ఇక అంతా ఏఐ ప్రభావమే…!

And everything is the effect of AI...!– విస్తృతంగా వినియోగిస్తున్న రాజకీయ పార్టీలు
– ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల విన్యాసాలు
– ప్రచారంలోకి ఫేక్‌ వీడియోలు, కథనాలు
– లాభాలే కాదు… అనర్థాలూ ఉన్నాయన్న నిపుణులు
న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో సెల్ఫీలు, హోలోగ్రాములకు ప్రాధాన్యత లభించింది. 2019 నాటికి ప్రచారంలో డిజిటల్‌ మీడియా వినియోగం అధికమైంది. ఇప్పుడు మనం తొలిసారిగా కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం చూపబోతున్న సార్వత్రిక ఎన్నికల ముంగిట ఉన్నాము. పరిశోధనలకు, స్క్రిప్టు ప్రసంగాలకు ఈ పరిజ్ఞానాన్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. స్క్రిప్టు ప్రసంగాలను రూపొందించే వారిని రాజకీయ పార్టీలు నియమించుకుంటున్నాయి. ఓ బృందం ఆరు గంటల్లో చేసే పనిని ఛాట్‌జీపీటీ కేవలం పది నిమిషాల్లో చేసేస్తోందని కొల్‌కతాకు చెందిన అడ్వర్‌టైజ్‌మెంట్‌ కంపెనీ ‘స్టాండర్డ్‌ పబ్లిసిటీ’ యజమాని కల్యాణేశ్వర్‌ సర్కార్‌ చెప్పారు.
గ్రామీణ ప్రజల కోసం ఓ రాజకీయ పార్టీ ప్రసంగాన్ని రూపొందించాలని అనుకున్నదనుకోండి. దానిపై ముందుగానే ఛాట్‌జీపీటీ కసరత్తు చేస్తుంది. ప్రసంగించాల్సిన ప్రదేశం చరిత్ర ఏమిటి, అక్కడ ఎలాంటి ప్రజలు నివసిస్తారు, వారి నాయకులు ఎవరు, వారి సంస్కృతీ సంప్రదాయాలు ఎలా ఉంటాయి, మతపరమైన నమ్మకాల మాటేమిటి, వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఏమిటి వంటి సమాచారాన్ని మొత్తం ఛాట్‌జీపీటీ సేకరిస్తుంది. ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేథను ఉపయోగించకపోతే అభ్యర్థులు ఏదో షరా మామూలు సాదాసీదా ప్రసంగాలను తయారు చేసుకుంటారు. అన్ని చోట్లా దానినే వల్లె వేస్తుంటారు. ఇప్పుడు దేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రసంగాలను మారుస్తూ ఓటర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఛాట్‌జీపీటీ ఎంతగానో ఉపకరిస్తుంది.
తటస్థులే లక్ష్యంగా…
2022 ముందు వరకూ ఏఐని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అంతా ఆ పరిజ్ఞానం మయమే. ఓటర్లలో రెండు రకాల వారు ఉంటారు. ఎవరికి ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించుకునే వారు ఒకరైతే నిర్ణయానికి రాలేకపోతున్న వారు మరొకరు. ఈ రెండో రకం ఓటర్లను ఏఐ లక్ష్యంగా చేసుకుంటుంది. వారి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులను, లైకులు, కామెంట్లను పరిశీలిస్తుంది. ఆ తర్వాత వారిని ప్రభావితం చేసే ప్రయత్నం ప్రారంభిస్తుంది. అంతేకాదు…సమాచారాన్ని ఏఐ మదింపు చేస్తుంది. విజేతలెవరో జోస్యం చెబుతుంది. సామాజిక మాధ్యమాలలో కనిపించే ఒపీనియన్‌ పోల్స్‌లో ప్రవేశించి, ఫలితాన్ని తారుమారు చేస్తుంది కూడా.
ఫేక్‌ వీడియోలు కూడా…
అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఏఐ సాయంతో రూపొందించిన ఫేక్‌ వీడియోలు కూడా మనకు కన్పిస్తుంటాయి. ఉదాహరణకు కుమారుడు స్టాలిన్‌ నాయకత్వాన్ని కరుణానిధి ప్రశంసించడం, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాతీ నృత్యం చేస్తూ పాట పాడడం వంటివి ఫేక్‌ వీడియోలే. తప్పుడు సమాచారాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవడంపై ఐ-పాక్‌కు చెందిన ప్రతీక్‌ జైన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మత కోణంలో కూడా ఉపయోగించుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. సందేశ్‌ఖాలీ వీడియోలను కూడా మార్ఫింగ్‌ చేశారని, వాస్తవాలను వక్రీకరించేందుకు సైతం ఏఐని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.
అడ్డుకోవడం కష్టమే
140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఫేక్‌ వార్తలు, కథనాలు నిప్పు కంటే వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటిని అడ్డుకోవడం అసంభవం. అలాంటివి తప్పనిసరిగా ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఏఐతో ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉన్నదని ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన గ్లోబల్‌ రిస్క్‌ నివేదిక తెలిపింది. రాబోయే రెండు సంవత్సరాలలో దుష్ప్రచార వ్యాప్తి పెరిగిపోతుందని హెచ్చరించింది. ఎన్నిక జరగడానికి 24 గంటల ముందు ఏదైనా నియోజకవర్గంలో ఓ తప్పుడు వీడియో ప్రచారంలోకి వస్తే దానిని కనిపెట్టడం కష్టమని, అది కచ్చితంగా ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు.