
నవతెలంగాణ -కంటేశ్వర్
సెప్టెంబర్ 11నుండి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26000/ అమలుకై నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఐటీయూ కార్యాలయంలో అంగన్వాడి ఉద్యోగుల సమ్మె పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ వరకు అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ,ఆలోపు కనీస వేతనం 26000 నిర్ణయించి అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 48 సంవత్సరాలుగా రక్తహీనతతో పౌష్టికాహారం లేక బాధపడుతున్న మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని ఆరోపించారు. శాశ్వత స్వభావం కలిగిన అంగన్వాడి ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26000 వేలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ గా టీచర్ కు 10 లక్షలు ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించడం జరిగిందని మూడు రోజుల టోకెన్ సమ్మె ,రాష్ట్రవ్యాప్తంగా జీపు జాత, సిడిపిఓ, కలెక్టరేట్ల ముందు మహాధర్నాలు నిర్వహించి 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు మంత్రి సత్యవతి రాథోడ్ కు, రాష్ట్ర కమిషనర్ కు, జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 10 నాటికి సమస్యలు పరిష్కరించని ఎడల సెప్టెంబర్ 11 నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్, అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ, వాణి, శ్రీదేవి సునీత జయ సుమలత, గిరిజ, భూమవ్వ, అనసూయ, పద్మ అంజలి, తదితరులు పాల్గొన్నారు.