– అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భద్రత గల వాతావరణంలో సేవలు అందించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం మండలంలోని మోతుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం, ఆర్‌ఆర్ కాలనీ, అప్పపల్లి గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అనుకూలతలను పరిశీలించడం జరిగిందని, అవసరమైన మరమ్మత్తులు, మూత్రశాలల ఏర్పాటు, పెయింటింగ్, ఆట వస్తువులను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో భద్రత గల వాతావరణంలో సేవలు అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో 11 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి వినూత్నంగా ఆధునీకరించడం జరుగుతుందని, 250 కేంద్రాలలో మూత్రశాలలు, 60 కేంద్రాలలో నీటి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు సమయానుకూలంగా పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్, జిల్లా స్వయం సహాయక సంఘాల ఏపీడీ రామకృష్ణ, ఆసిఫాబాద్ శిశు అభివృద్ధి అధికారి సాదియా, అసిస్టెంట్ ఇంజనీర్ శశిధర్ పాల్గొన్నారు.