– భారత్, ఆస్ట్రేలియా పోరు నేడు
– మధ్యాహ్నాం 2 నుంచి
నవతెలంగాణ-చెన్నై
సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలత. వంద కోట్ల అభిమానుల అంచనాలు, ఆశలు మోస్తూ ఓ జట్టు. ప్రపంచకప్‌లు సరదాగా సొంతం చేసుకునే జట్టు మరోవైపు. ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియాలు నేడు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. టైటిల్ రేసులో నిలిచిన రెండు అగ్రజట్లు తమ తొలి మ్యాచుల్లో ఢకొీడుతుండగా.. ఇరు జట్ల శిబిరాలకు ఇది కఠిన పరీక్షగా మారింది. ఆస్ట్రేలియా, భారత్ పోరు చెపాక్‌లో నేడు మధ్యాహ్నాం 2 గంటలకు ఆరంభం.
గిల్ ఆడేనా?!
ఈ ఏడాది వన్డేల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్ గిల్. గత 4 వన్డేల్లో గిల్ ఏకంగా రెండు సెంచరీలు, ఓ అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఇటీవల ఆసీస్‌తో సిరీస్‌లో గిల్ శతక మోత మోగించాడు. ఇప్పుడు డెంగీ జ్వరంతో బాధపడుతున్న గిల్.. నేడు మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. గిల్ లేకుంటే.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. కిషన్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్‌లో విలువైన పరుగులు జోడించిన అనుభవం అతడి సొంతం. ఆసీస్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్య కీలకం కానున్నాడు. స్పిన్ అనుకూలిత చెపాక్‌పై అశ్విన్‌కు తిరుగులేని రికార్డుంది. జట్టుకు బ్యాట్‌తో, బంతితో హార్దిక్ సమతూకం తీసుకొస్తాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సొంతగడ్డపై మళ్లీ ప్రపంచకప్ సాధించాలనే సంకల్పం డ్రెస్సింగ్‌రూమ్‌లో కనిపిస్తుంది. బుమ్రా, సిరాజ్ పేస్‌తో.. కుల్దీప్, జడేజా, అశ్విన్ స్పిన్‌తో ఆసీస్‌ను మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాస్త కంగారు!
ఆస్ట్రేలియా అనగానే ఎప్పుడూ బలమైన జట్టే. కానీ 1999, 2003, 2007, 2015 ప్రపంచకప్‌లు సాధించిన జట్టు తరహా ఆసీస్ కాదు ఇది. కమిన్స్ సేన పరిపూర్ణ జట్టు కాదు, ప్రతి విభాగంలోనూ బలహీనతలు ఉన్నాయి. కానీ ఐసీసీ ఈవెంట్లలో ఆసీస్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. లోపాలు ఉన్నప్పటికీ సెమీస్ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన ఆస్ట్రేలియా.. నేడు ఆతిథ్య భారత్‌ను ఎదుర్కొనుంది. స్పిన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై కంగారూలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. మిడిల్ ఓవర్లలో ఇటు బంతితో, అటు బ్యాట్‌తో మాక్స్‌వెల్ ప్రదర్శన ఆసీస్‌కు కీలకం. డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్‌లు ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఓవర్లలో స్మిత్, లబుషేన్ స్ట్రయిక్‌రొటేషన్‌పై ఇంకా అనుమానాలు ఉన్నాయి. మిచెల్ స్టార్క్, జోశ్ హాజిల్‌వుడ్‌తో కలిసి కమిన్స్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. మాక్స్‌వెల్ తోడుగా జంపా మాయజాలం చేయనున్నాడు. చెపాక్ స్టేడియం స్పిన్‌కు అనుకూలం. ఇక్కడ 300 పరుగులు చేసినా.. గెలుపుపై దీమాగా ఉండొచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. చెపాక్ ఎనిమిదో ప్రపంచకప్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.