వాట్సాప్‌లో వస్తున్న మేసెజెస్ చదవకుండా, అవగాహన చేసుకోకుండానే చాలామందికి షేర్ చేస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో అటువంటి విషయాలు వైరల్ అవుతాయి. కొన్నిసార్లు తప్పుడు సమాచారం షేర్ చేసినందుకు ఇబ్బందుల్లో పడతాం. ఇది సహజంగా వాట్సాప్ ఉపయోగిస్తున్న వారికి ఏదో ఒక సందర్భంలో జరుగు తూనే ఉంటుంది. ఇది వాట్సాప్ ఆస్తిపరుల ఆతృత. కొన్నిసార్లు ముఖ్యమైన మేసేజెస్స్ చదవం, కనీసం చూడం. దీంతో వాటి చరిత్ర తెలియదు. అటువంటి సాక్ష్యాలెన్నో చరిత్రకెక్కకుండా మిగిలిపోతాయి. ప్రస్తుత రాజకీయా ల్లో రెక్కలు విప్పిన వలసపక్షులు ఎక్కడ వాలుతాయో తెలియదు. కానీ అటువంటి నాయకులనుద్దేశించి సాధారణంగా ‘ఆయారామ్… గయారామ్’ అంటూ సంభోదిస్తుం టారు. అవి హిందీ పదాలు. ‘రామ్ పార్టీలోకి వచ్చాడు, పార్టీ నుంచి రామ్ పోయాడు’ అని అర్థం. హర్యానా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే హరిరామ్ గురించి ఈ వ్యాఖ్యలు. ఆయన ఒకే రోజు మూడు పార్టీలు తిగిరి సాయంత్రానికి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారట. ఈ వార్త ఆనాడు మీడియాకు పచ్చి మేతైంది. హరిరామ్ పార్టీ మారిన అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అక్కడి ప్రతిపక్ష నేత చెప్పిన సాక్ష్యమిది. రామ్ ఆయా…రామ్ గయా అని ఒకే మాట చెప్పి లేచి వెళ్లిపోయాడట. అది కాస్త ఆయారామ్, గయారామ్‌గా మారిపోయిందంటూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు చెప్పారు. చాలాకాలం తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎదురయ్యారు. కుశల ప్రశ్నల తర్వాత ఆనాటి తెలంగాణ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోమాట కూడా చెప్పారు. రాజకీయాల్లో హత్యలుండవ్, ఆత్మహత్యలే ఉంటాయనేది మనం తరచుగా వింటుంటాం. ఆ వ్యాఖ్యను ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యూపీ.రాజు ఉపయోగించారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కాలం కలిసిరాకపోతే హత్యలు ఉండవుగానీ ఆత్మహత్యలు ఉంటాయని చెప్పారాయన.
– గుడిగ రఘు