‘యానిమల్‌ ఆరాధ్య’

'Animal Aaradhya'ఓ వినూత్న ప్రయోగం : రామ్‌గోపాల్‌వర్మ
స్టిల్‌ ఫొటోగ్రాపర్‌ నవీన్‌ కళ్యాణ్‌ భారతీయ సినీ చరిత్రలో తొలి సారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్‌కి శ్రీకారం చుట్టారు. ఆరాధ్య దేవి ప్రధాన పాత్రతో రామ్‌గోపాల్‌ వర్మ నేతత్వంలో తెరకెక్కిన ‘శారీ’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర హీరోయిన్‌ ఆరాధ్య దేవితో నవీన్‌ కళ్యాణ్‌ ‘యానిమల్‌ ఆరాధ్య’ టైటిల్‌తో ఫొటో సిరీస్‌ రూపొందించి సరికొత్త ప్రయోగం చేశారు. ఆదివారం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫొటో సిరీస్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’అడవి మగలంటేనే అందరూ భయపడతారు. అలాంటిది మా హీరోయిన్‌ ఆరాధ్య ఎంతో ధైర్యంగా వాటిని కలుపుగోలుగా మచ్చిక చేసుకుని, ఈ ఫొటో సిరీస్‌ చేసింది. ఇలా అడివి జంతువులతో ఒక అమ్మాయి ఫొటో షూట్‌ చేయడం సమ్‌ థింగ్‌ స్పెషల్‌. భారతీయ సినీ చరిత్రలో ఇంత వినూత్న తరహాలో చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్‌ నవీన్‌ కళ్యాణ్‌ను అభినందిస్తున్నాను. ఈ నెల 28న మా ‘శారీ’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. ‘నేను ఆర్జీవీ వద్ద పదేళ్లుగా వర్క్‌ చేస్తున్నాను. ఓ రోజు నాకు ‘శారీ’ చిత్రంలోని పాటలను చూపించారు. ఆరాధ్య ఆ పాటల్లో చాలా అందంగా, హుందాగా కనిపించింది. అయితే ఆరాధ్యని ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్‌ చేద్దామని అడిగాను. దానికి ఆర్జీవీ ఎప్పుడూ రెగ్యులర్‌గా ఉండే ఫోటోలు కాదు ఏదైనా డిఫరెంట్‌గా చేయమని చెప్పారు. అప్పడు వైల్డ్‌ యానిమల్స్‌తో ఓ ఫొటో షూట్‌ చేస్తానని చెప్పాను’ అని అన్నారు. ఆరాధ్య దేవి మాట్లాడుతూ, ‘కొత్తదనం కోసం పరితపించే ఆర్జీవీ ఈ ఫొటో షూట్‌ గురించి చెప్పినపుడు, ఏ మాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాను. ఓ సరికొత్త ప్రయోగం చేశామని ఆనందంగా ఉంది. ‘శారీ’ సినిమా కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది’ అని తెలిపారు.