– 26న ఇందిరాపార్కు వద్ద ధర్నా
– కేసీఆర్‌కూ చంద్రబాబు గతే.. : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలకిë
– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
– ఖమ్మంలో ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ మొఫసిల్ విలేకరులు
అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తే అంగన్‌వాడీలు రాష్ట్ర ప్రభుత్వానికి భయపడరని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐయూటీ) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలకిë అన్నారు. తమ సమస్యల పరిష్కారం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులు రిలే దీక్షలు చేపట్టారు. అదేవిధంగా శనివారం పలుచోట్ల ధర్నా చేశారు. ఖమ్మంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. వినతిపత్రాలు అందజేశారు. ఆదిలాబాద్‌లో అక్రమ అరెస్టులు, బెదిరింపులను తీవ్రంగా ఖండించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ చౌరస్తాలో అంగన్‌వాడీలు చేపట్టిన ధర్నాలో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. సమ్మెను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్, ఆయన భజనపరులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అంగన్‌వాడీలు వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు.బీఆర్‌ఎస్ పెద్ద మోసకారి ప్రభుత్వం అని, అంగన్‌వాడీలతోపాటు ఇతర కార్మికులనూ మోసం చేసిందని అన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నారు. అంగన్‌వాడీలకు మద్దతుగా సోమవారం సర్కార్ వద్దకు రాయబారంగా వెళ్తామన్నారు. అయినా స్పందించకపోతే ఈనెల 26న ఇందిరాపార్కు వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. 28వ తేదీన వినాయక నిమజ్జనం ఉందని, ఆలోపు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో అంగన్‌వాడీలపై సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. అక్రమ కేసులు కేసులు బనాయించారనీ, సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే.. అంగన్‌వాడీలను రక్షించుకుంటామన్నారు. ఆదిలాబాద్‌లో గాయపడిన అంగన్‌వాడీలకు ఆర్థిక సహాయంగా సేకరించిన రూ.5వేలను ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌కు అంగన్‌వాడీలు అందజేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీడీపీఓ కార్యాలయం ఎదుట ఈ సమ్మెలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీల సత్తా ఏంటో తెల్వదని, వారి సత్తా ఏంటో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసన్నారు. అంగన్వాడీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని, మట్టి ఖర్చులతో సరిపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శాంతియుతంగా సమ్మె చేస్తుంటే బెదిరింపుతో.. పోలీసులతో కలిసి సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బతికున్నప్పుడు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ఇవ్వకుండా.. చనిపోయాక టీచర్లకు రూ.20వేలు, ఆయాలకు రూ.10వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సమ్మె చేస్తున్న నాయకులను కాదని మంత్రి ఇతరులతో చర్చలు జరిపితే చలో హైదరాబాద్, చలో ప్రగతిభవన్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ, హాలియాలోనూ జయలకిë పాల్గొని అంగన్‌వాడీలకు ధైర్యం చెప్పారు. నార్కట్‌పల్లిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జరిగిన సమ్మెకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మద్దతు తెలిపారు. చౌటుప్పల్ మండలంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సమ్మెకు టీపీసీసీ రాష్ట్ర నాయకులు బి.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మద్దతు తెలిపారు. కందుకూరు పర్యటనకు వచ్చిన మంత్రి సబితాఇంద్రారెడ్డికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం జిల్లా వైరా, పాలేరు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను అంగన్‌వాడీలు ముట్టడించారు. ముందుగా ప్రధాన సెంటర్ నుంచి ర్యాలీగా క్యాంపు కార్యాలయాలకు చేరుకొని ఆందోళన చేశారు. పాలేరు క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. అనంతరం ఆయా ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు చేరుకొని ఆందోళన చేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య బయటకు వచ్చి వారి సమస్యలు విని వినతిపత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.