– సెంటర్లలో 50 వేల బస్తాల ధాన్యం రాశులు
– రెండు నెలలుగా ధాన్యం అమ్ముకోలేక పడిగాపులు
– ప్రయివేటుకే అమ్ముకున్న సగం మంది రైతులు
– లారీలు రాక, మిల్లర్లు దించుకోక రైతుల అగచాట్లు
– అమ్ముకున్న రైతులకు నిలిచిన చెల్లింపులు
యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. లారీలు రాక, రైస్ మిల్లర్లు పెట్టే కొర్రీలతో రెండు నెలలవుతున్నా పూర్తి ధాన్యం కొనకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఇంకా సుమారు 50 వేల బస్తాల ధాన్యం రాశులు పేరుకుపోయింది.
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మండలంలో యాసంగి సీజన్లో 10 వేల 16 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 2 లక్షల 80 వేల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు కోసం మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాల(ఖప్రాయపల్లి, రహీంఖాన్ పేట)తో పాటు పాలడుగు గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 350 మంది రైతుల నుంచి 25 వేల 619 క్వింటాళ్లు, సింగిల్ విండో ఆధ్వర్యంలో 788 మంది రైతుల నుంచి 58 వేల 460 క్వింటాళ్లు, పాలడుగు రైతుసంఘం ద్వారా 68 మంది రైతుల నుంచి 7280 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అకాల వర్షాలతో, నకాలంలో లారీలు రాక, రైస్ మిల్లర్లు పెట్టే కొర్రీలతో ఆయా కేంద్రాల్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇంకా సుమారు 50 వేల బస్తాల ధాన్యం రాశులు పేరుకుపోయాయి. అకాల వర్షాలతో ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసి మొలకెత్తి, రంగుమారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైస్ మిల్లర్లు రకరకాలకొర్రీలు పెడుతూ బస్తాకు మూడు కిలోల వరకు కటింగ్ పెడుతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన కోటా మేరకు కూడా మొదట్లో లారీల నుంచి దిగుమతి చేసుకోకపోవడంతో మూడు, నాలుగు రోజులు మిల్లుల వద్దే నిరీక్షించాల్సి రావడంతో తమకు కిరాయి గిట్టుబాటు కావడం లేదనిలారీల యజమానులు కేంద్రాలకు లారీలు పంపకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో లారీల యజమానులు బస్తాకు రూ.5 నుంచి 10 వసూలు చేస్తున్నా గత్యంతరం లేక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఏ గ్రేడ్ కింద కాకుండా సాధారణ రకం కిందనే దించుకోవడం, బస్తాకు మూడు కిలోల కటింగ్ తో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. తమకు కేటాయించిన కోటా అయిపోయిందని ప్రస్తుతం మిల్లర్లు బస్తాలు దింపుకోవడానికి నిరాకరిస్తుండటంతో తూకాలు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలు ప్రారంభమైన వెంటనే కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరుకపోవడం, అకాల వర్షాలతో, రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు వడి ఇబ్బందులు పడలేక సగం మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకున్నారు.
మండలంలో 2 లక్షలా 80 వేల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 91 వేల 359 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన 50 వేల బస్తాల ధాన్యం కూడా కొనుగోలు చేస్తే లక్షా 41 వేల 359 క్వింటాళ్లు కొన్నట్టవుతుంది. దీంతో మిగతా ధాన్యమంతా రైతులు ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకున్నారని తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, ఇప్పటి వరకు కేవలం 30శాతం మంది రైతులకే చెల్లించినట్టు అధికారులు తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇటు ధాన్యం కొనక, అటు కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు నెలలవుతున్నా…
బద్దం సత్తిరెడ్డి, రైతు, పాలడుగు
పాలడుగు కొనుగోలు కేంద్రంలో 225 బస్తాల ధాన్యం తెచ్చి పోసి రెండు నెలలవుతుంది. నేటికీ కొనుగోలు చేయలేదు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి, లారీలు రాక, మిల్లర్లు ధాన్యం దించుకోకపోవడంతో కొనుగోళ్లు
సక్రమంగా జరగడం లేదు. సుమారు రెండు నెలలుగా కేంద్రంలోనే పడిగాపులు పడాల్సి వస్తుంది. కేంద్రంలో ఇంకా 80 మంది రైతుల ధాన్యం ఉంది. అధికారులు ఇబ్బందులు తొలగించి కేంద్రంలో ఉన్న పూర్తి ధాన్యం వెంటనే కొనాలి.
కొనుగోలు పూర్తి చేసి రైతులకు డబ్బులు చెల్లించాలి
గుండు వెంకటనర్సు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మోత్కూరు
కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి, రైస్ మిల్లర్ల నిలువు దోపిడీతో రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికీ కేంద్రాల్లో వందల మంది రైతుల ధాన్యం పేరుకపోయి పడిగాపులు పడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతుండటంతో ప్రభుత్వం వెంటనే కేంద్రాల్లోని పూర్తి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి.