తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీల నిరసన

– కోరికల దినోత్సవం సందర్భంగా డిమాండ్లతో వినతి పత్రం అందజేత

నవతెలంగాణ కమ్మర్ పల్లి
జాతీయ కోరికల దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమునా మాట్లాడుతూ మహిళలు పిల్లలు కిషోర్ బాలికల పోషకాహార లోపాన్ని తగ్గించడంలో, 0-6 సంవత్సరాల పిల్లల సమగ్ర అభివృద్ధి సాధించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడాన్ని జాతీయ అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో  ఈ నెలలో ప్రవేశపెట్టి పూర్తి బడ్జెట్ లో ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్స్ ను మూడవ తరగతి, హెల్పర్స్ ను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని, పెండింగ్ లో ఉన్న రెగ్యులరైజేషన్, 45వ ఐఎల్ సి  సిఫార్సులను  అమలు చేయాలన్నారు. కనీసం వేతనం నెలకు రూ.26 వేలు, పెన్షన్ నెలకు రూ. 10వేలు,  పిఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలతో ఉండాలన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, స్కీం వర్కర్లు అందరికీ వెంటనే పే కమిషన్ ఏర్పాటు చేయాలని, గ్రాట్యూటీ పై సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏ రూపంలోనూ ఐసిడిఎస్ ను ప్రైవేటీకరణ చేయకుండా,4 లేబర్ కోడ్  లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ ఆంజనేయులుకు అందజేశారు.  ఈ కార్యక్రమంలో  తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు మంజుల, బాలమణి, సరిత, పద్మ, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.