అంగన్‌వాడీ టీచర్‌ హత్య

అంగన్‌వాడీ టీచర్‌ హత్య– మెడకు స్కార్ఫ్‌ చుట్టి..హత్య
– మెడలోని నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ చోరీ
– ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కలకలం
నవతెలంగాణ -తాడ్వాయి
అంగన్‌వాడీ టీచర్‌ హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం కాటాపూర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌-3లో రడం సుజాత(50) అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె విధులు పూర్తిచేసుకొని తన స్వగ్రామమైన ఏటూర్‌నాగారం మండలం చిన్న బోయినపల్లికి బయలుదేరింది. ఆ సమయానికి ఆర్టీసీ బస్సు వెళ్లిపోవడంతో వేరే వాహనాల ద్వారా బయలుదేరినట్టు తెలుస్తోంది. కాగా, బుధవారం ఉదయం నాంపల్లి అడవిలో నీళ్ల వొర్రే దగ్గరున్న పెద్దగుట్ట సమీపాన రోడ్డుకు అర కిలోమీటర్‌ దూరంలో ఆమె విగతజీవిగా పడి ఉంది. అటువైపు వెళ్లిన తునికాకు కూలీలు సుజాత మృతదేహం కనిపించడంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పస్రా సీఐ శంకర్‌, స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి మెడకు స్కార్ఫ్‌ చుట్టి ఉరేసినట్టు, తల వెనుక భాగాన తీవ్రంగా గాయపరిచినట్టు గుర్తించారు. సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ను దుండగులు చోరీ చేయగా వివరాలు సేకరించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కాటాపురంలో సుమారు 30 సంవత్సరాల నుంచి అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందింది. కాగా, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె స్వగ్రామమైన చిన్నమైనపెల్లి, విధులు నిర్వహిస్తున్న కాటాపూర్‌ శోక సంద్రంగా మారింది.
కాగా, హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ దావూద్‌, రత్నం రాజేందర్‌, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె సరోజన, కె సమ్మక్క, ఆశా యూనియన్‌(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి సంతాపం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం విచారణ జరిపించి దుండగులను కఠినంగా శిక్షించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలకు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో హంతకులపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.