అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చేయాలి

– కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– సీఐటీయూ జిల్లా నాయకులు పోచమొని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోనీ కృష్ణ అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె మంగళవారం రెండోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా సమయం ఇచ్చి పని చేస్తున్నారనీ, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ రూ.10 లక్షలు ఇచ్చి, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఐసీడీఎస్‌ బడ్జెట్‌ పెంచి బలోపేతం చేయాలని కోరారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏడీఏలను వెంటనే ఇవ్వాలని కోరారు. 2018లో కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనం అంగన్‌వాడీ టీచర్లకు రూ.1500,హెల్పర్లకు రూ.750 ,మిని వర్కర్లకు, రూ.1250 లు, దానికి సరిపడా బడ్జెట్‌ను వెంటనే రిలీజ్‌ చేసి ఇవ్వాలని కోరారు. సీనియార్టిని ప్రకారం వేతనంతో వ్యత్యాసం ఉండాలనీ, ఇంక్రిమెంట్‌ల సౌకర్యం కల్పించాలన్నారు. ఐసీడీఎస్‌కు సంబంధం లేని పనులు చేయించవద్దనీ, మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ సెంటర్లగా గుర్తించి, ప్రకటించిన సర్క్యులర్‌ ఇవ్వాలని కోరారు. హెల్త్‌ కార్డులు, మెడికల్‌తో కూడిన మెడికల్‌ సెలవులు ఇవ్వాలన్నారు. ఎండ కాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా సెలవులు ఇవ్వాలని మొదలగు సమస్యల పై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు.ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొన సాగుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు పద్మ, వైదేహి, సుమతమ్మ, వరలక్ష్మి, యాదమ్మ, జ్యోతి, జయమ్మ, లక్ష్మి, విజయ, తదితరులు ఉన్నారు.