– గౌరవ వేతనం పెంచాలని డిమాండ్
పాట్నా : బీహార్‌లో ఓ వైపు శాసనసభ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు వందలాది మంది అంగన్‌వాడీలు, సహాయకులు మంగళవారం రాజధాని పాట్నా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వారు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా ఘట్‌బంధన్ ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తమ నెలవారీ గౌరవ వేతానాన్ని పెంచాలని, ప్రభుత్వోద్యోగులతో సమానమైన హోదా కల్పించాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు. పదవీ విరమణ వయసును పెంచాలని, అంగన్‌వాడీలకు ఐదు లక్షలు, సహాయకులకు మూడు లక్షల రూపాయల చొప్పున ఏకమొత్తంలో అందజేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మోహరించిన భద్రతా సిబ్బంది అంగన్‌వాడీలను అసెంబ్లీ ప్రధాన గేటు సమీపంలో అడ్డుకున్నారు.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు. ఈ దశలో కొందరు అంగన్‌వాడీలు కిందపడిపోయారు. నీటి ఫిరంగులను ఉపయోగించడంతో పలువురికి గాయాలయ్యాయి. తమ గౌరవ వేతనం చాలా తక్కువగా ఉన్నదని, దానిని రెట్టింపు చేయాలని కోరుతున్నామని అంగన్‌వాడీలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో నేతలు దీనిపై హామీ ఇచ్చారని, అయితే సంవత్సరం దాటినా మాట నిలుపుకోలేదని వారు మండిపడ్డారు. ఆ తర్వాత సీపీఐ, సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్) సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పోలీసు చర్యను శాసనసభలో లేవనెత్తారు.