నోటీసులివ్వడం, నిబంధనలు పాటించడం చేయాలి. పేదవారికి ప్రత్యామ్నాయాన్నీ చూపించాలి. ఏదిఏమైనా అహంకారంతో అరాచకంగా వ్యవహరించే ప్రభుత్వాల తీరును ప్రధాన న్యాయస్థానం గుర్తించి నిలదీయడం, హెచ్చరించడం మంచి పరిణామం. ఈ విషయాలను ప్రజలు అవగాహన చేసుకుని, అలాంటి ప్రభుత్వాలను ప్రజాస్వామ్య విధానం ద్వారానే కూల్చడం సరైన ప్రతిచర్య అవుతుంది.