వ్యవసాయం, ఎగుమతి రంగాలపై తీసుకున్న ప్రగతిశీల చర్యలపై హర్షం

– హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా
న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్ : కేంద్ర‌ బడ్జెట్‌లో వ్యవసాయం, ఎగుమతి రంగాలపై తీసుకున్న ప్రగతిశీల చర్యలపై హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రెండు సంవత్సరాల్లో కోటి మంది రైతులను సహజ వ్యవసాయ విధానాలకు మార్చే ప్రణాళిక మా సంస్థ పాటిస్తున్న సుస్థిరమైన, సేంద్రీయ వ్యవసాయ లక్ష్యాలతో పూర్తిగా అనుసంధానంగా ఉందని తెలిపారు. భారతదేశ వ్యవసాయ, పాడి పరిశ్రమలను బలోపేతం చేయడానికి సమగ్ర విధానాన్ని అవలంబించడం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ పరిమితిని ఐదు లక్షలకు పెంచడం, ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన, అగ్రి డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రోగ్రాం కింద పోస్ట్-హార్వెస్ట్ నిల్వలు, నీటి పారుదల, పంట వైవిధ్యం వంటి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
తొమ్మిది రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులతో మాకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ విధానాలు రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించి, భారత వ్యవసాయ, పాడి పరిశ్రమలను అంతర్జాతీయంగా పోటీతత్వంగా మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ప్రవేశపెట్టడం, విభాగాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించడం, ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడానికి తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామన్నారు. భారతీయ పాడి ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించేందుకు మా సంస్థ కట్టుబడి ఉందన్నారు. ఈ నూతన విధానాలు ఎగుమతి ప్రక్రియలను సులభతరం చేస్తాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాన్ని పెంచుతాయని తెలిపారు. భారతదేశంలో రెండో అతిపెద్ద లిస్టెడ్ డైరీ కంపెనీగా, ఈ చర్యలు వ్యవసాయ రంగం, గ్రామీణ సమాజ అభివృద్ధికి, భారతదేశాన్ని ప్రపంచ వ్యవసాయ ఆహార శక్తిగా మార్చే దిశగా వేగంగా ముందుకు తీసుకెళతాయని ఆశిస్తున్నాన్నారు. గ్రామీణ సమాజాన్ని సాధికారత చేయడం ద్వారా మహిళా శక్తిని పెంచి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే అవకాశం ఈ కార్యక్రమాల ద్వారా లభిస్తుందని తెలిపారు.