అనికెత్‌ రెడ్డి మాయజాలం

Aniket Reddy is magic– గెలుపు ముంగిట హైదరాబాద్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ గ్రూప్‌-బి హిమాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలుపు ముంగిట నిలిచింది!. బ్యాటర్లు, బౌలర్లు సత్తా చాటడంతో ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అనికెత్‌ రెడ్డి (5/72) ఐదు వికెట్ల మాయజాలానికి తోడు స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ (2/62) మెరవటంతో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 275 పరుగులకే కుప్పకూలింది. హిమాచల్‌ తరఫున శుభమ్‌ అరోరా (53), మహజన్‌ (68), ఆకాశ్‌ (46) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ను ఫాలోఆన్‌ ఆడించింది. ఫాలోఆన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ 5 ఓవర్లలో 21/0తో పోరాడుతోంది. హైదరాబాద్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రంజీ మ్యాచ్‌లో నేడు ఆఖరు రోజు. హిమాచల్‌ మరో 269 పరుగుల వెనుకంజలో ఉండగా.. నేడు వీలైనంత త్వరగా పది వికెట్లు పడగొట్టి విజయాన్ని అందుకునేందుకు హైదరాబాద్‌ ఎదురుచూస్తోంది.