ఏవ్యక్తికి అయినా ఎవరి ఇంట్లో పుట్టడం, ఏ వూరిలో పుట్టడం అనేది తమ చేతుల్లో ఉండదు. పుట్టిన తరువాత సమాజంలోని నాటి సంస్కృతి, సాంప్రదాయాలకు లోబడిపోయి బతకడమా? లేక నూతన సాంప్రదాయాలకు తెరతీయడమా అనేది మాత్రం వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. ఆ రకమైన జీవితాన్ని సాగించిన వారిలో అమెరికా నుండి జపాన్ వరకూ, సైబీరియా నుండి ఆఫ్రికా వరకూ ప్రపంచమంతటా ఉన్న కోటాను కోట్ల మంది కష్టజీవులను ఆర్థిక, సామాజిక, సమస్త పీడనల నుంచి విముక్తి కోసం ఒక మహత్తర సిద్ధాంతాన్ని అందించడం కోసం భాగస్వామి అయిన ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవితం కలకాలం మార్గదర్శమే. ఏంగెల్స్ మరణించి ఆగష్టు 5వతేదీ నాటికి 128 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఏంగెల్స్ జీవితాన్ని, ఆయన సాగించిన కృషిని గురించి చర్చలు, బోధనలు వివిధ వేదికలు, సంస్థలు ప్రపంచ మంతటా నిర్వహిం చడం జరుగు తోంది. పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద ఆర్థిక, సైద్ధాంతిక పెత్తనం ప్రపంచం మీద సాగుతున్న నేపథ్యంలో ప్రపంచ గమ నంలో మార్పు కోసం, కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి పాటు పడేవారికి ఏంగెల్స్ జీవితం నిత్య ప్రేరణ సాగిస్తూనే ఉంటుంది.
యూరప్‌లో పరిశ్రమలు విస్తరిస్తూ, కార్మికవర్గ దోపిడీ విచ్చల విడిగా సాగుతున్న 18వ శతాబ్దంలో ఒక బట్టల మిల్లు యజ మాని కుటుంబంలో పెద్ద కొడుకుగా ఫ్రెడరిక్ ఏంగెల్స్ 1820 నవంబరు 28న ప్రష్యా (ఇప్పటి జర్మనీ)లోని బార్మెన్ నగరంలో జన్మించాడు. 75సంవత్సరాలు జీవించిన ఏంగెల్స్ ఒక సామాజిక శాస్త్రవేత్తగా, రచయితగా, తత్వవేత్తగా, బహుభాషా కోవిదుడిగా, విప్లవకారుడిగా జీవిం చాడు. ప్రపంచగతిని మార్చిన సిద్ధాంతం మార్క్సిజం రూపొందించడంలో మహా మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్‌కు మిత్రుడిగా, చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఒక పెట్టుబడి దారుని కుటుంబంలో పుట్టినా ఆ పెట్టుబడిదారీ వర్గ పెత్తనం సమాజానికి ఎంత కీడుచేస్తుందో అర్థం చేసుకుని ఆ వ్యవస్థ మార్పునకు జీవితాన్ని అంకితం చేసినవాడు ఏంగెల్స్. విద్యార్థిగా ఉన్న కాలంలోనే సాహిత్యం, చిత్రకళ, సంగీతం, నేర్చుకున్నాడు. గేయ రచనలు, కార్టూన్లు గీయడం చేసాడు. దృఢమైన శరీరంతో ఉల్లాసంగా ఉండేవాడు. గుర్రపు స్వారీ, కత్తిసాము, ఈతలో శక్తిమంతుడిగా ఎదిగాడు. తన 13వ ఏటనే 13వ శతాబ్ధపు ఆఫ్రికన్ యోధుల గాధలు చదివి ఉత్తేజం పొందాడు. ఏంగెల్స్ చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం వ్యాపకంగా కలిగి ఉండేవాడు. 17ఏండ్ల వయసులో ఏంగెల్స్ టేబుల్ సొరుగులో ఆఫ్రికాకు చెందిన 13వ శతాబ్దపు పోరాట వీరుని చరిత్ర పుస్తకాన్ని ఏంగెల్స్ తండ్రి చూసాడు. అందుకు కలతచెంది ఏంగెల్స్‌ను చదువు మాన్పించి మాంచెస్టర్‌లోని తన బట్టల మిల్లుకు అప్రెంటిస్ శిక్షణ పేరుతో పంపించాడు. పెద్దనౌకా కేంద్రమైన క్రెమెన్ నగరంలోని వాణిజ్య సంస్థలో పని చేయడానికి ఏంగెల్స్ వెళ్లాడు. అక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో ఇంగ్లీషు, డచ్చి, ఫ్రెంచి తదితర భాషల్లో పేపర్లు చదివేవాడు. జర్మనీలో ప్రభుత్వం చేత నిషేధించబడిన సాహిత్యాన్ని చదవడంతో ఏంగెల్స్ తన ప్రాపంచిక జ్ఞానాన్ని పెంచు కున్నాడు. ఎంతగా శక్తిని పెంచుకున్నాడంటే 19వ ఏటనే ఏంగెల్స్ తన మిత్రులకు 15 భాషల్లో లేఖలు రాసేవాడు. నిశిత పరిశీలన నేర్చుకున్నాడు. ఉప్పర్‌టాల్ అనే బట్టల మిలుల కేంద్ర నగరంలో బాలికలతో పనిచేయించుతున్న పరిస్థితులు, అక్కడ ప్రజలు ముఖ్యంగా కార్మికుల వెతలు పరిశీలిం చాడు. అక్కడి దీనగాధలు ఏంగెల్స్‌ను కదిలించి వేసాయి. 1835లో విడుదలైన డేవిడ్ స్ట్రాన్ రచించిన డాన్ లెబెన్ ఏసు (ఏసు జీవితం) గ్రంధం చదివాడు. ఆ గ్రంథం చదివాక ఏంగెల్స్ తన స్పందన తెలియ చేస్తూ ”స్పాంజిలో ఎన్ని రంధ్రాలున్నాయో మతంలో అన్ని లోపాలున్నాయి” అని తనకర్థం అయిందని రాశాడు. ఏంగెల్స్ ఆ తర్వాత కాలంలో తండ్రి మూఢత్వంను వ్యతిరేకించాడు. ఒక కొత్త ప్రాపంచిక దృక్ఫధాన్ని రూపొందించుకున్నాడు.
ఏంగెల్స్ 25 భాషలలో మాట్లాడటం, 15 భాషలలో ఉత్తరాలు, వ్యాసాలు రాసేవాడు. 1839 నుండి 42 మధ్యకాలంలో 50వ్యాసాలను రాజకీయ, సాహిత్య, తత్వశాస్త్ర అంశాలలో రాయడం కోసం ఎంతో అధ్యయనం చేసాడు. ఇంగ్లండులోని కార్మికుల స్థితిగతుల మీద పరిశీలన సాగించి ”ఇంగ్లం డులో కార్మికుల పరిస్థితి” అనే గ్రంథాన్ని రచించాడు. (మార్క్స్‌తో పరిచయం కావడానికి ముందే రాసిన గ్రంథం). ‘పవిత్ర కుటుంబం’ పేరుతో కారల్ మార్క్స్‌తో కలసి రచించిన గ్రంథం 1846లో విడుదల అయ్యింది. వ్యక్తి ముందా? సమా జం ముందా? అనేదానికి సమాజమే ముందు అని రుజువులతో సహా ఆ గ్రంథంలో బోధించారు. మార్క్స్‌తో కలసి ఏంగెల్స్ సాగిస్తున్న కృషి, వారి తాత్విక దృష్టి, వారి పట్టుదల తెలిసిన కమ్యూనిస్టు లీగ్ 1847లో కమ్యూనిస్టు ప్రణాళికను రాసే పనిని మార్క్ప్, ఏంగెల్స్‌లకు అప్పచెపితే అందుకోసం ఏంగెల్స్ విడిగా కమ్యూనిజం సూత్రాలు పేరుతో తన అభిప్రాయాలను మార్క్స్‌కు అందించాడు. 1848 ఫిబ్ర వరి 21న విడుదల అయిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో ఏంగెల్స్ ప్రతిపాదనలు చాలా భాగం ఉంటాయి. ‘జర్మన్ సిద్ధాంత సంపుటి’ గ్రంథాన్ని మార్క్స్‌తో కలసి రాశాడు. ఇందులో మానవుడి చైత న్యం- అస్తిత్వంలో అస్తిత్వం ప్రాధాన్యతను పొందు పరిచాడు. తత్వశాస్త్ర అభివృద్ది శ్రామిక వర్గానికి ఉన్న సంబంధం అవినాభావం అని, అవి ఒకదానితో ఒకటి కలసి అభివృద్ధి చెందుతాయని నిర్ధారించాడు. అప్పటికే తత్వశాస్త్రంలో మార్గదర్శకత్వం వహిస్తున్న హెగెల్ గతితర్కంను బలపరిచినా హెగెల్‌లోని భావ వాదాన్ని ఖండిం చుతూ ‘దేవుడు మనిషిని సృష్టించలేదు -మనిషే దేవుడ్ని సృషిం చాడు’ అని చెప్పి భౌతికవాదాన్ని సమున్నతంగా నిలిపాడు. వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమపాత్ర రచనల ద్వారా శ్రమైక జీవన సౌందర్యం సాధించుకోవచ్చని, ఆ దిశగా మానవ ప్రయాణం తథ్యమనే విశ్వాసాన్ని ఈ రచన కల్పిస్తుంది. నాటి యూరప్ వ్యాపంగా, ఆసియా, అమెరికాలలో ప్రజల తిరుగుబాట్లు, పోరాటాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసిన ఏంగెల్స్ తన వ్యాసాలు, రచనలు ద్వారా ప్రపంచానికి తెలిపేవాడు. మార్క్స్‌తో పాటు పెట్టుబడి రచనలో భాగస్వామి. మార్క్స్ మరణం అనంతరం పెట్టుబడి 2,3 భాగాలు ముద్రణకు ఏంగెల్స్ కృషి చేసాడు. ఇంగ్లండు, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్‌లోని వివిధ దేశాలలో 1844 నుండి 1850 వరకూ తిరుగుబాట్లు జరిగాయి. వాటిని అధ్యయనం చేసి వ్యాసాలు, రచనలు ద్వారా సమా చారాన్ని ప్రపంచానికి అందించిన ఏం గెల్స్ అనేకసార్లు తాను స్వయంగా బారికేడ్ల వద్ద తుపాకీ పట్టు కుని పోరాటాలలో పాల్గొన్నాడు. అనేక పోలీసు కేసులు ఎదుర్కొ న్నాడు. పోరా టాలలో ఏంగెల్స్ చొరవ, ప్లానింగ్ పరిశీలించిన వారందరూ ఏంగెల్స్‌ను సైనిక నిపుణుడుగా భావించేవారు. ఏంగెల్స్ 1895 ఆగష్టు 5వ తేదీన లండన్‌లో మరణించాడు.
ఏంగెల్స్ తాను మాంచెస్టర్ వెళ్తూ మార్గమధ్యలో పారిస్‌లో ఆగి కారల్ మార్క్స్‌ను కలుస్తాడు. అప్పటి నుండి ఇరువురు మిత్రులయ్యారు. ఆ మిత్రత్వం కాలక్షేపం కోసం కాదు. డిన్నర్‌లు, విందులు, వినోదాలు కోసం మాత్రమే సాగలేదు. కారల్ మార్క్స్‌ను ఏంగెల్స్ 1844 డిసెంబరు 2న పారిస్‌లో కలిశారు. ఆ సందర్భంగా వారి మధ్య ఏర్పడిన భావ సారుప్యత కారణంగా వారిద్దరూ మార్క్స్ బతికినంత కాలమే కాకుండా ఏంగెల్స్ బతికినంత కాలం కూడా మిత్రులుగానే జీవించారు. కార్మికవర్గ విముక్తి, మానవ కల్యాణం కోసం కలసి కృషిచేసారు. వారి స్నేహం పెట్టుబడిదారీ విధాన గమన సూత్రా లను పసిగట్టి ప్రపంచాన్ని ముఖ్యంగా కార్మికవర్గ కర్తవ్యాన్ని ప్రబోధించడానికి కృషికి తోడ్పడింది. మార్క్స్ పరిశోధనలు సాగించుతూ రచనలు చేయడానికి బాధ్యత తీసుకోగా ఏంగెల్స్ తాను ఉద్యోగిగా, బట్టల మిల్లు వాటాదారుగా పనిచేస్తూ వచ్చే ఆదాయాన్ని కార్మిక తిరుగుబాట్లు, ఉద్యమాలకు, మార్క్స్ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడటానికి బాధ్యత తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, ప్రగతిశీలవాదులు, సైన్సు, తత్వశాస్త్రం, అర్థశాస్త్రవేత్తలు, విప్లవకారులు ఎవరు కారల్ మార్క్స్ గురించి ప్రస్తావించు కున్నా ఏంగెల్స్ పేరును ప్రస్తా వించుంటున్నారు. వారిద్దరినీ కలిపి ఉన్న చిత్రాలలో చూస్తున్నారు. అంతటి విడదీయరాని బంధం వారిమధ్య సాగింది. డీ క్లాస్ కావడానికి మాత్రమే కాదు. విశ్వ మానవ కల్యాణం కోసం పరితపించిన ఏంగెల్స్ జీవితం స్ఫూర్తిదాయకం. ఆయన పరిశీలనా పద్ధతి, నిబద్దత, త్యాగనిరతి ముఖ్యంగా అవగాహనా తీరు ఆదర్శప్రాయం.
సెల్: 94900 98559
గుడిపాటి నరసింహారావు