
అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు నష్టం కలిగించే జీవో 10 ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కు మండలంలోని అంగన్వాడీ ఉద్యోగులు తరలి వెళ్లారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమునా ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులు చలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా యమునా మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు విధులు నిర్వర్తించి సేవలందించిన అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ కు ప్రభుత్వం తగిన రీతిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి విధుల నుండి తప్పించాలన్నారు. జీవో నెంబర్ 10ని తక్షణమే రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచడంతోపాటు పెన్షన్, విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెట్టింపు చేస్తామని మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించినట్లుగా టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష అందించేలా కొత్త జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా హామీలను అమలు చేయాలన్నారు. ఆయాలకు పాత పద్ధతిలోనే పదవ తరగతి విద్యార్హతతో ప్రమోషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.