– అసెంబ్లీ నుంచి గాంధీభవన్‌కు భారీ ర్యాలీ
– అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడుగా మంగళవారం రిటర్నింగ్ అధికారి నుంచి నియామకపత్రం అందుకున్న తర్వాత అసెంబ్లీ నుంచి గాంధీభవన్‌కు అనిల్‌కుమార్‌యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ కాన్వారుతో బాణసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనిల్ కుటుంబసభ్యులు ఉన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అనిల్‌కుమార్ విలేకర్లతో మాట్లాడారు. చిన్న వయసులో అధిష్టానం తనకు పెద్ద పదవి ఇచ్చిందనీ, ఇది నా జీవితంలో గొప్ప సంఘటన అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. . ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జుఖర్గే, రాహుల్‌గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతోపాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపుతున్నారంటే, ఇది బీసీలందరికీ గర్వకారణమన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే పార్టీ కోసం కష్టపడి పని చేశామన్నారు. ఇది అనిల్ కుమార్ విజయం కాదు యువజన కాంగ్రెస విజయమన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తమ సామాజిక వర్గానికి గొప్ప అవకాశం కల్పించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కుర్మలు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారని గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా చూస్తామన్నారు.